breaking news
doctors arrested
-
కరోనా: డాక్టర్లపై లాఠీఛార్జ్.. అరెస్ట్
ఇస్లామాబాద్ : చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు, సైంటిస్టులనే దేవుళ్లుగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యసిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల కనీస ధర్మం. అయితే వారికి అవసరమైన సామాగ్రిని అందించకపోగా, నిరసన తెలిపిన డాక్టర్లు, వైద్యసిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేసింది పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న 53 మంది డాక్టర్లు, వైద్యసిబ్బందిని అరెస్ట్ చేసినట్లు క్వెట్టా పట్టణ పోలీస్ సీనియర్ అధికారి అబ్దుల్ రజాక్ మీడియాకు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే?? ‘కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. పీపీఈ కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రి ముందు నిరసన తెలిపాం. అంతేకాకుండా మేమేందరం(డాక్టర్లు, వైద్య సిబ్బంది) సీఎం ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు’అని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే? అయితే డాక్టర్లు, వైద్యసిబ్బంది అరెస్ట్‌పై బలుచిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ‘పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమేనని అంగీకరిస్తున్నాం. అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్ చేశాం’అని బులచిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక డాక్టర్లపై లాఠీచార్జ్, అరెస్ట్ చేయడంపై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో డాక్టర్లను కాపాడుకోవాల్సింది పోయి ఆరెస్ట్ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,469కి చేరింది. బలుచిస్తాన్‌లో 192 కేసులు నమోదు అయ్యాయి. పాక్‌లో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు వెల్లడించాయి. చదవండి: పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్? అమెరికాలో మరింత తీవ్రం! -
కళ్లు తెరవక ముందే కాటికి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు రేడియాలజీ సెంటర్లు అడ్డదారులు తొక్కుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిసినా గర్భిణుల కుటుంబ సభ్యులు అడిగినంత ఇస్తే గర్భంలో ఉన్నది ఆడో, మగో చెప్పేస్తున్నాయి. పేదరికం వల్ల ఆడపిల్ల పుడితే భారమనే అజ్ఞానంతోనో లేదా అప్పటికే ఆడపిల్లలు పుట్టారన్న కారణంతోనో మళ్లీ కాన్పులో ఆడపిల్లను వద్దనుకునేవారు లింగ నిర్ధారణ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి నుంచి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు భారీగా డబ్బు వసూలు చేసి పుట్టబోయేది ఆడబిడ్డో లేక మగ శిశువో చెప్పేస్తున్న నాలుగు సెంటర్లపై షీ టీమ్స్ మెరుపుదాడి చేశాయి. ఇబ్రహీంపట్నంలోని ప్రత్యూష స్కానింగ్ సెంటర్‌తోపాటు ఉప్పల్‌లోని శ్రీకృష్ణా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, మేడిపల్లి పీఎస్ పరిధిలోని బుద్ధనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర డయాగ్నస్టిక్స్,చౌటుప్పల్‌లోని ప్రశాంతి ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించాయి. నలుగురు వైద్యులు, ఓ మధ్యవర్తిని అరెస్టు చేసి వారిపై ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పీఎన్డీటీ) నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశాయి. అల్ట్రాసౌండ్ మిషన్లు సహా రికార్డులను సీజ్ చేశాయి. వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోకపోవడం వల్లే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలు అవినీతికి నిలయంగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల యాజమాన్యాలను తనిఖీల పేరుతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. గ్రేటర్లో