breaking news
District Kharif
-
పాతాళంలో.. దిగుబడి!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : అన్నీ సక్రమంగా సాగి.. వాతావరణం అనుకూలించి ఉంటే.. సుమారు 34 బస్తాల దిగుబడిని కళ్లజూడాల్సిన రైతు వరుస విపత్తులతో సగటున 16 బస్తాలకు మించి చేతికందక గుడ్ల నీరు కక్కుతున్నాడు. దిగుబడులు లేక.. చేసిన అప్పులు తీరక.. కష్టాల పాతాళంలో కూరుకుపోతున్నాడు. తక్కువ దిగుబడి వచ్చిన సందర్భాల్లో పంటల బీమా వర్తించాల్సి ఉంది. అయితే రుణమాఫీ మాయలో పడి బకాయిలు చెల్లించకపోవడంతో రుణాలు రీషెడ్యూల్ కాలేదు. దాంతో పంటల బీమా కూడా వర్తించే పరిస్థితి లేదు. హుద్‌హుద్ తుపాను, వెంటనే వచ్చిన వరదలు, సుడిదోమ తెగులు.. ఇవన్నీ చాలవన్నట్లు రుణమాఫీ విషయంలో సర్కారు నిర్వాకం వెరసి అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. సగటు దిగుబడి 16 బస్తాలే.. జిల్లాలో ఖరీఫ్ వరి దిగుబడి సగటున 16 బస్తాలు మాత్రమే వస్తుందని వ్యవసాయ అధికారులు నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో తేలింది. ఇప్పటికే నూర్పులు పూర్తి చేసిన రైతులకు దక్కింది కూడా సుమారుగా అంతే ఉంది. ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. పంట కోతలు జరుగుతున్న సమయంలో జాతీయ వంటల భీమా పథకం సిబ్బంది పాలకొండ డివిజన్లో 339, టెక్కలి డివిజిన్లో 356, శ్రీకాకుళం డివిజన్లో 294.. మొత్తం 989 యూనిట్లలో 4130 పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ప్రకారం జిల్లా సగటు దిగుబడి ఎకరాకు 16 బస్తాలని నిర్థారణ అయ్యింది. జిల్లా సాధారణ దిగుబడి 30 నుంచి 34 బస్తాలు కాగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సగానికి పడిపోయింది. అత్యల్పంగా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 9 బస్తాల దిగుబడే వచ్చింది. సంతబొమ్మాళిలో 11 బస్తాలు, సీతంపేట, జి.సిగడాం, శ్రీకాకుళం, నందిగాం మండలాల్లో 12 బస్తాలు, కవిటి, గార, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో 13 బస్తాలు, పాతపట్నం, జలుమూరు మండలాల్లో 20, సారవకోటలో 22, వీరఘట్టం మండలంలో 23 బస్తాల దిగుబడి వస్తుందని తేలింది. వరుస విపత్తులు ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులపై వరుసగా కష్టాలు దాడి చేశాయి. పంట పొట్ట దశలో ఉండగా అక్టోబర్ 12న పెను తుపాన్ హూద్‌హుద్ దాడి చేసింది. ఆ వెంటనే నాగావళి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత సుడిదోమ దాడి చేసి పండిన అరకొర పంటలను కూడా నాశనం చేసింది. దీంతో తీర, మైదాన ప్రాంతాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గినప్పుడు పంటల బీమా పథకం రైతులను కొంతలో కొంత ఆదుకునేది. ఈ ఏడాది ఆ అవకాశం కూడా లేదు. సీజన్ ప్రారంభంలోనే పంట రుణాలు తీసుకునే రైతుల పేరిట బ్యాంకర్లు నేరుగా బీమా ప్రీమియం చెల్లిస్తారు. నష్టం జరిగినప్పుడు బీమా సంస్థల నుంచి పరిహారం అందుతుంది. ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు. రుణమాపీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పాత బకాయిలు చెల్లించలేదు. దాంతో కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేకపోయింది. బీమా ప్రీమియం కూడా చెల్లించే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా ఈ కష్ట సమయంలో బీమా సాయం అందకుండాపోయింది. -
రూ.1751 కోట్లు ఇదీ రుణ లక్ష్యం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖరీఫ్, రబీలో రూ.1751కోట్ల పంట రుణాలను రైతులకు అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌లో రూ.1226 కోట్లు, రబీలో రూ.525 కోట్లను బ్యాంకర్లు పంట రుణాలుగా అందించనున్నారు. గత ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1011 కోట్లకు రూ.1041 కోట్లు అందజేశారు. లక్ష్యానికి మించి మరో రూ. 30కోట్లను అదనంగా ఇచ్చారు. గత రబీలో రూ.433 కోట్ల లక్ష్యానికి రూ. 464 కోట్లు అందజేశారు. అంటే లక్ష్యానికి మించి అదనంగా రూ. 31 కోట్లను రైతులకు పంటరుణాలను బ్యాంకర్లు అందజేశారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 6 వేల 826 హెక్టార్లకు 6లక్షల 2వేల 799 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా పత్తి, వరి పంటలు సాగయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో సుమారు 6లక్షల 50వేల హెక్టార్లలో పంటలను సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. దీనికి అనుగుణంగా పంటరుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ప్రస్తుతం రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యం మేరకు పంటరుణాలను అందిస్తాయా.. లేదా అనేది అనుమాన మే. వరుస కరువుతో కటకటలాడుతున్న అన్నదాతలకు సకాలంలో లక్ష్యానికి మించి పంట రుణాలను అందించి ఆదుకోవాలని పలువురు రైతులు బ్యాంకర్లను కోరుతున్నారు.