ఆడపిల్లలపై వివక్ష వద్దు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : ఆడపిల్లను ఒకరింటికి ఇచ్చేదనే భావనతో కొందరు తల్లిదండ్రులు వారి పట్ల చిన్నతనం నుంచే వివక్ష చూపుతారని ఇలా చేయడం తగదని స్పెషల్ జుడీషియల్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రమేశ్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గృహహింస చట్టం మహిళలకు ఒక వరం లాంటిదన్నారు. గ్రామీణ మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల హక్కులను కాపాడేందుకు గృహహింస చట్టం, కొత్తగా వచ్చిన నిర్భయ చట్టంతో పాటు మరెన్నో చట్టా లు ఉన్నాయన్నారు.
మహిళలు తమ పట్ల జరిగే వేధింపులపై, ఒక తెల్ల కాగితంపై ఫిర్యాదు చేస్తే తగిన న్యాయ సేవలను అందజేస్తామన్నారు. గర్భిణులను వైద్యుల వద్దకు తీసుకువెళ్లి ముందస్తు పరీక్షలు చేయించడం, గర్భంలో ఉన్నది ఆడా, మగా అని చెప్పడం కూడా నేరం కిందకు వస్తుందన్నారు. అనుమతి లేకుండా గర్భస్రావం చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు. చిన్నతనం నుంచే చదువుతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలకు సంస్కారాన్ని కూడా నేర్పించాలని సూచిం చా రు. కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం సమాజం తల దించుకునే విధంగా మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. చట్టాలెన్ని ఉన్నా మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
నాందేవ్‌వాడ : మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందిస్తున్నాయని, మహిళలకు వాటిపై అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడంలేదని మొదటి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అమరావతి అన్నారు.శనివారం నగరంలోని ఐకేపీ మోప్మా కార్యాలయంలో ఏర్పాటుచేసిన గృహహింస చట్టం- అవగాహన సదస్సులో అమె ప్రసంగించారు. చిన్ని పిల్లలు తోటివారిని చూసి పెద్ద పెద్ద కోరికలు పెంచుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేక ఆ కోరికలను తీర్చకపోవడంతో పిల్లలు అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, వారి విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని సూచించారు. సమాజంలో మంచి చెడులు తెలుసుకునేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ రాములు మాట్లాడుతూ..ప్రభుత్వం ఆడబిడ్డల కోసం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇంటర్మీడీయేట్ విద్యకు రూ.50వేలు, డిగ్రీ చదువులకు రూ.లక్షవరకు సహాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐకేపీ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.