breaking news
deep vein thrombosis
-
కదలకపోతే కదల్లేరు
కూర్చుని కదలకుండా చేసే ఉద్యోగాలు (సిట్టింగ్ జాబ్స్) ప్రాణాంతకంగా మారుతున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూ కార్యాలయం లేదా ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్్కటాప్ల ముందు ఐటీ ఉద్యోగులు కూర్చుని పనితో కుస్తీ పట్టడం సాధారణమైంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వ కార్యాలయాలు మొదలు వివిధ ప్రైవేట్ ఉద్యోగులు కూడా అత్యధిక సమయం డెస్క్‌లు, ఫైళ్ల ముందు గడపడం తెలిసిందే. కార్యాలయ ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలతో అధిక శాతం ఉద్యోగులు టేబుళ్ల ముందు కూర్చుని నిర్వహిస్తున్న విధులతో ఈ ముప్పు పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకేచోట కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చుంటే రక్తప్రసారం జరగక ‘డీప్ వీన్ త్రొంబోసిస్’(డీవీటీ)కు దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.డీవీటీ వంటి పెను ఆరోగ్య సమస్యతో పాటు రక్తపోటు, మధుమేహం, వెన్నెముక, కీళ్ల నొప్పులు, మానసిక కుంగుబాటు, ఆందోళన, మెటబలైజ్ ఫ్యాట్ తదితర సమస్యలు తప్పవని వారు స్పష్టం చేస్తున్నారు. రోజంతా కార్యాలయం పనిలో, ఇతరత్రా ఎంతగా పని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా.. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు ఓ మోస్తరు వ్యాయామం, నడక లాంటి వ్యాపకాలతో మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. రోజులో ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల అంశాలు, సమస్యలను ఎదుర్కొనేందుకు వ్యాయామమే మంచి ఉపయోగమని సూచిస్తున్నారు. కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు, అనారోగ్య సమస్యలకు సంబంధించి నిర్వహించిన వివిధ పరిశీలనను ‘మెటా అనాలిసిస్’చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలకు అనుగుణంగా.. మెరుగైన ఆరోగ్యం కోసం రోజువారీ జీవనవిధానాన్ని కొంత మార్చుకుని, దినచర్యలో వ్యాయామం (ఫిజికల్ యాక్టివిటీ) చేర్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా.. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ప్రచురితమైన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.– సాక్షి, హైదరాబాద్ముఖ్యాంశాలు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 45 వేల మందిపై ఆయా అంశాల వారీగా జరిపిన పరిశీలనలో వివిధ అంశాలపై స్పష్టత వచ్చింది, రోజులో ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో.. రోజుకు కనీ సం 40 నిమిషాల పాటు వ్యాయామం, ఇతర శారీరక శ్రమ వల్ల.. సుదీర్ఘగంటల పాటు కూర్చుని పనిచేయడంతో కలిగే దుష్ఫలితాలను అధిగమించవచ్చునని స్పష్టమైంది. రోజులో దాదాపు పది గంటల పాటు కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులను వ్యాయామంతో దూరం చేయొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (2020 గ్లోబల్ గైడ్‌లైన్స్).. వారానికి 150–300 నిమిషాలలోపు ఓ మోస్తరు, 75 నుంచి 150 నిమిషాల దాకా ఒకింత ఉధృతమైన వ్యాయామం (విగరస్–ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ) చేయాలని సిఫార్సు చేసింది. దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చేసుకోవడం, స్వల్ప వ్యాయామం, లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఇంట్లో పిల్లలతో ఆడుకోవడం వంటి వాటితో ఉపశమనం పొందవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. కార్యాలయం లేదా ఇళ్ల నుంచి పనిచేసేపుడు ఒకేచోట చైతన్యరహితంగా గడపకుండా చురుకుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. వరుసగా ఎన్ని గంటల పాటు ఒకేచోట లేవకుండా పనిచేయడం వల్ల ఏయే రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయనే దానిపై మాత్రం మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని భావించడం గమనార్హం.సమస్యలివే.. ∙ఒకరోజులో ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉండడం, కార్యాలయంలో పని చేయడం వల్ల కదలికలు లేని కారణంగా కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండెజబ్బులకు కారణమౌతుంది. ∙ఇది రక్తప్రసారంలో మార్పులకు కారణమై రక్తపోటుకు దారితీయడంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణలు మారే అవకాశాలు పెరుగుతాయి.∙ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల మధుమేహ సమస్య పెరుగుదలకు దారితీస్తుంది. అధిక గంటలు కూర్చోవడం వంటి వాటి వల్ల కొన్నిరకాల కేన్సర్లకు కారణం కావొచ్చు. ∙రోజులో చాలాగంటలు కూర్చుని ఉండడం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటు ఆందోళనలు, చిరాకు పెరిగే అవకాశాలున్నాయి. ∙అధిక సమయం సిట్టింగ్ వల్ల వాస్తవ వయసు కంటే ముందుగానే వయసు మీదపడిన భావనకు దారితీస్తుంది. ఏం చేయాలి? ∙పనిచేస్తున్నపుడు మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి ∙కొంత దూరం అటు ఇటు నడవాలి.∙చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి. ∙కూర్చునే పనిచేయకుండా.. వీలును బట్టి నిల్చోవాలి. -
కాలికి నూనె రాస్తే.. ప్రాణం పోయింది!!
