breaking news
divis laboratory
-
పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదు..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దివీస్ ల్యాబరేటరీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ సెక్షన్ 144 అమలులో ఉన్నందున జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి నిరాకరించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తుని రైలు కాల్చివేత, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం, దివీస్ ల్యాబరేటరీపై దాడి ఘటనలు నేపథ్యంలో ముందస్తు చర్యగా సున్నిత ప్రదేశాల్లో ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ నయీం అస్మీ హెచ్చరించారు. (చదవండి: ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు) సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గత ఏడాది డిసెంబర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేయడంతో పాటు రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్‌తో చర్చలు జరిపిన సంగతి విధితమే. -
'దివీస్' కు వ్యతిరేకంగా పాదయాత్ర: రాళ్ల దాడి
తగరపువలస: విశాఖపట్టణం జిల్లా తగరపువలస సమీపంలోని భీమిలి వద్ద దివీస్ ల్యాబొరేటరీ 3వ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు, 5 గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ తగరపువలస మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సీపీఎం నేత మూర్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో వెయ్యి మంది ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్ర కొనసాగుతోంది. దివీస్ ల్యాబొరేటరీ యూనిట్ నిర్మిస్తే కంచేరుపాళెం గ్రామాన్ని ఖాళీచేయాల్సి వస్తుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు.