breaking news
Drumstick leaf
-
Sagubadi: మునగ మేలు!
సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది. నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ నేలలైనా ఓకేఅన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అక్టోబర్ వరకు విత్తుకోవచ్చుమునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. బొంత పురుగులతో జాగ్రత్తమునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ పంటలతో మునగను కలపొద్దుఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుకత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపుమునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొక్కకు 150 కాయలుఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.మునగ ప్రకృతి సేద్యం ఇలా..మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754 -
మునగాకు తోట... రెండు నెలలకో కోత!
మునగ సకల పోషకాల గని అని మనకు తెలుసు. సాంబారులో మునక్కాడలు వేసుకోవటం కూడా అందరికీ తెలుసు. అయితే, కాయల్లో కన్నా ఆకుల్లో ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తమిళనాడులో, సరిహద్దు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మునగ ఆకును ఆకుకూరగా వాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు రైతులు మునగాకు పొడిని అమ్ముతున్నారు. ఈ పొడితో బిస్కట్లు తదితర ఆహారోత్పత్తులను సైతం తయారు చేసి స్థానికంగానే కాదు, విదేశాలకూ అమ్ముతున్నారు. పొలాల్లోనే కాదు, పెరట్లో కూడా మునగ ఆకుని పండించుకునే ఓ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...తక్కువ స్థలంలో ఎక్కువ మునగ ఆకులు పండించే సాంద్ర వ్యవసాయ పద్ధతి (ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టం) ఇది. పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. మరి ఇంటి పెరట్లోనే ఇంటెన్సివ్‌గా మునగాకు తోటలను సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలో కొద్దిపాటి స్థలంలో మునగ తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. ఇంటి పెరట్లోనే కాదు.. పార్కుల్లోని ఖాళీ స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మనుగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. దీనికి అనుసరించాల్సిన పద్ధతులు వరుస క్రమంలో...1. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఇంటిపెరటిలో ఎంపిక చేసుకోవాలి. ఇందులో రెండడుగులు లోతు తవ్వాలి. 2. తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి. 3. తవ్విన గుంతను తిరిగి సేంద్రియ ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది. 4. మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించి గుర్తు పెట్టుకోవాలి.5. మునగ విత్తనాలను నాటుకోవాలి. 6. విత్తనాలపై గడ్డిని పరిచి ఆచ్ఛాదన కల్పించాలి. నీటి తడులివ్వాలి. 7. పెంపుడు జంతువులు, పశువుల నుంచి రక్షణ కల్పించాలి.8. నెల రోజుల వయసున్న మునగ మొక్కలు9. 5 వారాల వయసున్న మునగ మొక్కలు10. 6 వారాల వయసున్న మునగ మొక్కలు11. మూడోసారి కోతకు సిద్ధం 12. భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి. 13. ఒక పక్క నుంచి కత్తిరించుకుంటూ వెళ్లాలి.14. పూర్తిగా కోసిన మునగ మడి15. కొమ్మలను పరదాపై నీడకింద ఆరబెట్టాలి.16. మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా ఆకుల దిగుబడి వస్తుంది.17. కొమ్మలను పరదాపై నీడ కింద ఆరబెట్టాలి. 20 కిలోల ఆకును నీడలో ఆరబెడితే కిలో మునగాకు పొడిని తయారు చేసుకోవచ్చు. 18. ప్రతి 50–60 రోజులకు ఒకసారి మునగ ఆకు కోతకు సిద్ధమవుతుంది. తాజా ఆకును వాడుకోవచ్చు లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పొడిని తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కల మోళ్లు మళ్లీ చివురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. తోట ద్రవ జీవామృతం, ఘనజీవామృతం వంటివి తగుమాత్రంగా వాడుతూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటే.. ఈ సాంద్ర మునగ ఇలా ఏళ్ల తరబడి పోషకాల గని వంటి మునగాకును ఇస్తూనే ఉంటుంది.