breaking news
district problems
-
వీరీ వీరీ గుమ్మడి పండు.. వీరి జాడేది?
► జిల్లా సమస్యలు గాలికొదిలేసిన మంత్రులు ► ‘వంశధార’ భగ్గుమంటున్నా కనిపించని కలమట ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నంద్యాలే ముద్దు! ► అక్కడే ఎన్నికల ప్రచారంలో బిజీ పొలం మడుల్లో నిర్వాసితులు రక్తాశ్రువులు చిందిస్తున్నారు. అమాత్యులకు వారి కన్నీరు కనిపించడం లేదు. సాయం అందడం లేదంటూ వందలాది మంది నిస్సహాయంగా రోదిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వారి రోదన వినిపించడం లేదు. గడప దాటడానికి పోలీసుల అనుమతి కావాలని ఆంక్షలు పెట్టి హక్కులు కాలరాస్తుంటే.. ‘మీ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ అని చెప్పిన నాయకుడు ఏ దిక్కున ఉన్నాడో కానరావడం లేదు. వంశధార నిర్వాసితుల బాధలు పట్టని టీడీపీ నేతలు నంద్యాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పోలీసులు లాఠీలతో తలలు పగలగొడితే నేతలు తమ నిర్లక్ష్యంతో నిర్వాసితుల గుండెలు బద్దలుగొడుతున్నారు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: వారం రోజులుగా వంశధార భగ్గుమంటుంటే జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరావే కాదు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ‘నంద్యాల ఎన్నికలే’ ప్రధానమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి నిర్వాసితుడు వరకూ పరిహారం చెల్లించాకే వంశధార ప్రాజెక్టు పనులు పునఃప్రారంభిస్తామని గత జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు. జనవరి 22వ తేదీన జరిగిన విధ్వంసం ఒక దురదృష్టకర సంఘటన అని, నిర్వాసితులకు క్షమాపణ చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతీ అందరికీ తెలుసు. ఇదంతా చూసి... తమ సమస్యలు పరిష్కారమవుతా యని నిర్వాసితులు ఆశపడ్డారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటలు నీటిమూటలేనన్న విషయం గ్రహించారు. యూత్ ప్యాకేజీ ఇస్తామంటూ ఊరించినా ఆ జాబితాలో అర్హుల కంటే అధికార పార్టీ నాయకులు, వారి అనుచరుల పేర్లే ఎక్కువగా ఉండడంతో అసలు విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఈనెల 2వ తేదీన హిరమండలం వద్ద స్పిల్ వే, హెడ్ రెగ్యులేటరీ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు చేసుకోవాలని కాంట్రాక్టర్లకు తెగేసి చెప్పారు. దీంతో పనులు నిలిచిపోయాయి. కనిపించని కలమట... నిర్వాసితులే తనకు ముఖ్యమని ఇన్నాళ్లూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇప్పుడు కనిపించకుండా పోయారు. నిర్వాసితుల సమస్యలు నెలకొన్న హిరమండలం, కొత్తూరు మండలాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాతపట్నం నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిరోజుల్లో నిర్వాసితుల సమస్యను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రాజెక్టు వద్ద ఆమరణ దీక్షకైనా సిద్ధమని, అప్పటికీ ఫలితం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. తీరా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని నిర్వాసితులు వాపోతున్నారు. తమ భయాన్ని ఆయన ‘క్యాష్’ చేసుకున్నారనే విమర్శలు వారి నుంచి వినిపిస్తున్నాయి. వంశధార నిర్వాసితుల ఆందోళన మళ్లీ ప్రారంభమయ్యేసరికి ఎమ్మెల్యే కలమట నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయనకు పార్టీ అధినేత నంద్యాల 20వ వార్డు బాధ్యతలు అప్పగించడంతో దాన్ని సాకుగా చూపించి నిర్వాసితులకు ముఖం చాటేశారనే ఆరోపణలు ఉన్నాయి. తూతూమంత్రంగా సమీక్ష... నంద్యాల బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబే ఈనెల 6వ తేదీన స్పందించి కలమటను వంశధార ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని ఆదేశించారనే ప్రచారం జరిగిం ది. తీరా నిర్వాసితుల దగ్గరకు వెళ్లాల్సిన కలమట.. 7వ తేదీ సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టరు, ఎస్పీల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి నిర్వాసితుల్లో తమ అనుచరులనే ఈ సమావేశానికి రప్పించి తూతూమంత్రంగా ముగించారు. ఆ తర్వాత నిర్వాసిత గ్రామాలకు వెళ్లకుండా సొంతూరు కొత్తూరు దగ్గరి మాతలలో ఒక్కరోజు గడిపి మళ్లీ నంద్యాల తిరిగి వెళ్లిపోయారు. ఈ తర్వాత కాలంలో పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించి నిర్వాసితుల పొలాలను ధ్వంసం చేస్తున్నా ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. మూడు