breaking news
December 26
-
సునామీకి పదేళ్లు
సునామీ అనే పేరు పెట్టుకున్న సాగర ప్రళయ బీభత్సానికి నేటితో పదేళ్లు పూర్తయ్యూయి. సరిహద్దు అంచులను దాటి ఊళ్లపై ఎగిసిపడిన కెరటం వేలాదిమందిని మింగేసి నేటికి దశాబ్ద కాలమైంది. సముద్రతీర జిల్లాల ప్రజల జీవితాల్లో సునామీ చేసిన గాయం ఇంకా ఆరలేదు. క న్నీటి పొరల మాటున ఆనాటి జ్ఞాపకాలు చెరిగిపోలేదు. చెన్నై, సాక్షి ప్రతినిధి: 2004 డిసెంబరు 26... తమిళనాడు ప్రజలకు అదో దుర్దినం. సముద్రతీర వాసులకు చెరిగిపోని చేదు జ్ఞాపకం. పిల్లా పాపలతో కళకళలాడే కుటుంబాలను కకావికలం చేస్తూ ప్రకృతి సృష్టించిన ప్రళయం. ఆ రోజు ఆదివారం కావడం, ముందురోజే క్రిస్మస్ పండుగతో ఇంటింటా సందడే సందడి. సముద్రతీర జిల్లాల్లో నివసించే ప్రజలకు ఆదివారం సాగరతీరంలో ఉల్లాసంగా గడపడం అలవాటు. సముద్రం వద్దకు మనం వెళ్లడం కాదు, ఏదో ఒకరోజు సముద్రమే మన వద్దకు వస్తుందని కలలో కూడా వారు ఊహించి ఉండరు. కానీ ఆరోజు అదే జరిగింది. సమద్ర అనే దీవుల్లో ఏర్పడిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఎగిసిపడే కెరటాల్లో కల్లోలాన్ని రేకెత్తించింది. కేవలం కొద్ది నిమిషాల్లో అలలపోటును సృష్టించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆ కెరటాలు ఊళ్లను ముంచేశాయి. ఐదు అడుగులకు మించిన ప్రవాహం వేలాదిమందిని లాక్కుని వెళ్లిపోయింది. ఇలా తమిళనాడులో 1700 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సంఖ్య పదివేలను మించిపోయిందని అనధికార సమాచారం. ఊళ్లలోకి చొరబడిన సునామీ కెరటాలు తిరిగి అదే వేగంతో వెనక్కుమళ్లాయి. అప్పటి వరకు నివాసగృహాలుగా ఉన్న ప్రాంతాలు శ్మశానాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసిన శవాల గుట్టలు, వారిని చూసి విలపిస్తూ బంధువుల ఆక్రందనలు. గల్లంతైనవారి కోసం ఆందోళనలు మిన్నంటాయి. అయినవారినేగాక ఇళ్లను, ఆస్తులను కోల్పోయి వేలాది మంది అనాథలుగా మిగిలారు. రాష్ట్రంలో కడలూరు, నాగపట్నం, కన్యాకుమారీ, రామేశ్వరం తదితర సుముద్రతీర జిల్లాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘోరపరిణామం చోటుచేసుకుని పదేళ్లయినా బాధితుల గుండెల్లో ఇంకా ఆవేదనల తడి ఆరలేదు. కన్నీటి చారలు వీడలేదు. చనిపోయిన వారి జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ప్రతి ఏడాది డిసెంబరు 26ను సునామీ మృతుల శ్రద్ధాంజలి దినంగా ప్రజలు తమంతట తాముగానే జరుపుకుంటున్నారు. మత్స్యకార కుటుంబాలు చేపల వేటకు వెళ్లకుండా నివాళులర్పిస్తున్నారు. అసంపూర్తి ఇళ్లతో అవస్థలు సునామీ బాధిత ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయి అధికారుల అలక్ష్యానికి సాక్ష్యంగా నిలిచింది. కడలూరు జిల్లాలో 51 మత్స్యగ్రామాలు ఉండగా, సునామీ ధాటికి 617 మంది మృత్యువాత పడగా, 38 మంది గల్లంతయ్యూరు. వీరి జాడ ఇంతవరకు లేదు. ఇక్కడి జాలర్ల కోసం రూ.14.75 కోట్లతో 538 సునామీ గృహాలు నిర్మించ తలపెట్టారు. 