ఆరు నెలలు పోషకాలు సేఫ్!భారత ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సమాచారం ప్రకారం.. మునగాకు పొడి – ఒక అద్భుతమైన ఆహార పదార్థం. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు విశేషంగా ఉన్నాయి. పోషకాహార లోపం గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకు ఉపయోగపడే పోషకాలను ఇస్తుంది. ఏ ఆహారంతోనైనా దీన్ని కలిపి తీసుకోవచ్చు.విత్తనం, మొక్క నాటుకోవాలనేమీ లేదు. కొమ్మను విరిచి నాటితే వేరు పోసుకొని చెట్టుగా ఎదుగుతుంది.చెట్లు నాటుకున్న తరువాత ఎప్పుడైనా మునగాకులు కోసుకోవచ్చు.⇒ మునగ తోటల్లో సంవత్సరానికి 6–9 సార్లు కొమ్మలను భూమి నుండి 15–50 సెం.మీ. ఎత్తు వరకు కత్తిరించుకోవచ్చు⇒ కొమ్మల నుంచి కోసుకున్న తాజా మునగాకును నీటిలో బాగా కడిగి శుభ్రపరచాలి ∙ఆకులను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో సహజంగా ఎండబెడితే, ఆకుల్లో ఉన్న విటమిన్లు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. పొడి చేయటానికి సులువుగా ఉంటుంది ⇒ ఇలా ఎండిన ఆకులను దంచటం ద్వారా లేదా పిండిమర ద్వారా పొడి చేసుకోవచ్చు ⇒ పొడిని గాలిచొరపడని, తేమలేని సీసాలో పోసుకొని సూర్యరశ్మి తగలకుండా భద్రపరచుకోవాలి ⇒ మునగాకు పొడిని 24 డిగ్రీల సెల్షియస్ కన్నా తక్కువ శీతోష్ణస్థితిలో ఉంచితే, 6 నెలల వరకు తాజాగా పోషక విలువలేవీ కోల్పోకుండా ఉంటుంది ⇒ మునగాకు పొడిని ఆహార పదార్ధాల్లో గాని, పానీయాల్లో గాని కలుపుకోవచ్చు. మునగాకు పొడిని ఆహార పదార్థాలు పూర్తిగా వండిన తర్వాత కలుపుకుంటే పోషక విలువలు మనకు పూర్తిగా లభ్యమవుతాయి. -
సేంద్రియ పద్ధతిలో మునగ సాగుతో లాభాలు
-
మునగకు మార్కెట్ లో ఎప్పుడూ మంచి డిమాండ్
-
మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు
మసాలా మజ్జిగకి కావలసినవి : పెరుగు – ఒకటిన్నర కప్పులు జీలకర్ర పొడి – అరటీస్పూను పుదీనా తరుగు – టేబుల్ స్పూను బ్లాక్ రాక్‌సాల్ట్ – అరటీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను కరివేపాకు తరుగు – అరటీస్పూను మునగాకు పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను చల్లని నీళ్లు – రెండు గ్లాసులు. తయారీ విధానం: ∙మిక్సీజార్‌లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మునగాకుపొడి, జీలకర్ర పొడి, రాక్‌సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ∙ఇవన్నీ నలిగిన తరువాత పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ∙ఈ మిశ్రమంలో నీళ్లు పోసి కలుపుకుని, దాల్చినచెక్క పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!) -
నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!
మునగ పువ్వులుతో చేసే ఫ్లవర్ ఫ్రైకి కావలసినవి : మునగ పువ్వులు – రెండు కప్పులు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అరటీస్పూను ఉల్లిపాయ తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు గుడ్లు – మూడు కరివేపాకు – రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం: ∙మునగ పువ్వులను నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ∙ఇవన్నీ వేగాక మునగపువ్వులు, కరివేపాకు వేసి కలపాలి ∙ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ∙పువ్వులు మగ్గాక గుడ్లసొన వేసి కలపాలి. ∙చక్కగా వేగాక, రుచికి సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ∙చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. నిమ్మరసం చల్లుకుని అన్నం, చపాతీల్లోకి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: మురిపముగా.. మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!) -
మురిపముగా..మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!
