‘వైద్య’వాణి
ఏడు పదుల వయస్సులోనూ అదే తపన
నవజాత శిశువుల ఆరోగ్యానికి భరోసా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి
దేశవ్యాప్తంగా కంగారు యూనిట్ల ఏర్పాటుపై నివేదిక
డాక్టర్ శివవాణి సిద్దిపేట పర్యటన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేకం
సిద్దిపేట జోన్: కంగారు మెథడ్ యూనిట్ (కేఎంసీ), నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ).. ఈ పదాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తున్నాయి. తక్కువ నెలల బరువుతో జన్మించిన పసికందుకు ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను పరిష్కరించే అధునాతన సంప్రదాయ వైద్య ప్రక్రియ ఇది.
తల్లి వెచ్చదనాన్ని పసికందుకు అందించే సరికొత్త వైద్యమిది. అలాంటి కంగారు మెథడ్ యూనిట్, ఎస్ఎన్సీయూ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 మంది వైద్యుల్లో డాక్టర్ శివవాణి ఒకరు. 76 ఏళ్ల వయసులోనూ వైద్యరంగంపై ఆమెకు మమకారం తగ్గలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ కన్సల్టెంట్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు.
సుదీర్ఘ కాలం సేవలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శివవాణి వైద్యశాస్త్రం చదివి సుమారు 25 ఏళ్ల పాటు వైద్యరంగంలో భర్తతో పాటు సేవలు అందించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) అభివృద్ధికి 25 ఏళ్ల పాటు కృషి చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలలు నిండని, తక్కువ బరువుతో జన్మించే పసికందులకు అత్యవసర వైద్యం అందించే ఎస్ఎన్సీయూ, కంగారు యూనిట్లను ఏర్పాటు చేయాలని అప్పట్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలు అమలు చేయవచ్చని పవర్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు వివరించారు. ఈమె సూచనల మేరకు భారత ప్రభుత్వం 1998లో తొలిసారిగా పశ్చిమబంగలో ఎస్ఎన్సీయూను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అనంతరం దేశవ్యాప్తంగా 762 ప్రాంతాల్లో ఆమె ప్రతిపాదన మేరకు ఎస్ఎన్సీయూ యూనిట్లను ఏర్పాటు చేయగా, తెలంగాణలో 28 చోట్ల సేవలు అందుతున్నాయి.
మరోవైపు కంగారు మెథడ్ యూనిట్ (కేఎమ్సీయూ) ద్వారా తెలంగాణలో నల్లగొండ, సిద్దిపేటలో మాత్రమే యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో 12 పడకల కేఎంసీ యూనిట్‌గా సిద్దిపేట దేశంలోనే అతిపెద్ద యూనిట్‌గా పేరు సాధించింది. యూనిట్లలో మరిన్ని వసుతులు అందించేందుకు డాక్టర్ శివవాణి రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
సరికొత్త పరిశీలనకు శ్రీకారం
ప్రధానంగా ప్రసవం అనంతరం తక్కువ బరువు, నెలలు తక్కువతో జన్మించిన పసికందుకు పుట్టకతో వచ్చే గ్రహణంమొర్రి గుండె, మెదడు, కంటి సంబంధ వ్యాధులకు స్థానికంగానే వైద్యసేవలను అందించే ఆలోచనతో ఆమె కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేశవ్యాప్తంగా యూనిట్లలో పరిశీలనకు శ్రీకారం చుట్టారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా డీఈసీ కేంద్రాలను స్థానికంగానే ఎస్ఎన్సీయూ యూనిట్లో ఏర్పాటు చేసుకునే అవకాశంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. అదే విధంగా దేశంలోని కంగారు, నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో డిజిటల్ వెయిట్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల పసికందుల బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందనే నూతన ప్రతిపాదనను ఆమె త్వరలో కేంద్రానికి అందించనున్నట్లు సమాచారం.