breaking news
The demolition of temples
-
దేవాలయాల కూల్చివేత అమానుషం
మచిలీపట్నం (చిలకలపూడి) : రహదారుల అభివృద్ధిలో భాగంగా విజయవాడలో 42 ఆలయాలను కూల్చివేయడం అమానుషమైన చర్య అని బీజేపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ పంతం గజేంద్ర అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా ధర్నా జరిగింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డౌన్.. డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు కూల్చివేయడమే కాకుండా బీజేపీ నాయకులపై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఆలయాలు కూల్చివేయటంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ, ఎంపీలను పరుష పదజాలంతో దూషించడం హేయమన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆలయాలను విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారని ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా యువమోర్చ నాయకుడు చిలంకుర్తి పృధ్వీప్రసన్న మాట్లాడుతూ ఆలయాల కూల్చివేత విషయంలో బీజేపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఉడత్తు శ్రీనివాసరావు, మల్లాది వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఆలయాల కూల్చివేత
అధికార పక్ష నేతలపై భక్తుల ఆగ్రహం వన్‌టౌన్‌లో ఉద్రిక్తత వన్‌టౌన్ : వన్‌టౌన్‌లో గురువారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నగర పాలక సంస్థ సిబ్బంది పలు ఆలయాలను నేలమట్టం చేశారు. వన్‌టౌన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్‌టౌన్‌లోని గణపతిరావురోడ్డులో చేపలమార్కెట్ బస్టాండ్ సమీపంలోని రోడ్డును ఆనుకొని ఉన్న దాసాంజనేయస్వామి దేవస్థానం, దాని పక్కనే ఉన్న విఘ్నేశ్వరస్వామి దేవస్థానాలను రాత్రికిరాత్రి తొలగించారు. అందులోని విగ్రహాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. బాబూ రాజేంద్రప్రసాద్ రోడ్డులోని రాయల్‌హోటల్ సమీపంలో ఉన్న గంగానమ్మ దేస్థానాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. రాత్రి పదకొండు గంటల వరకూ ఎటువంటి హడావుడి లేదని ఉదయం చూడగానే ఆలయాలు మాయమైనట్లు స్థానిక నివాసితులు చెబుతున్నారు. 86 ఏళ్ల పురాతన ఆలయాన్ని కూల్చడంపై నిరసన గణపతిరావురోడ్డులోని దాసాంజనేయస్వామి దేవస్థానాన్ని 1930లో ప్రతిష్టించారని స్థానికులు చెబుతున్నారు. హనుమత్ జయంతి, శ్రీరామనవమి, ఇతర వైష్ణవ పండుగల సమయాల్లో ఈ ఆలయంలో పెద్దస్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. పురాతన ఆలయాన్ని ఏ విధంగా తొలగించారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాయల్‌హోటల్ సమీపంలోని గంగానమ్మ దేవస్థానం కూడా 40 ఏళ్లుగా అక్కడ ఉందని, స్థానికంగా మసీదు ఉన్నా మతసామస్యంగా అక్కడి వాతావరణం కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. అధికారుల వివక్ష అధికారులు, అధికారపక్ష నేతలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయా ఆలయాల నిర్వాహకులు, స్థానిక భక్తులు మండి పడుతున్నారు. 25వ డివిజన్లో ఆరు మాసాల కిందట ఒక మతానికి చెందిన ప్రార్థనా మందిర స్థలంలో నాలుగు వైపుల రోడ్డు ఆక్రమించి దుకాణాలు అధికారులు దగ్గరుండి కట్టించారని, వారికి అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మద్దతు పలికారంటూ స్థాయిలో భక్తులు ధ్వజమెత్తారు. అదే డివిజన్లో మరో ప్రార్థనా మందిరం పేరుతో భారీ హోర్డింగులను ఏర్పాటుచేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారని, అధికారులు అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. పాఠశాల భవనం తొలగింపు గణపతిరావు రోడ్డు విస్తరణలో భాగంగా శ్రీ కస్తూరి సీతారామయ్య నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించే పనులను అధికారులు గురువారం రాత్రి ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుడు కస్తూరి సీతారామయ్య స్మారకార్థం నగర పాలక సంస్థ రెండున్నర దశాబ్దాల కిందట ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. రోడ్డు విస్తరణ పేరుతో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు పాఠశాలను తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కస్తూరి సీతారామయ్య పేరుతో ఉన్న పాఠశాలను తొలగిం చటం ఆయనను అవమానించటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.