రోజులు వేచిచూసినా కలమట నుంచే కాదు జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీకి మరే నాయకుల నుంచి భరోసా లేకపోయింది. దీంతో చివరకు ఈనెల 16వ తేదీన నిర్వాసితులే పొలాలను ధ్వంసం చేస్తున్న పొక్లెయిన్లను అడ్డుకున్నారు. కొంతమంది ఆవేశంతో పొక్లెయిన్ అద్దాలను పగులగొట్టారు. నిలువరించడానికి వచ్చిన పోలీసులపై బురద, రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చేతికి దొరికిన నిర్వాసితులను మహిళలను సైతం చితక్కొట్టి వ్యానుల్లోకి ఎక్కించారు. తర్వాత మహిళలను వదిలేసినా మిగతా 28 మందిపై కేసులు బనాయించారు. నిందితులైన నిర్వాసితులు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. నిర్వాసితులపై కేసులు... పొక్లెయిన్లను అడ్డగించిన నిర్వాసితులపై హిరమండలం పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేసి గాయపర్చడం, చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడ్డగించడం, ప్రభుత్వాస్తుల ధ్వంసం వంటి నేరాలు మోపారు. ఈ కేసుల్లో ఇప్పటికే అరెస్టయిన 28 మందే గాకుండా మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో ఎక్కువ మంది గార్లపాడు, పాడలి, దుగ్గుపురం, తులగాం నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు. ఈ దాడి ఘటన తర్వాత అదనంగా బలగాలను రప్పించి నిర్వాసిత గ్రామాలకు సమీపంలో పోలీసులు మోహరించారు. నిత్యావసర సరుకుల కోసమో, మరేదైనా అవసరానికో ఊళ్ల నుంచి వచ్చిన నిర్వాసితులను ఆరా తీస్తున్నారు. వారి ఫోన్లతో నిర్వాసిత నాయకులకు, కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ఫోన్ చేయిస్తున్నారు. సిగ్నల్స్ ఆధారంగా వారికి వల వేయాలనే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిర్వాసితులను పరామర్శించడానికి జిల్లా కేంద్రం నుంచి వెళ్లాలనుకున్న విపక్ష నాయకులను, న్యాయవాదులను ఎక్కడికక్కడకే పోలీసులు నిలువరిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల తీరిదీ.. జిల్లా మంత్రిగా ఇటీవల వరకూ జలవనరుల శాఖ, వంశధార అధికారులు, రెవెన్యూ అధికారులతో వరుస సమీక్షలతో హడావుడి చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు నెల రోజులుగా కర్నూలు జిల్లాలో నంద్యాలకే పరిమితమైపోయారు. గత నెల 30వ తేదీన టెక్కలిలో పోలీసు సర్కిల్ కార్యాలయం ప్రారంభానికి, మళ్లీ ఈనెల 9వ తేదీన పాతపట్నంలో జరిగిన గిరిజన ఉత్సవానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నంత మాత్రాన నంద్యాల ఎన్నికలపై దృష్టి పెట్టి సొంత జిల్లా ప్రజల సమస్యలను గాలికొదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మరో మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తొలినుంచీ వంశధార నిర్వాసితుల సమస్యలు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నెలలో రెండు రోజులు రాజాంలో క్యాంపు కార్యాలయానికి లేదా ఎచ్చెర్లలో మరేదైనా కార్యక్రమానికి తప్పితే మరో సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈనెల 1వ తేదీకే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇక్కడే తరగతులు నిర్వహిస్తామని ఏడాది క్రితం నుంచి ఊదరగొట్టినా చివర్లో చేతులెత్తేశారనే విమర్శలు వినపిస్తున్నాయి. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కన్నా కాకినాడ నగరపాలక సంస్ ఎన్నికలపైనే ఆయన దృష్టి పెట్టారు మరి! జిల్లాలో మరో ముఖ్య నాయకుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా నంద్యాల ఎన్నికల ప్రచారంలోనే తలమునకలై ఉన్నారు. ఆయన హామీ ఇచ్చిన ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఎంతవరకూ వచ్చిందో రైతులకే ఎరుక! ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందా ళం అశోక్ కూడా కొద్దిరోజులుగా విజయవాడ, నంద్యాల మధ్య చక్కర్లు కొడుతున్నారే తప్ప కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యలను పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్ని కారణాల రీత్యా పలాస ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రస్తుతానికి జిల్లాలోనే ఉండిపోయారు. -
జగన్ దృష్టికి జిల్లా సమస్యలు
మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్ల నాని ఏలూరు (ఆర్ఆర్ పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జగన్మోహన్రెడ్డిని కలవడానికి వెళ్లిన సందర్భంగా నానిని చూసి ఆయన తన వాహనంలోకి ఆహ్వానించారు. జగన్మోహన్రెడ్డి వెంట నాని కొంత దూరం కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా నాని జిల్లాలో పార్టీ వ్యవహరాలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నూతన మద్యం విధానం కారణంగా జిల్లాలోని మహిళలు చంద్రబాబుపై మండిపడుతున్న విషయాన్ని చెప్పారు. గతంలో ఎనప్నడూ లేని విధంగా ఇంటింటికీ మద్యం అందుబాటులో ఉండేలా రూపొందించి మద్యం విధానాల కారణంగా ఎదుర్కొనే సమస్యలపై మహిళలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు గానీ, ఇళ్ల స్థలం గానీ, ఒక్క ఇల్లుగానీ మంజూరు చేయకపోవడంపై పేదలు ఆగ్రహంగా ఉన్నారని జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా నిలుస్తుందనే విషయాన్ని ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన ఆందోళనా కార్యక్రమాల ద్వారా ప్రజలు గ్రహించారన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని నాని వివరించారు. -
సవాలక్ష
తెలంగాణలో ఏర్పాటయ్యే తొలి ప్రభుత్వం తక్షణ అభివృద్ధి పనులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధాన ప్రభుత్వ శాఖల్లో నూతన ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించింది. విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాలు, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర ప్రధానశాఖల్లో ప్రస్తుత పరిస్థితి, దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక ప్రస్తావించింది. ఆయా విభాగాల వారీగా రూపొందించిన అధికారులు నివేదికను ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ రూపంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ గిరిజాశంకర్ అందజేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌కు నివేదించారు. అందులోని అంశాలు ఇలా..రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లాగా నమోదైంది. అక్షరాస్యత 56.05శాతం కాగా, పురుషుల్లో 66.25, మహిళల్లో 45.65శాతంగా ఉంది. 15కు పైగా మండలాల్లో అక్షరాస్యత శాతం 50కంటే తక్కువగా ఉంది. 15ఏళ్లకు పైబడిన వారిలో ఏడు లక్షలకు పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. రాష్ట్రంలోనే గట్టు మండలంలో అత్యల్పంగా 34.45శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. జిల్లాలో సాధారణ సాగువిస్తీర్ణం 7.25లక్షల హెక్టార్లు కాగా 2.5లక్షల హెక్టార్లకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉంది. వరి, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు నాలుగు లక్షల హెక్టార్లు, పెసలు, కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలు 1.5లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాగునీటి సౌకర్యం, ఎరువులు, విత్తనాల కొరత, వ్యవసాయ సిబ్బంది ఖాళీలు వంటివి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయి. జిల్లాలో పశుసంపదకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 865 మంది ఉద్యోగులకు గాను 360 పోస్టులు ఖాళీగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, పాలు, మాంసం ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం పశుసంవర్ధక శాఖ పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. 2006 నుంచి ఇప్పటివరకు 5.81ల క్షల గృహాల నిర్మాణం చేపట్టినా 3.02 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 3.03లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని 2011 జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చెంచులు, జోగినుల పునరావాసం కోసం ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాల్సి ఉంది. మేజర్ ప్రాజెక్టులను మినహాయిస్తే నీటి పారుదల శాఖ పరిధిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతో పాటు, 680 చెరువులు, 5374 కుంటలు ఉన్నాయి. వీటినిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారిస్తేనే సాగువిస్తీర్ణం మెరుగవుతుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సిబ్బంది కొ రత తాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై ప్రభావం చూ పుతోంది. ఈఈ మొదలుకుని ఏఈ స్థాయి వరకు 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సాగునీటి పథకాలకు అదనంగా మరో 874 జనావాసాలకు తాగునీరు అందించేందుకు రూ.689 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు చాలాచోట్ల విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు సమకూర్చాల్సి ఉంది.