breaking news
doway death
-
ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!
కోలారు: తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర (25) అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో ఉరికి వేలాడుతోంది. వీరికి యేడాది క్రితమే పెళ్లయింది. కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని తెలిసింది. వారే హత్య చేశారని మృతురాలి అక్క శ్వేత ఆరోపిస్తోంది. ఘటన తరువాత భర్త, కుటుంబీకులు పరారయ్యారు. సిఐ శివరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు మానవతా దృక్పథంతో ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న మహిళకు.. డెలివరీ కోసం బెయిల్ మంజూరు చేసింది. వరకట్న వేధింపుల కోసులో శిక్ష అనుభవిస్తున్న అయిదు నెలల గర్భిణికి న్యాయస్థానం 11 నెలల పాటు బెయిల్ ఇచ్చింది. అన్న భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో దోషిగా తేలిన భావనా ప్రజాపతి(30) అనే మహిళకు ప్రసవించేందుకు కోర్టు ఈ వెసులుబాటును కల్పించింది. ప్రసవం అనంతరం బిడ్డతో సహా ఈ ఏడాది డిసెంబర్ 31న కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పదివేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో శిక్షా కాలాన్ని తగ్గించాల్సిందిగా భావన పెట్టుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ కె సయీద్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భావనా ప్రజాపతికి మంజూరు చేసింది. దీంతోపాటుగా జైలుకి తిరిగి వచ్చిన అనంతరం రెండేళ్ల కుమార్తె సహా, నవజాత శిశువు ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించింది. అటు కోర్టు నిర్ణయంపై భావన హర్షం వ్యక్తం చేసింది. అయితే తప్పు ఏమీ లేకపోయినా తన బిడ్డలు శిక్ష అనుభవించడం బాధ కలిగిస్తోందని వాపోయింది. ఇక కేసు పూర్వపరాల్లోకి వెళితే... భావన సోదరుడు భార్య జల్పా ప్రజాపతి ఆత్మహత్య కేసులో భావనతో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేశారు. అదనపు కట్నం కోసం కుటుంబం తీవ్రంగా హింసించడం మూలంగానే ఆమె ఆత్యహత్య చేసుకుందన్న కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.