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఇంటికి రూ.2.75 లక్షలు కేటాయించారు. 2009లో నిర్మాణ పనులు ప్రారంభమైనా నేటికీ అన్ని ఇళ్లు పూర్తికాలేదు. పూర్తయిన ఇళ్లను మత్స్యకారులకు కాకుండా వేరేవారు ఆక్రమించారు. అదేమని ప్రశ్నించిన జాలర్లను బెదిరిస్తున్నారు. నిర్మించి ఐదేళ్లు కూడా పూర్తికాకమునుపే ఇంటి గోడలు బీటలు వారాయి. వర్షాకాలంలో ఏమాత్రం నివసించలేని నాశిరక నిర్మాణాలు చేపట్టారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, వీధిదీపాల వసతి లేదు. సునామీ మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2లక్షలు అందజేశాయి. ఈ లెక్కన రూ.1200 కోట్లను పంపిణీ చేసినట్లు డిజాస్టర్ మేనేజిమెంట్ జాయింట్ డెరైక్టర్ ఎస్ కందస్వామి తెలిపారు. నష్టపరిహార పంపిణీ, సునామీ బాధిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తయినట్లు వివరించడం విశేషం. -
కన్నీళ్లకు పదేళ్లు
26.12.2004 సునామీ: దశాబ్దపు దుఃఖం పదేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. 2004 డిసెంబర్ 26. ఆదివారం సెలవు దినం కావడంతో విశ్రాంతిగా సేదతీరుతూ... టీవీ చూస్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సముద్రంలో భూకంపం అని బ్రేకింగ్ న్యూస్. అప్పుడు సమయం ఉదయం 7.30 గంటలు. ఈ ఉపద్రవం ఎక్కడోకాదు, మననే చుట్టుకోనుందని తెలుసుకునేందుకు వారికి ఎంతో సేపు పట్టలేదు. అప్రమత్తం అయ్యేలోపునే ఆవలి ఒడ్డున ఉన్న సముద్రుడు ఈవలి ఒడ్డున ఉన్న నివాసగృహాలను కబళించివేశాడు. పట్టుచిక్కేలోపునే ప్రజల ప్రాణాలను హరించివేశాడు. నిండైన కుటుంబాలు సునామీ అనే శోకసంద్రంలో మునిగిపోయాయి. భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, మాల్దీవులు, సోమాలియాలపై సునామీ బలంగా విరుచుకుపడింది. మొత్తం 14 దేశాల్లో సుమారు 2లక్షలా 30 వేల మందిని బలిగొంది. భారతదేశంలో సునామీ ప్రభావానికి ఎక్కువగా కకావికలమైంది తమిళనాడు మాత్రమే. తమిళనాడులో 1700 మందిని సునామీ కాటువేయగా, ఒక్క చెన్నై నగర పరిధిలోనే 131 మంది ప్రాణాలను హరించివేసింది. ఇందులో కూడా ఒక్క శ్రీనివాసపురంలోనే 52 మంది రాక్షస అలలతాకిడికి బలైపోయారు. సునామీ పొట్టనపెట్టుకున్న వారితో తమకున్న తీపి జ్ఞాపకాలను గత పదేళ్లుగా ప్రతి క్రి స్టమస్ పండుగ మోసుకొస్తోంది. