breaking news
Devagiri Express
-
లింగంపల్లి నుంచి ‘దేవగిరి’కాచిగూడ నుంచి ‘అజంతా’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే దేవగిరి ఎక్స్‌ప్రెస్ 17058/17057 ఇక నుంచి సికింద్రాబాద్‌కు బదులు లింగంపల్లి నుంచి దేవగిరికి రాకపోకలు సాగించనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అజంతాకు వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్(17064/17063) ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్లో అదనపు హాల్ట్‌తో కాచిగూడ స్టేషన్ నుంచి అజంతాకు రాకపోకలు సాగించనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రెండు రైళ్ల టర్మినళ్లను మార్చినట్లు సీపీఆర్వో తెలిపారు. నగరంలోని పశి్చమ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ, ప్రముఖ వ్యాపారసంస్థల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని లింగంపల్లి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించేవిధంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి స్టేషన్‌కు పొడిగించడం వల్ల ముంబైకి మాత్రమే కాకుండా నిజామాబాద్, బాసర్, నాందేడ్, మన్మాడ్, నాసిక్ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ స్టేషన్‌కు మార్చడం వల్ల కాచిగూడ నుంచి షిర్డీ(నాగర్సోల్ స్టేషన్) మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలుకు అదనంగా ఒక 2 టైర్ ఏసీని జతచేయనున్నారు. -
రైలుబండెక్కి వచ్చెత్త పా..! ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా..
బతుకుదెరువు కోసం తెలంగాణ పల్లెల నుంచి ముంబయికి వలసలు కొత్తకాదు. దశాబ్దాల కాలంగా ముంబయి నగరం ఎందరికో బతుకునిచ్చింది. ఇప్పటికీ ఎందరో వెళుతుంటారు. అప్పట్లో అక్కడకు వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చాల్సి వచ్చేది. బస్సుల్లో అవస్థల ప్రయాణం ఆపై అడ్డగోలు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రైలు నడపడంతో ఈ ప్రాంత ప్రజలకు ముంబయి వెళ్లి రావడం సులువైంది. మూడు దశాబ్దాల నాడు అంటే 1992లో ‘దేవగిరి’ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయికి రైలు మొదలైంది. ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తోంది. మొన్నామధ్య లాక్డౌన్ సమయంలో కొంతకాలమే రైలు నిలిచింది. తరువాత యథావిధిగా నడుస్తోంది. కాగా తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేల కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. అలాగే ఉన్నత చదువుల కోసం, ఉద్యోగరీత్యా వెళ్లినవారూ ఉన్నారు. బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా ముంబయితో ఎంత అనుబంధం ఉందో, దేవగిరి ఎక్స్ప్రెస్తోనూ ప్రజలకు అంతే అనుబంధం పెరిగింది. – సాక్షి, కామారెడ్డి రైలు ఆగేచోటల్లా ఎక్కేస్తారు.. సికింద్రాబాద్ నుంచి ముంబయికి 878 కిలోమీటర్లు దూరం కాగా, దేవగిరి ఎక్స్‌ప్రెస్ దాదాపు 17 గంటల నుంచి 18 గంటల పాటు నడుస్తుంది. సికింద్రాబాద్‌తో పాటు మెదక్ జిల్లాలోని మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముథ్కేడ్, నాందేడ్ స్టేషన్ల మీదుగా రైలు ముందుకు సాగుతుంది. కాగా కామారెడ్డి రైల్వే స్టేషన్ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ముంబయి వెళ్లేవారంతా కామారెడ్డికి వచ్చి రైలు ఎక్కి వెళతారు. ముంబయి నుంచి వచ్చే వారు కూడా కామారెడ్డి స్టేషన్లో దిగి ఇక్కడి నుంచే సొంతూళ్లకు వెళతారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ వచ్చిందంటే చాలు కనీసం వంద మంది దిగుతారు. రోజూ వెయ్యి మందికి పైగా.. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు ఉండగా, అందులో రెండు మూడు మాత్రమే జనరల్ బోగీలు కాగా, మిగతావి రిజర్వేషన్‌వి. ముంబయి వెళ్లేవారంతా రిజర్వు చేసుకుని వెళతారు. దాదాపు వెయ్యి మంది రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణం చేస్తుండగా, ఇతర స్టేషన్లు దిగేందుకు, జనరల్ బోగీల్లో మరో వెయ్యి మంది వరకు వెళతారని అంచనా. కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ల ద్వారా ముంబయి నగరానికి ప్రతిరోజూ కనీసం వంద మంది వెళ్లినా సంవత్సరానికి 30 వేల మంది వెళుతుంటారు. ముప్పై ఏళ్ల కాలంలో పది లక్షల మంది వెళతారు. తిరుగు ప్రయాణంలో కూడా అదే స్థాయిలో వస్తుంటారు. ఈ లెక్కన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు 20 లక్షల మంది తిరిగినట్టు అంచనా. దేవగిరితో ఎంతో అనుబంధం.. మూడు దశాబ్దాలుగా నడుస్తున్న దేవగిరితో ఈ ప్రాంత ప్రజలకు అనుబంధం ఏర్పడింది. రైల్లో ఏ నంబరు