breaking news
Dharmavaram Assembly Constituency
-
ఓర్వలేకే కుట్రపూరిత రాతలు
ధర్మవరం: అబద్ధాల పునాదులపై నిలబడ్డ ఈనాడు దినపత్రిక అవాస్తవాలు ప్రచురిస్తూ, అమాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కుట్రలు చూస్తుంటే అసహ్యం వేస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరాభిమానాలను చులకన చేసి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నిరాధార కథనాలు రాస్తున్న ఈనాడు అంతు చూస్తానని, పరువు నష్టం దావా వేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం ధర్మవరం మండలం దర్శినమల గ్రామంలో వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈనాడు కథనంలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలంటూ ఆధారాలతో సహా వివరించారు. ప్రతిరోజూ ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ పేరిట తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో ఒకడిగా మమేకం అవుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2008 సంవత్సరం నుంచి తాను నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నానన్నారు. దీన్ని ఓర్వలేక స్థలాలు, భూములు కబ్జా చేసేందుకు తిరుగుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేశ్, నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో చెప్పాలన్నారు. తనపై ఏఒక్క బాధితుడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును గద్దె ఎక్కించేందుకు రామోజీరావు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. గతంలోనూ తాను ఈనాడులో రాసిన కథనాలు తప్పుడు రాతలని కోర్టులో నిరూపించానన్నారు. పదేపదే తప్పుడు రాతలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని, తగిన బుద్ధి చెబుతానని ఆయన హెచ్చరించారు. మా పాఠశాలంటే ప్రభుత్వ పాఠశాల ధర్మవరం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా.. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు తొమ్మిది నెలల సమయం ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. అప్పటికీ వారి తీరు మారకపోవడంతో కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. అంతేతప్ప టీడీపీ వాళ్లలాగా ఏ ఒక్కరితోనూ లాలూచీ పడలేదన్నారు. తాను ‘గుడ్‌మారి్నంగ్ ధర్మవరం’లో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎదురైతే ‘మా స్కూల్లో చదవండి’ అని చెబుతానని, మా స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల అని వివరించారు. దీంతో తనకేవో పాఠశాలలున్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందన్నారు. అలాగైతే శ్రీరాం, సూరి రూ. 200 కోట్ల పనులు చేసేవారా? తన క్వారీలోనే కంకర కొనాలని ప్రజలను బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. అదే నిజమైతే తన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిద్ధార్థ కంపెనీ, బీజేపీ నేత సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ. 200 కోట్ల వరకూ విలువైన రైల్వే, బైపాస్‌రోడ్డు పనులు చేసేవా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా తన వద్ద కంకర కొనడం గానీ, పర్సంటేజీలు గానీ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. కబ్జా చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? నియోజకవర్గంలో ఎక్కడైనా తాను సెంటు భూమి కబ్జా చేసినట్లు ఒక్కరైనా ఆరోపించారా అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి తుంపర్తి వద్ద ఫాంహౌస్ కట్టుకున్నానని తెలిపారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన ఫాంహౌస్‌లో ఆక్రమణలు లేవంటూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా చూపించారు. నియోజకవర్గంలో ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే ఇందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. గతంలో గరుడంపల్లి వద్ద సోలార్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన వారు వస్తే.. అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఏర్పాటు చేయకుండానే వారు పారిపోయారన్నారు. ఆ తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ ఢిల్లీ వారి నుంచి భూములు కొనుగోలు చేసిందని, ఏడాది తర్వాత తాను మార్కెట్ ధర చెల్లించి ఆ భూములు కొన్నానని వివరించారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. -
పరిటాల వర్సెస్ వరదాపురం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గంలో అశాంతి రాజేసేలా ఇరువర్గాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న వరదాపురం సూరి వర్గీయులు టీడీపీలో చేరుతున్నామనే సంకేతాలిచ్చేందుకు ముదిగుబ్బ మండల కేంద్రంలో సొసైటీ సర్కిల్ వద్ద చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ప్రధానంగా ఘర్షణకు కారణమయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత నెల కూడా గడవక ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో టీడీపీలోకి చేరతామని, ఆ పార్టీ టికెట్ తనకేనంటూ కొంత కాలంగా సూరి తన అనుచరులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, వరదాపురం సూరి రెండు రోజుల కిందట ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓ మాజీ మంత్రి అని, వారు ధర్మవరం, శింగనమల, పెనుకొండలకు వెళితే వైఎస్సార్సీపీకి పనిచేస్తారని, ఒక్క రాప్తాడులో మాత్రం టీడీపీకి పని చేస్తారని, ధర్మవరం చెరువుకు నీరు అందించేందుకు తాను సొంత నిధులతో కాలువ మరమ్మతులు చేయిస్తే.. వాటికి కూడా నాడు –నేడు కింద బిల్లులు చేసుకున్నారని పరోక్షంగా పరిటాల సునీతను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. మీ పార్టీ నాయకుల ఫొటోలు వేసుకోండి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ముదిగుబ్బ మండలంలో వరదాపురం సూరి అనుచరులు పసుపు రంగు ఫ్లెక్సీల ఏర్పాటుకు పూనుకున్నారు. అందులో వరదాపురంతో పాటు చంద్రబాబు, నారా లోకేశ్ ఫొటోలు వేయించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు బీజేపీలో ఉన్నందు వల్ల ఆ పార్టీ నాయకుల బొమ్మలు వేసుకోండి. అంతేగానీ చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు ఎలా వేస్తారు? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం చెప్పులు విసురుకున్నారు. ముదిగుబ్బ ఎస్ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వివాదం ముదురుతుండటంతో సూరి వర్గీయులు వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించి వెనుదిరిగారు.