చిన్న, పెద్ద అన్నీ కలిపి 3 వేలకుపైగా ఆస్పత్రులు ఉండగా వాటిలో 1,140 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రేడియాలజిస్టులకు బదులు లింగనిర్ధారణ చట్టంపై కనీస అవగాహన లేని కాంపౌండర్లు, నర్సులతో పరీక్షలు చేయిస్తున్నాయి. వారు కాసులకు కక్కుర్తి పడి గర్భంలో ఉన్నది ఆడో, మగో చెప్పేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో షీ టీం బృందం రంగంలోకి దిగింది. ఆయా కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ జిల్లాలో గత నాలుగేళ్ల నుంచి ఇప్పటివరకు సుమారు 20 కేంద్రాలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అడిగినంత ఇస్తే చాలు నమోదు చేసిన కేసులు కోర్టుల్లో వీగిపోయేలా చేయడంతోపాటు ఆయా ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమకు అనుకూలమైన సిబ్బందిని డెప్యుటేషన్‌పై వెంట తెచ్చుకుంటుండటం గమనార్హం. స్కానింగ్ సెంటర్ల నిబంధనలివీ... స్కానింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు కఠిన నిబంధనలు ఉన్నాయి. స్కానింగ్ మిషన్లు కొనుగోలు చేయాలన్నా జిల్లా వైద్యాధికారి అనుమతి తప్పనిసరి. ఆస్పత్రుల్లో స్కానింగ్ కేంద్రాలు భాగమైనప్పటికీ స్కానింగ్ సెంటర్‌కు విడిగా అనుమతి పొందాల్సిందే. కచ్చితంగా రెండేళ్లపాటు రోగుల రికార్డులు నిర్వహించాలి. న్యాయపరమైన కేసులు ఉంటే పదేళ్లపాటు రికార్డులను భద్రపర్చాలి. సెంటర్‌కు వచ్చే రోగుల పూర్తి వివరాలు నమోదు చేయాలి. స్కానింగ్ చేయించుకోవడానికిగల కారణాలను రోగుల నుంచి లిఖితపూర్వకంగా స్వీకరించాలి. స్కానింగ్‌ను రేడియాలజిస్ట్‌లే నిర్వహించాలి. రేడియాలజిస్ట్‌ల పేర్లు, విద్యార్హతలు, అందుబాటులో ఉండే వేళలు తప్పనిసరిగా స్కానింగ్ కేంద్రాల్లో కనిపించేలా బోర్డులు పెట్టాలి. స్కానింగ్ నివేదికలపైనా ఈ వివరాలతోపాటు రేడియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్, సంతకం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా కేవలం స్కానింగ్ కేంద్రాల పేరుతో రిపోర్టులను యథేచ్ఛగా ఇచ్చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. ప్రజల్లో చైతన్యం కరువు... తరాలు మారుతున్నా సమాజంలో ఆడపిల్లలపట్ల ఇంకా చిన్నచూపు కొనసాగుతోంది. బాలికలపట్ల వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడపిల్లలపట్ల వివక్ష ఉండడం, వారిని సాకే స్థోమత లేకపోవడం తదితర కారణాల వల్ల గర్భంలోనే పిండాలను చిదిమేస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆడపిల్లలు తక్కువేం కాదన్న భావనను వాళ్లలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
42 మంది వైద్యుల అరెస్ట్
తిరువళ్లూరు: ఉన్నత విద్యలో ప్రభుత్వ డాక్టర్లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాస్తారోకో చేస్తున్న వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నా తమిళనాడు ప్రభుత్వం స్పందించటం లేదంటూ గురువారం మధ్యాహ్నం తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల ఎదుట డాక్టర్లు ఆందోళనకు దిగారు. రాస్తారోకోతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టారంటూ పోలీసులు వైద్యులను అరెస్టు చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్ రద్దు చేసిన నేపథ్యంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలకు రావడానికి ఎవ్వరూ ఆసక్తి చూపరని తద్వారా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల కొరత ఏర్పడే అవకాశం వుందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. అరెస్టయిన 42 మంది వైద్యుల్లో 16 మహిళలు కూడా ఉన్నారు. ఆందోళన కారణంగా తిరువళ్లూరు వైద్యశాలకు వచ్చిన రోగులు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Reservations, doctors arrested, MBBS, ఎంబీబీఎస్, రిజర్వేషన్లు, వైద్యుల అరెస్ట్, తిరువళ్లూరు