మొరింగా దోశ తయారీకి కావలసినవి : మునగ ఆకులు – రెండు కప్పులు ఇడ్లీ పిండి – రెండు కప్పులు నూనె – మూడు టీస్పూన్లు జీలకర్ర – అరటీస్పూను మిరియాలు – అరటీస్పూను వెల్లుల్లి రెబ్బలు – నాలుగు; ఇంగువ – చిటికెడు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: ∙బాణలిలో రెండు టీస్పూన్లు నూనె వేసి వేడెక్కనివ్వాలి. ∙కాగిన నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ∙ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మునగ ఆకులు వేయాలి. ఆకుల్లోని నీరంతా ఇగిరిపోయాక దించేయాలి. ∙మునగ ఆకుల మిశ్రమం చల్లారాక ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ∙ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ పేస్టుని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ∙దోశపెనం వేడెక్కిన తరువాత పిండిని దోశలా పోసుకుని, టీస్పూను నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మొరింగాదోశ రెడీ. సాంబార్, కొబ్బరి చట్నీలు దీనికి మంచి కాంబినేషన్. (చదవండి: విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు..) -
మునక్కాడ మటన్.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే
Mutton Mulakkada Curry in Telugu: శాకాహారమైనా మాంసాహారమైనా మునక్కాడలు, మనగాకు చేరితే ఆ ఘుమఘుమలే వేరు. తినగ తినగ మునగలో తీరైన రుచులుండు అన్నట్టు మునగ వంటలను తింటూ లొట్టలేయకుండా ఉండలేరు. మునక్కాడ మటన్ కావలసినవి: మటన్ – అరకేజీ; మునక్కాయలు – 3 (3 అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 3; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; పసుపు – చిటికెడు; కొబ్బరి తురుము – అర టీ స్పూన్; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; గరంమసాలా – అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో– 1 (తరగాలి); కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత; నూనె – సరిపడా తయారుచేయు విధానం: ► మటన్ ని శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి. కొద్దిగా కారం, ఉప్పు, గరంమసాలా కలిపి స్టౌ మీద పెట్టి రెండు–మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. ►స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి. నూనె పోసి, బాగా వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి, వేయించాలి. ►తరువాత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలపాలి. ఇందులో మునక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ►రెండు నిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి, టొమాటో ముక్కలు వేసి, ఓ పదినిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి, దించాలి. -
రికార్డు సృష్టిస్తున్న మునక్కాయ ధరలు.. ఏకంగా..
కూరగాయల రేట్లు జనానికి వణుకు పట్టిస్తున్నాయి. శీతాకాలంలో చలితో పాటు.. ధలు పోటీ పడుతున్నాయి. కొన్నివెజిటేబుల్స్ అయితే.. నాన్ వేజ్‌తో పాటీ పడుతున్నాయి. ఇలా పలు రకాలైన కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సెంచరీ దాటిన టమాటా ధరలు ఇప్పుడిప్పుడే కొద్ది మేర తగ్గుముఖం పడుతుండగా.. తాజాగా మునక్కాయ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: శుభకార్యాల్లో మునక్కాయ చారు లేకుంటే ఏం బాగుంటుంది? అందువల్లే పెళ్లిళ్ల సీజన్ వస్తే మునగ ధర చెట్టెక్కి కూర్చుంటుంది. చిక్కబళ్లాపుర మార్కెట్లో కేజీ మునక్కాయలు రూ. 400 ధర పలుకుతున్నాయి. కానీ కొనుగోళ్లు తగ్గడం లేదు. చలి కాలం కావడం, పెళ్లిళ్లు ప్రారంభం కావడంతో మునగకు డిమాండ్ పెరిగింది. అతివృష్టి వల్ల జిల్లా చుట్టుపక్కల మునగ పంట దెబ్బతినింది. దీంతో వ్యాపారులు పూణె నుంచి తెప్పిస్తున్నారు. ఎంత ధరయినా కొనడం తప్పదని కొందరు అన్నారు. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
ఇమ్యూనిటి బూస్టింగ్ డ్రింక్ తయారు చేసుకోండిలా!
తాజాగా ఉన్న మునగాకులను అరకప్పు తీసుకుని దానిలో విత్తనం తీసేసిన పచ్చి ఉసిరికాయను ముక్కలుగా కోసి వేయాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో అరగ్లాసు నీళ్లు పోసి జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత జ్యూస్‌ను వడగట్టి రోజూ పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ ఆకులు అందుబాటులో లేనివారు, వీటికి బదులు కొత్తిమీర, పుదీనాను వాడ వచ్చు. ఉసిరి కాయ లేకపోతే మునగ ఆకుల పేస్టులో నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇమ్యూనిటీ పేస్ట్! నాలుగు కరివేప ఆకులు, తులసి ఆకులు నాలుగు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి. ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోని తినాలి. రోజూ ఏదోక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. బ్యూటిప్స్ బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకోవడానికి.. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని పది నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. -
రుచుల్లో "మున"గండి...