బోగీ ఎక్కడ వస్తుందో ఇట్టే చెప్పేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకోవడం, బెర్త్, టూ టైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ తదితర రిజర్వేషన్ల గురించి కూడా చాలా మందికి అవగాహన కలిగింది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, రామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, మెదక్ జిల్లాలోని రామాయంపేట, మెదక్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. కొందరైతే నెలకోసారైనా సొంతూళ్లకు వచ్చి వెళుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ ఉందంటే చాలు బంధువుల పెళ్లిళ్ల కోసం ముల్లేమూటలతో వచ్చి వారం, పదిరోజులు ఉండి వెళతారు. పండుగల సమయంలో కూడా వచ్చి వెళ్తారు. దీంతో దేవగిరితో ఆ కుటుంబాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. పదేళ్లుగా.. మాకు ముంబయిలో వ్యాపా రాలున్నాయి. మా అమ్మా, నాన్న అక్కడే ఉంటారు. నేను కూడా చాలా కాలం అక్కడే ఉండేవాన్ని. పదేళ్లుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నా. వందల సార్లు దేవగిరిలో ముంబయికి వెళ్లాను. మాకు ముంబయికి ఎంత అనుబంధమో, దేవగిరికి కూడా అంతే అనుబంధం ఉంది. –రాఘవేందర్, వ్యాపారి, కామారెడ్డి రెగ్యులర్‌గా వెళతాం దుస్తుల కొనుగోళ్ల కోసం ముంబయికి ప్రతీసారి దేవగిరిలోనే వెళతాం. తిరిగి రావడం కూడా అదే రైలులోనే. ఏళ్ల తరబడిగా అందులో ప్రయాణిస్తున్నాం. దేవగిరి రైలు కామారెడ్డి ప్రాంత ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. ఉదయం కల్లా ముంబయిలో దిగి పనులు చేసుకుని, తిరిగి రాత్రి రైలెక్కుతాం. - సుధాకర్, వ్యాపారి, కామారెడ్డి ముంబయి తొవ్వలో దేవగిరి ఎక్స్‌ప్రెస్ ∙మూడు దశాబ్దాలుగా సేవలు ∙ఉమ్మడి జిల్లావాసులకు అనుకూలం ∙రైలుతో విడదీయలేని అనుబంధం ముంబయికి వెళ్లేందుకు దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎక్కుతున్న ప్రయాణికులు -
‘దేవగిరి’.. 100 నిమిషాల ఆలస్యం
- ఒకటో ప్లాట్‌ఫారంపైకి వస్తుందని ప్రకటన - వచ్చిందేమో రెండో ప్లాట్ ఫారంపైకి.. - అవస్థలు పడ్డ ప్రయాణికులు నిజామాబాద్‌కల్చరల్ : దేవగిరి ఎక్స్‌ప్రెస్ సుమారు వంద నిమిషాల ఆలస్యంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. ఒకటో నంబర్ ప్లాట్ఫారం మీదికి రైలు వస్తుందని ప్రకటన చేయగా.. రెండో ప్లాట్‌ఫారంపైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ముంబయి నుంచి బయలుదేరే దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది నిజామాబాద్‌కు రోజూ ఉదయం 11.05 గంటలకు చేరుకుంటుంది. సోమవారం చాలా ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు నిజామాబాద్ వచ్చింది. సుమారు వంద నిమిషాల ఆలస్యంగా రైలు వచ్చింది. కాగా ఈ రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపైకి వస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై వేచి ఉన్నారు. కానీ రెండో నంబర్‌పైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ఉరుకులు పరుగుల మీద రెండో ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అసలే ఆలస్యంగా రావడం, ఆపైన ప్లాట్‌ఫారాలు మారాల్సి రావడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైలొచ్చినా.. గేటు వేయలేదు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : రైల్వే గేటు వేయకపోవడాన్ని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తతతో రైలును నిలిపి వేయడంతో పట్టాలు దాటుతున్న వాహనదారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రై లు నిలుపకుండా అలాగే వచ్చుంటే ప్రమాదం జరిగి ఉండేదని గేట్ మన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లికి చే రుకునే సమయానికి గేటు వేయలేదు. విధుల్లో ఉండాల్సిన గేట్‌మన్ గదికి తాళం వేసి ఎక్కడికో వెళ్లాడు. గేటు తెరిచి ఉండటంతో రైలు వస్తున్న విషయం గమనించని వాహనదారులు, పాదచారులు పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో రైలు కూత విన్పించి చూసేసరికి సమీపంలోనే ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు కన్పించడంతో అందోళనకు గురయ్యారు. రైలు కూతతో అక్కడికి చేరుకున్న గేట్‌మన్ హడావుడిగా గేటు వేశాడు. గేటు ఎందుకు మూయలేదని ప్రశ్నించిన ప్రజలతో ‘ఏం ప్రమాదం జరగలేదు కదా.. ’అంటూ దురుసుగా మాట్లాడినట్లు న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి అంబట్ల రాజేశ్వర్ విలేకరులతో తెలిపారు. గేట్‌మన్ నిర్లక్ష్యంపై రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.