breaking news
Deer killed
-
చుక్కల దుప్పిని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
పెద్దదోర్నాల: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని అతివేగంతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుప్పి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎకో టూరిజం సమీపంలో తెట్టగుండం వద్ద ఆదివారం జరిగింది. పెద్దదోర్నాల రేంజి అధికారి విశ్వేశ్వరరావు కథనం మేరకు శ్రీశైలం నుంచి సింథనూర్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు తెట్టగుండం వద్దకు చేరుకునేసరికి ఆ ప్రాంతంలో ఉన్న చుక్కల దుప్పి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. వేగంగా వస్తున్న బస్సు దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న స్వచ్ఛ సేవక్‌లు వెంటనే మండల కేంద్రంలో ఉన్న గణపతి చెక్‌పోస్టుకు సమాచారమందించడంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద బస్సును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతిచెందిన చుక్కల దుప్పికి అటవీశాఖకు చెందిన పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. -
తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి
వేటగాళ్ల పనేనన్న అనుమానం? హవేలి ఘణాపూర్ (మెదక్): తీవ్రగాయాలతో చుక్కలదుప్పి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. హవేలి ఘనాపూర్ మండలం గాజిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చుక్కలదుప్పి శుక్రవారం తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతుండగా అధికారులు గుర్తించి మెదక్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ దుప్పి కుక్కలదాడిలో గాయాలపాలై మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవీలాల్ తెలిపారు. మృతి చెందిన దుప్పిని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ చుక్కలదుప్పి కుక్కలదాడిలో గాయపడిందా.. లేక ఎవరైనా వేటగాళ్ల వేటలో గాయపడిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.