breaking news
Discount brokerage firm
-
అప్‌స్టాక్స్ బ్రేక్–ఈవెన్ ..
ముంబై: డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో బ్రేక్–ఈవెన్ (లాభ నష్ట రహిత స్థితి) సాధించింది. 2022–23లో మొత్తం ఆదాయం 40 శాతం ఎగిసి రూ. 1,000 కోట్లు దాటినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం రూ. 1,000 కోట్ల పైచిలుకు నగదు నిల్వలు ఉన్నాయని చెప్పారు. సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం, ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం తదితర మార్గాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదారేళ్లలో తమ కస్టమర్ల సంఖ్యను పది రెట్లు పెంచుకుని 10 కోట్లకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. 2009లో ప్రారంభమైన అప్‌స్టాక్స్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో పాటు టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. -
‘జిరోధా’ ఇక నుంచి తెలుగులో కూడా..
హైదరాబాద్: డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా తాజాగా తెలుగు భాషలోనూ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ప్రాంతీయ భాషా క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను పరిచయం చేసే ప్రణాళికల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థ వీపీ (ఈక్విటీ అండ్ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప తెలిపారు. తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లో తమ ‘కైట్’ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుందని, త్వరలో మరికొన్ని భాషల్లోనూ తేనున్నామని బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ప్రస్తుతం తమకు లక్ష పైగా క్లయింట్లు ఉండగా ఇందులో సుమారు 20 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని వివరించారు. ఇంత ప్రాధాన్యమున్న నేపథ్యంలోనే హైదరాబాద్, విజయవాడల్లో రెండు శాఖలతో పాటు వైజాగ్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 11 పార్ట్నర్ సపోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు కార్తీక్ చెప్పారు. త్వరలోనే జిరోధా వర్సిటీ పేరిట అందిస్తున్న కంటెంట్‌ను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, క్లయింట్లను ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించే క్రమంలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై బ్రోకరేజీ ప్రస్తావనే లేకుండా చేశామని కార్తీక్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.80 కోట్ల ఆదాయం నమోదు చేశామన్న కార్తీక్.. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను పది లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.