తెలుగులో మునగకాడ...ఇంగ్లీషులో డ్రమ్‌స్టిక్...లేదు మునగకు సాటి... రుచిలో లేదు పోటీ...వెరైటీలో లేదు దీనికి సరిసాటి...విందులో మునగ పరిపాటి...అంటూ... ఈ వంటల రుచులనుడప్పుకొట్టి మరీ ఊరంతా చెప్పొచ్చు... మునగాకు పప్పుకూర కావలసినవి: తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు – ఒక పెద్ద కప్పు; కందిపప్పు – చిన్న గ్లాసుడు; పసుపు – చిటికెడు; ఇంగువ – అర టీ స్పూన్; నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర ఒక టీ స్పూన్; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత. తయారీ: ముందుగా స్టౌ వెలిగించి, మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి, సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి ∙వేగిన కందిపప్పును రెండు సార్లు నీళ్లతో కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙పప్పు సగం ఉడికాక, కడిగిన మునగాకు జత చేసి కలియబెట్టాలి ∙పసుపు, ఉప్పు, ఇంగువ జత చేయాలి ∙కందిపప్పు ఉడికి బద్దబద్దలుగా ఉన్నప్పుడే నీరంతా ఇగిరి పోయాక దించుకోవాలి ∙వేరే స్టౌ మీద కళాయి పెట్టి నూనె వేసి పోపు వేయించుకోవాలి ∙ఉడికించుకున్న మునగాకు పప్పు వేసి బాగా కలిపి సన్న సెగ మీద కాసేపు ఉంచి, స్టౌ మీద నుండి దించి, బౌల్లోకి తీసుకోవాలి. ఈ పప్పుకూరకు మునగాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. (కుకర్‌లో వండకూడదు. పప్పు పొడిపొడిలాడుతూ ఉంటేనే చూడటానికి, అన్నంలో తినడానికి రుచిగా ఉంటుంది). మునగాకు రసం కావలసినవి: మునగాకులు – ఒక కప్పు; మునగకాడలు–1 పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; చింతపండు – నిమ్మకాయంత; బెల్లం – 2 టీ స్పూన్లు; చారు పొడి – 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను. పోపు కోసం... ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను. తయారీ: మునగాకును నీళ్లల్లో వేసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి ∙బాగా మరిగాక ఆకులను వడకట్టగా వచ్చిన నీళ్లలో చిక్కగా తీసిన చింతపండు రసం పోసి, స్టౌ మీద ఉంచాలి ∙మునగ కాడను ముక్కలుగా తరిగి అందులో వేయాలి. పసుపు, ఉప్పు, బెల్లం, టొమాటో తరుగు, ఇంగువ, పచ్చిమిర్చి జత చేసి బాగా మరగనివ్వాలి ∙మరొక స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, మరుగుతున్న మునగాకు రసంలో వేయాలి ∙మరికాస్త మరిగాక చారు పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత దింపాలి ∙ఇది చాలా సువాసనతో, రుచిగా బాగుంటుంది (ఇష్టమైతే పోపులో వెల్లుల్లిపాయ దంచి వేసుకోవచ్చు). మునగాకు పొడి కావలసినవి: కాడలు లేకుండా కడిగి నీడలో ఆరపెట్టిన మునగాకు – రెండు కప్పులు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 8 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 5 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు;ఎండు మిర్చి – 10 ;చింతపండు – చిన్న నిమ్మకాయంత;నూనె – 4 టీ స్పూన్లు. తయారీ: స్టౌ వెలిగించి, కడాయి పెట్టి, అందులో నూనె వేసి కాగాక ధనియాలు, సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేగాక, ఎండు మిర్చి జత చేసి అవి కూడా వేగాక, మునగాకు వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి ∙వేయించుకున్నపదార్థాలు చల్లారాక, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి, (మరీ మెత్తగా ఉండకూడదు), చిన్న చిన్న ఉండలుగా చేసి, తడి లేని సీసాలో భద్ర పరచుకోవాలి ∙ఇది పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ∙రోజూ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తింటే వాతాన్ని హరిస్తుంది. మునగాకుపచ్చడి కావలసినవి: మునగాకు – 5 కప్పులు; ఎండు మిర్చి – 15; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – అర కప్పు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 4 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు. తయారీ: మునగాకు కడిగి నీడలో ఆరపెట్టుకోవాలి ∙చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వు పప్పు వరుసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేగాక ఎండు మిర్చి జత చేసి వేయించి, చల్లార్చాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మునగాకు, పసుపు వేసి కొద్దిగా వేయించి దింపేయాలి ∙వేయించుకున్న పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు, మునగాకు, నానపెట్టిన చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మిరప కారం, ఇంగువ వేసి వేయించి, దింపి, పచ్చడిలో వేసి కలపాలి. మునగ ఆవకాయ కావలసినవి: మునగ కాడలు – 6 ఆవపిండి – 100 గ్రా.; వేయించిన జీలకర్ర పొడి – 50 గ్రా.; వేయించిన మెంతుల పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు కిలో; ఇంగువ – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – పావు కిలోకి తక్కువ; పప్పు నూనె/ వేరుసెనగ నూనె – పావు కేజీ; నానబెట్టి రుబ్బిన చింతపండు గుజ్జు – ఒక కప్పు. తయారీ: మునగ కాడలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక, తరిగిన మునగ కాడ ముక్కలు, ఉప్పు వేసి మగ్గిన తరవాత దింపేయాలి ∙కాస్త చల్లారి, మెత్తబడ్డాక మిరప కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పిండి వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కొద్దిగా కాచి దింపేయాలి ∙చింతపండు గుజ్జు జత చేసి, బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మునగ కాడల పచ్చడిలో వేసి కలియబెట్టాలి ∙రెండు రోజులకు పులుపు, కారం మునగ కాడలకు పట్టి, ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. (గమనిక: లేత కాడలను మాత్రమే ఉపయోగించాలి. ముదురు కాడలను ఉపయోగిస్తే ఆవకాయ రుచిగా ఉండదు) కొబ్బరి–బెల్లం మునగకాడల కూర కావలసినవి: మునగ కాడలు – 6; కొబ్బరి చిప్ప – ఒకటి ; బెల్లం – చిన్న గ్లాసుడు; నానపెట్టిన బియ్యం – చిన్న గ్లాసుడు. పోపు కోసం... ఎండు మిర్చి – 4; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు– తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ముందు రోజు రాత్రి ఒక గ్లాసు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టాలి ∙ మరుసటి రోజు ఉదయం, నీళ్లన్నీ ఒంపేసి, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙కొబ్బరి, బెల్లం జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙స్టౌ వెలిగించి, దాని మీద బాణలి ఉంచి, అది వేడయ్యాక, ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడి చేయాలి ∙పోపు సామానులు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పోపును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ∙అదే మూకుడులో కొద్దిగా నీళ్లు పోసి అందులో మునగ కాడ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, మిక్సీ పట్టిన కొబ్బరి, బెల్లం, బియ్యం ముద్ద జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ∙బాగా దగ్గర పడుతుండగా ఉడికించిన మునగ కాడలు, పోపు జత చేయాలి ∙కరివేపాకు, ఉప్పు వేసి గరిటెతో కలిపి కొద్దిసేపు మగ్గిన తరవాత దింపేయాలి ∙అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ∙విడిగా టిఫిన్లా తిన్నా కూడా బాగుంటుంది. మునగ –టొమాటో కూర కావలసినవి: మునగ కాడలు – 3; టొమాటోలు – అర కిలో; ఉల్లిపాయలు – 2; కొత్తిమీర – చిన్న కట్ట; పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత పోపు కోసం... ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ మునగ కాడలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙టొమాటోలు, ఉల్లిపాయలను కూడా సన్నగా తరగాలి ∙స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక, పోపు దినుసులు ఒకదాని తరవాత ఒకటి వేసి, దోరగా వేయించాలి ∙ఎండు మిర్చి, ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙టొమాటో తరుగు, మునగ కాడ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙ సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి∙బాగా ఉడికిన తరవాత, మిరప కారం వేసి బాగా కలిపి ఒక నిమిషం తరవాత దింపేయాలి ∙కూరను ఒక బౌల్లోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి రుచిగా ఉంటుంది. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
మునగాకు సాగు ఇలా..
పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. కొన్ని ప్రాంతాల్లో మునగాకు ఉత్పత్తులను రోజు వారీ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇటీవల కాలంలో నగరాల్లోనూ పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మునగ ఆకును సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలోనో లేదా పొలంలోనో కొద్దిపాటి స్థలంలో మునగ ఆకు తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. సామాజిక స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మునగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. ఎండిన కాడల నుంచి ఆకును సేకరించాలి. తాజా ఆకును వాడుకోవచ్చు. లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పౌడర్ తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. మునగ తోట ఏళ్ల తరబడి ఆకును ఇస్తూ ఉంటుంది. అదెలాగో చదవండి మరి.. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ 2 అడుగులు లోతు మట్టి తవ్వాలి తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి తవ్విన గుంతను లేదా మడిని మట్టి, ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది చెక్కముక్కలను ఉపయోగించి మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించుకోవాలి తర్వాత మునగ విత్తనాలు నాటుకోవాలి విత్తనాలు విత్తిన తర్వాత గడ్డిని పరచి ఆచ్ఛాదన కల్పించి, నీటి తడులివ్వాలి పెంపుడు జంతువులు, పశువుల నుంచి మడికి రక్షణ కల్పించాలి మడిలో నెల రోజుల్లో ఏపుగా, వత్తుగా పెరిగిన మునగ మొక్కలు 5 వారాల్లో మునగ మొక్కలు ఇలా కనువిందు చేస్తాయి 6 వారాల వయసున్న మునగ మొక్కలు భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి కొమ్మలను నీడలో ఆరబెట్టాలి 50–60 రోజులకల్లా మళ్లీ మునగ తోట కోతకు సిద్ధంగా ఉంటుంది మూడోసారి కోతకు సిద్ధంగా ఉన్న మునగ మొక్కలు మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా రెమ్మల దిగుబడి వస్తుంది -
మునగ చెట్లను గుబురుగా పెంచడం ఎలా?
► మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో – మునగ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలి. ► తోటలో మునగ చెట్టు ఉంటే, ఒక కాయగూర – ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్టు! ► కాయలనూ–ఆకునూ వినియోగించుకోవచ్చు. ► మునగ బహుళ ప్రయోజనకారి. సులభంగా పెరుగుతుంది. తొందరగా కాపునకు వస్తుంది. ► మునగ చెట్టును పెంచడంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. చెట్టును గుబురుగా పెంచాలి. ► ప్రతి అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట, తిరిగి రెండు చివుళ్లు వస్తాయి. ► అలా ఎప్పుడూ చేస్తూ ఉండాలి! ► దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. ఆకు కోసి కూర వండుకోవచ్చు. లేనట్లయితే, చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ► చిన్న మొక్కల పూతను కూడా తుంచెయ్యాలి. లేకపోతే చెట్టు ఎదగదు! ► మొక్క నాటిన లేదా విత్తనం వేసిన తర్వాత కనీసం, ఆరేడు నెలలు పూతను తుంచెయ్యడంవల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. అలా ఎదిగాక పూతను ఉంచాలి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు f:/Tummeti Raghothama Reddy 1. మునగ మొక్క సన్నగా, నిటారుగా పెరుగుతుంటుంది. 2.3. కొమ్మల చివరలను, లేత మొక్కల పూతను తుంచుతూ ఉంటే.. ఎక్కువ కొమ్మలు వస్తాయి. 4. గుబురుగా పెరిగిన మునగ మొక్క నుంచి ఆకును కోసుకోవచ్చు. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మునగాకు సాగు మేలు
ఈ రైతన్న దారే వేరన్నా.. మునగాకు సాగుతో ఎకరానికి రూ. లక్షన్నర వరకు ఆదాయం 20 రకాల పశుగ్రాసాల నర్సరీ, విత్తన నిధి ఏర్పాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై చిన్న రైతులకు ఉచిత సేవలు కొత్త పంటలతో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న విద్యాధిక రైతు రాజేంద్రరెడ్డి ఉన్నత వ్యవసాయ విద్యను అభ్యసించి..వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వాళ్లేమి చేయాలి? ఆ ప్రాంతంలో సాధారణ రైతుల ఊహకు కూడా అందని కొత్త దారి తొక్కాలి.. విభిన్నమైన పంటలు పండించాలి.. తక్కువ ఖర్చుతో అధికాదాయం వచ్చే పంటల సాగు చేయాలి.. పర్యావరణహితమైన, అత్యాధునికమైన సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు లోకానికి అన్ని విధాలా మార్గదర్శకులుగా నిలవాలి.. అప్పుడే వారి చదువుకు సార్థకత చేకూరుతుంది.. జన్మనిచ్చిన గడ్డ రుణం కొంతైనా తీరుతుంది! ఎమ్మెస్సీ పట్టాపొంది.. సేంద్రియ వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన సన్నాడి రాజేంద్రరెడ్డి సరిగ్గా ఇదే చేస్తున్నారు!! అందరూ పండించే పంటల జోలికిపోకుండా.. విలక్షణమైన పంటలతో కొత్త బాటలు వేస్తున్నారు.. రాజేంద్రరెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని రౌతుసూరవూల. తాతల కాలం నుంచి వారిది వ్యవసాయ కుటుంబం. ఢిల్లీలో ఏజీ ఎమ్మెస్సీ చదివి పదేళ్ల పాటు సుస్థిర వ్యవసాయ సలహాదారుగా వివిధ సంస్థల్లో పనిచేశారు. ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్‌లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రెండేసి వారాల పాటు అక్కడి రైతులకు శిక్షణనిచ్చిన అనుభవం ఆయన సొంతం. తండ్రి సురేంద్రనాథ్‌రెడ్డి మరణంతో స్వగ్రామానికి చేరుకొని 20 ఎకరాల సొంత పొలంలో ఎనిమిదేళ్లుగా ఆదర్శప్రాయమైన వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు ఖర్చును సగానికి సగం తగ్గించుకుంటూనే చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మునగాకు సాగు ఇలా.. మునగ ఆకును పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ.. ఎకరానికి ఏడాదికి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి 160 మొక్కలు చొప్పున ఐదెకరాల్లో మామిడి, ఎకరంన్నరలో సపోటా, అరెకరంలో జామ తోటలు వేసిన రాజేంద్రరెడ్డి.. మరో మూడున్నర ఎకరాల్లో మునగ తోటను కాయల కోసం కాకుండా కేవలం ఆకు కోసమే సాగు చేస్తున్నారు. అడుగుకొకటి చొప్పున ఎకరానికి 43,000 మునగ మొక్కలు(పీకేఎం, కరుంబు మునుంగ రకాలు) వేస్తున్నారు. 6 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేసిన మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పిచికారీ చేయడంతో ఆకులపై దుమ్ము, పురుగుల గుడ్లు ఎప్పటికప్పుడు కడిగినట్లయి నాణ్యమైన దిగుబడి వస్తోంది. ఎకరానికి టన్ను- టన్నున్నర వర్మీ కంపోస్టు, టన్ను వేప పిండి వేస్తున్నారు. ఆవు మూత్రం, పేడ, మజ్జిగ, లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా తదితరాలను కలిపి తయారు చేసుకున్న ‘బయో బూస్టర్’ను 10-15 రోజులకోసారి.. 1:9 పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. గొంగళి పురుగు నివారణకు వావిలాకు కషాయాన్ని పిచికారీ చల్లుతున్నారు. 45 రోజులకోసారి మునగ కొమ్మలు నరికి ఆకును ఎండబెడతారు. ఎకరంలో ఏడాదికి టన్ను- టన్నున్నర బరువైన ఎండు మునగాకు దిగుబడి వస్తుంది. ఎకరానికి రూ. 30 వేల వరకు ఖర్చవుతున్నదని రాజేంద్రరెడ్డి చెప్పారు. ముందస్తు ఒప్పందం మేరకు ‘ఆర్గానిక్ ఇండియా’కు ఎండు మునగాకును కిలో రూ. వంద ధరకు అమ్ముతున్నారు. ఆ సంస్థ మునగాకును అమెరికాకు ఎగుమతి చేస్తోంది. క్యాల్షియం లోపాన్ని తీర్చి, 350-400 వ్యాధులను అరికట్టే సేంద్రియ మునగాకుకు అమెరికాలో గిరాకీ ఉందంటూ.. అయితే ‘పేదలు తినే ఆహారం’గా భావిస్తూ మునగాకును మన వాళ్లు దీన్ని విస్మరిస్తున్నారని రాజేంద్రరెడ్డి అన్నారు. వుునగాకుతో తయూరు చేసిన తేనీరును తాగితే రోగనిరోధకశక్తి పెంపొందడమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు కూడా దూరవువుతాయుని శాస్త్రీయుంగా రుజువైనట్లు ఆయన చెప్పారు. గడ్డి మొక్కల నర్సరీ, విత్తన నిధి! డెయిరీలు నెలకొల్పుతున్న పాడి రైతులు మేలైన వివిధ గడ్డి జాతుల పిలకలు, విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ అవసరాన్ని గుర్తించిన రాజేంద్రరెడ్డి వుధ్యప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి సేకరించి.. బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఐదెకరాల్లో 20 రకాల మేలైన గడ్డి జాతుల నర్సరీని, విత్తన నిధిని ఏర్పాటు చేశారు. కో-4 వంటి అధిక దిగుబడినిచ్చే గడ్డి జాతి నుంచి బెట్టను తట్టుకునే జాతులు, గొర్రెలు, మేకల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన గడ్డి జాతులను ఆయన సాగు చేస్తూ రైతాంగానికి అందుబాటులో ఉంచారు. 45 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది. ఎకరంలో ఏడాదికి 160 టన్నుల గడ్డి దిగుబడిని పొందుతున్నారు. పిలకలు లేదా విత్తనంతో నిరంతరాయంగా పదేళ్ల వరకు గడ్డిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. గొర్రెలు, మేకలు, ఆవులు.. వ్యవసాయుక్షేత్రంలో పంటలతో పాటు ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే 60 నారీ సువర్ణ రకపు గొర్రెలను పెంచుతున్నారు. ఇవి రెండేళ్లలో మూడు సార్లు ఈనుతాయి. 20 తలచూర్ మేకలతోపాటు.. టీటీడీ సౌజన్యంతో గోశాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. సువూరు 50 వరకు ఒంగోలు, నాటు ఆవులు ఉన్నాయి. కబేళాకు తరలించే వాటిని రక్షించి తెచ్చి పెంచుతున్నానని, వీటిని ఆప్యాయుంగా నివుురుతుంటే గొప్ప ఆత్మానందం కలుగుతుందని రాజేంద్రరెడ్డి అంటున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయు నిపుణులు, రైతులు సందర్శించి స్ఫూర్తి పొందుతుంటారు. వుహారాష్ట్రలోని నివ్కుర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ చందానివ్కుర్, ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయుం(తిరుపతి) వీసీ డాక్టర్ ప్రభాకర్ రావు సందర్శించి ఆయన కృషిని అభినందించారు. వుదనపల్లిలోని రిషివ్యాలీ స్కూల్ విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించి సాగు విజ్ఞానాన్ని వుదినిండా పదిలపరుచుకొని వెళ్లారు. అందరూ పండించే సాధారణ పంటలు కాకుండా.. తనకు మంచి ఆదాయాన్నివ్వడంతోపాటు ఇతర రైతులకూ ఉపయోగపడే పంటలను పండిస్తూ.. తక్కువ ఖర్చుతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం దిశగా దృఢ చిత్తంతో అడుగులు వేస్తున్న రాజేంద్ర రెడ్డి రైతాంగం మదిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు. వ్యవసాయాన్ని కొత్త ఆలోచనలతో సుస్థిరం చేసే సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తున్నారు. - చెంచురెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా సేంద్రియ సాగుతో ఖర్చు తగ్గుతుంది! అన్ని పనులూ స్వయంగా చేసుకోగలిగిన రైతులకు సేంద్రియ వ్యవసాయం ఎంతో ఉపయోగం. ఖర్చు 50% తగ్గుతుంది. అన్ని పనులకూ కూలీలపై ఆధారపడితే మాత్రం ఖర్చు తగ్గదు. సేంద్రియ ఫలసాయానికి 25% వరకు అధిక ధర వస్తుంది. ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పించగలిగితే రైతు సులభంగా సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గుతాడు. ఎరువులు, పురుగుమందుల దుకాణదారుల మాటలపై ఆధారపడుతున్న రైతులకు సకాలంలో సరైన సలహా ఇవ్వగలిగితే వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి రైతునూ సేంద్రియ రైతుగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చిన్న రైతులకు ఉచితంగానే సలహాలు సూచనలు ఇస్తున్నా. గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ సలహాదారులుగా తీర్చిదిద్దాలి. - సన్నాడి రాజేంద్రరెడ్డి(9347021752), సేంద్రియ రైతు, సుస్థిర వ్యవసాయ నిపుణుడు, రౌతుసూరవూల, తొట్టంబేడు మండలం, చితూరు.