breaking news
Digital meters
-
మంచినీళ్లు.. మరింత ప్రియం!
సాక్షి, చెన్నై: ఇక అనేక విషయాలకు ఉదాహరణగా ‘మంచినీళ్ల ప్రాయం’ అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. నీళ్లేకదాని వృథా చేస్తే బిల్లు తడిసి మోపడవుతుంది. ప్రతి తాగునీటి కనెక్షన్‌కు డిజిటల్ మీటర్లు అమర్చి వినియోగానికి తగినట్లుగా బిల్లు వసూలు చేసేందుకు తాగునీటి విభాగం సిద్ధం అవుతోంది. చెన్నై తాగునీటి విభాగం ద్వారా 8 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్ ఇచ్చారు. ఒక్కో ఇంటి నుంచి ఆరునెలలకు ఒకసారి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇళ్లకైతే నెలకు రూ.50, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.150, పూర్తిగా వాణిజ్య సదుపాయ కనెక్షన్‌కు రూ.200 లెక్కన వసూలు చేస్తున్నారు. డిజిటల్ మీటర్లు అమరిక.. అలాగే కార్యాలయాల్లో తాగునీరు, మురుగునీరు తొలగింపుకు వేరుగా సొమ్ము వసూలు చేస్తున్నారు. తాగునీటిని వృథా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో వాణిజ్య సముదాయాల్లో రుసుము మొత్తాన్ని పెంచడం ద్వారా ఈ వృధాను కట్టడి చేయాలని నిర్ణయించారు. నీటి వినియోగాన్ని నిక్కచ్చిగా లెక్కకట్టేందుకు డిజిటల్ మీటర్లను అమర్చనున్నారు. ఈ డిజిటల్ మీటర్ల వినియోగాన్ని ముందుగా వాణిజ్య సముదాయాల్లో ప్రారంభించనున్నారు. తొలిదశలో ఏప్రిల్‌లోగా 12 వేల డిజిటల్ మీటర్లను అమర్చనున్నారు. ఏడాదికి ఏడాది 10వేల కొత్త కనెక్షన్లు పెరుగుతున్నందున కేవలం వాణిజ్య సముదాయాలకు ఎంతశాతం నీరు వినియోగం అవుతోందోనని లెక్కకట్టనున్నారు. వచ్చేనెలాఖరులో టెండర్లు.. కొత్త డిజిటల్ మీటర్ల కొనుగోలుకు వచ్చేనెలాఖరులో టెండర్లు పిలవనున్నారు. తొలి దశ సజావుగా సాగిన పక్షంలో డిజిటల్ మీటర్ల విధానాన్ని అన్ని కనెక్షన్‌కు విస్తరించాలని చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కనెక్షన్లకు డిజిటల్ మీటర్ల అమరికకు కనీసం ఏడాది పడుతుందుని భావిస్తున్నారు. నివాస గృహాల్లో ప్రస్తుతం వెయ్యిలీటర్ల తాగునీటికి రూ.20లు వసూలు చేస్తున్నారు. దశలవారీగా డిజిటల్ విధానాన్ని విస్తరించిన పక్షంలో ఈ మొత్తం నాలుగింతలు పెరిగే అవకాశం ఉంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సగటున రోజుకు 340 లీటర్ల తాగునీరు అవసరం అవుతుందని అధికారుల లెక్కకట్టారు. అంటే ఒక కుటుంబానికి నెలకు 10వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. నెలకు 10 వేల లీటర్లు వినియోగిస్తే రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ మీటర్లతో పలు ప్రయోజనాలు ఈ కొత్త విధానంపై తాగునీటి విభాగానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ, డిజిటల్ మీటర్ల గురించి వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు, ఉభయతారకంగా పలు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. వాణిజ్యసముదాయాల్లో 12 వేల డిజిటల్ మీటర్లను తొలిదశలో అమరుస్తామని, దీని వల్ల ప్రతి నీటి బొట్టు లెక్కలోకి వస్తుందని చెప్పారు. తాగునీటి ఆవశ్యకత, విలువ వినియోగదారులకు తెలియజేయడం, వృదాను అరికట్టడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అంతేగాక తాగునీటి విభాగానికి మరిన్ని ఆర్దిక వనరులు సంక్రమించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందజేయగలమని అన్నారు. అంతేగాక నీటి వినియోగం చేయకుంటే రుసుము వసూలు చేయబోమని, నీటి దొంగతనాలను, లీకేజీని నివారించవచ్చని తెలిపారు. సెలవుల్లో కుటుంబసభ్యులంతా కలిసి ఊళ్లకు వెళ్లేవారు నీటి సరఫరాను నిలిపివేసేందుకు వీలుగా ఒక వాల్వ్‌ను కూడా ఇళ్లలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ మీటరు అమరికకు అయ్యే ఖర్చును ఇంటి యజమాని నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