చావు రాసిపెట్టి ఉంటే.. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఢిల్లీలో 23 ఏళ్ల యువకుడికి అలాగే జరిగింది. కాలు నొప్పిగా ఉందని తల్లితో కాలికి నూనె రాయించుకుంటే.. కాసేపటికల్లా అతడు ప్రాణాలు కోల్పోయాడు! అతడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా కాలి మడమకు గాయమైంది. దాంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కట్టు వేశారు. దానివల్ల అతడి కాలి నరాల్లో రక్తం గడ్డ కట్టింది. గాయం మానే సమయానికి ప్లాస్టర్ తీసేసినా.. ఆ గడ్డకట్టిన రక్తం కారణంగా కాలి వాపు, నొప్పి అలాగే ఉన్నాయి. దాంతో అతడి తల్లి కాలికి నూనె రాసి కొద్దిగా మర్దనా చేస్తే తగ్గుతుందని భావించి.. అలాగే చేశారు. కానీ, దానివల్ల గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల వరకు వెళ్లి, కొద్ది సేపటికే అతడు మరణించాడు. దాదాపు 5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ రక్తపు గడ్డ తొలుత కాలి నరంలోనే ఉండిపోయిందని, అయితే మసాజ్ కారణంగా అది ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మనరీ ఆర్టెరీ వరకు వెళ్లి అతడు అక్కడికక్కడే మరణించాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యలు తెలిపారు. ఇంటి దగ్గర స్పృహ తప్పి పడిపోగానే అతడిని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. 'డీప్ వెయిన్ త్రాంబోసిస్' అనేది అరుదుగా సంభవిస్తుందని, అది ఒకోసారి ప్రాణాంతంకంగా మారుతుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. కాలికి వేసిన కట్టు తొలగించిన తర్వాత కూడా వాపు, నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలని, వాళ్లు అవసరమైతే వాస్క్యులర్ సర్జన్ వద్దకు పంపుతారని ఆయన చెప్పారు. లక్ష మందిలో సుమారు 70 మందికి ఈ సమస్య ఉంటుందని, ఎక్కువ సేపు కాళ్లు కదిలించకుండా ఉంచేయడం, సుదూర ప్రయాణాల లాంటి సందర్భాల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పుడైనా ఫ్రాక్చర్ల లాంటివి జరిగినప్పుడు అక్కడ మసాజ్ చేయకూడదని, కావాలంటే నూనె పోయడం లేడా వాపును అరికట్టే క్రీములు రాయడం లాంటివి చేయొచ్చు గానీ పొరపాటున కూడా ఒత్తిడి కలిగించకూడదని డాక్టర్ గుప్తా చెప్పారు. ఈ కేసు గురించి తాజాగా వెలువడిన మెడికో లీగల్ జర్నల్‌లో వివరించారు. వైద్యులు కూడా మసాజ్ చేయొద్దని సలహా ఇవ్వడం లేదని.. తప్పనిసరిగా ఇలాంటి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు.