breaking news
draft list of voters
-
ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సాయం ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. -
ఓటర్ల నమోదు గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇరు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. గత నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్లగా నమోదు, జాబితాల్లో సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. దరఖాస్తులను, అభ్యంతరాలను 28వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటిస్తామన్నారు. ‘సీఈవోఆంధ్రా, సీఈవోతెలంగాణ’ సైట్ల ద్వారా ఓటర్గా నమోదుచేసుకోవచ్చన్నారు.