కొత్త.. కొత్తగా
సాక్షి, కడప: విద్యుత్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు నల్లని ఇనుప మీటర్లలో పెద్ద చక్రమొకటి తిరిగేది. అది చుట్టూ తిరిగే క్రమాన్ని బట్టి రీడింగ్‌ను లెక్కగట్టేవారు. దీని ద్వారా కొందరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఎలక్ట్రానిక్ మీటర్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డిజిటల్ మీటర్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఐఆర్డీఏ-పోర్టు అనే అత్యాధునిక సాంకేతిక మీటర్లను ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ బిల్లుల నమోదు ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా ఉండేందుకు వీటిని వినియోగంలోకి తెస్తున్నారు. అన్ని వివరాలు ఆన్లైన్లో: ఐఆర్డీఏ-పోర్టు అనే సాంకేతిక మీటర్లు అమర్చడంతో పాటు, వాటిలోని రీడింగ్ నమోదు కోసం సరికొత్త స్పాట్‌బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో సెల్ఫోన్లో వాడే సిమ్‌కార్డు తరహా కార్డు ఉంటుంది. ఇది ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటుంది. కరెంటు మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచగానే మీటరు రీడింగ్ దానంతట అదే నమోదవుతుంది. ఆ వెంటనే అది నేరుగా ఆన్‌లైన్‌లోకి చేరిపోతోంది. ఇంట్లో కంప్యూటర్ ఉన్నవారు, సెల్ఫోన్లో ఇంటర్నెట్ వినియోగించేవారు తమ విద్యుత్ వినియోగం బిల్లును, రీడింగ్‌ను నమోదు చేసుకున్న మరుక్షణం నుంచే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. తగ్గించే అవకాశమే లేదు: స్పాట్బిల్లు యంత్రాలతో రీడింగ్‌నమోదు సందర్భంలో కొంత వెసులుబాటు ఉంది. రీడింగ్ నమోదుకు వచ్చిన వ్యక్తిని బతిమాలితే బిల్లు తక్కువ వచ్చేలా చేసుకునే అవకాశం ఉంది. 100 యూనిట్ల లోపు విద్యుత్‌ను వాడుకున్న వారికి వచ్చే బిల్లు, 105 యూనిట్లు వాడుకున్న వారికి వచ్చే బిల్లుతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. టారిఫ్ మారడంతో యూనిట్‌కు చెల్లించే చార్జీ అమాంతం మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో వంద యూనిట్లకు కొద్దిగా ఎక్కువగా వినియోగించినా వంద యూనిట్లలోపు రీడింగ్ నమోదు చేయించుకునే అవకాశం ఉంది. అయితే పోర్టుమీటర్ల ద్వారా ఆ అవకాశం ఉండదు. మీటరు ముందు బిల్లింగ్ యంత్రాన్ని ఉంచితే రీడింగ్ వస్తుంది, అద్దం మసకబారి రీడింగ్ కనిపించకున్నా మీటరు ముందు యంత్రం పెడితే దానంతటదే నమోదవుతుంది. ఆన్లైన్లో బిల్లును ఇలా చూసుకోవచ్చు: విద్యుత్ వినియోగం బిల్లు కాగితం మన దగ్గర లేకున్నా ఆన్లైన్లో మన లెక్క సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్లి ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. అందులో సర్కిల్కోడ్ అడుగుతుంది. అందులో వైఎస్సార్‌జిల్లాను ఎంచుకోవాలి. ఆపై ప్రాంతాల వారీగా కోడ్‌నెంబర్లు ఉంటాయి. ఆకోడ్లలో వినియోగదారుని నెంబర్‌ను స్పాట్ బిల్లింగ్ మిషన్‌లో నమోదు చేస్తే మీటరులోని రీడింగ్, బిల్లు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానం ఇప్పటికే ఏపీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలవుతోంది. మొదటగా పట్టణప్రాంతాల వరకే ఈ విధానాన్ని అమలు చేశారు. అది విజయవంతం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.