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఈనాటికీ మృతుల కుటుంబాలను వీడలేదు. కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై ఒకే కుటుంబంలో ముగ్గురిని మింగిన రక్కసి చెన్నై మెరీనాబీచ్ సమీపంలో శ్రీనివాసపురంలో వీ సెల్వమణిది చిన్న కుటుంబం. భార్య, నలుగురు కుమార్తెలు, అత్తగారు. ఆ రోజు... ప్రపంచంలో ఎక్కడో భూకంపం వస్తోందనే టీవీ వార్తలను కుటుంబమంతా కలిసి చూస్తున్నారు. ఇంతలో బైట నుండి కేకలు వినిపించడంతో అందరూ ఇంటి వాకిట్లో నిలబడ్డారు. ఇంటికి అరకిలోమీటర్ల దూరంలో ఉండే సముద్రపు నీరు అప్పటికే వారి కాళ్లపాదాలను తాకుతోంది. అసలు ఏమి జరుగుతోందో తెలిసేలోగా రెప్పపాటులో ఐదు అడుగుల ఎత్తుకు నీరు చేరింది. ముగ్గురు కుమార్తెలను సెల్వమణి ఒడిసిపట్టుకుని కొంతదూరం కొట్టుకుపోయాడు. ఇంతలో సముద్రపు అలల్లో దొర్లుకుంటూ వచ్చిన పెద్ద రాయి సెల్వమణి కాలికి బలంగా తగలడంతో కుమార్తెలు చేజారారు. సెల్వమణి సైతం బురదలో కూరుకుపోయారు. మార్గమధ్యంలో చిక్కిన ద్వారబంధనంతో సెల్వమణి బైట పడ్డాడు. ముగ్గురు కుమార్తెలు ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు. అయితే అత్త పాలయమ్మ (70), భార్య రాజేశ్వరి (45), కుమార్తె రమణి (25)లను సునామి బలితీసుకుంది. మూడురోజుల తర్వాత శవాలు: సెల్వమణి ‘‘సముద్రపు నీరు వెనుదిరగానే ముగ్గురు కుమార్తెలు క్షేమంగా నా దగ్గరకు వచ్చారు. మా ఇంటికి సమీపంలోని అక్క ఇంటిలో తలదాచుకున్న నా భార్య అక్కడే ప్రాణాలను వదిలింది. అత్త, పెద్ద కుమార్తె కనపడక పోవడంతో అన్నిచోట్లా వెతికాను. మృతదేహాలు లభ్యం కాకపోవడంతో ఎక్కడో క్షేమంగా ఉంటారులే అనుకున్నాను. అయితే మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో పరిసరాల్లో వెతికి చూస్తే, రెండు ఇళ్ల మధ్యన ఉన్న ఇరుకు సందులో అత్త, కూతురు ఒకరిచేతులు ఒకరు పట్టుకున్న రీతిలో మృతజీవులుగా పడి ఉండడం కనిపించింది’’ అని సెల్వమణి కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబాన్ని రక్షించబోయి... ‘భూకంపం వస్తోందంట, మిద్దెపై నుండి బయటకు రాండి’ అంటూ తన భర్తను, పిల్లలను కాపాడాలని ఆమె హృదయం తపించిపోయింది. వస్తున్నది భూకంపం కాదు, సునామీ అనే భూతం అని గుర్తించేలోపే ఆమె కాలగర్భంలో కలిసిపోయింది. పీఎస్ చెల్లప్పన్, రత్న (60) దంపతులకు ఇద్దరు కుమారులు. వారితోనే కోడలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, తమ్ముడిని, భార్య మిని, కుమార్తె వినితను పోషించే బాధ్యత పెద్ద కుమారుడైన అనిల్‌కుమార్‌ది. ఆరోజు ఆదివారం కావడంతో సముద్రపు ఒడ్డున అమ్మే అరుదైన రకం చేపలను కొనేందుకు రత్న, మిని వెళ్లారు. చేపలు బేరం అడుతున్న సమయంలో కంటికి ఎదురుగా కనిపించే సముద్రంలో అలలు ఎగిసిపడటం, స్థానికులంతా భూకంపం అని భయకంపితులు కావడంతో ఇద్దరూ ఇంటివైపు పరుగులు పెట్టారు. ఇంటి పరిసరాల్లో దట్టమైన ఇసుక, మట్టీ పేరుకుపోవడంతో వృద్దురాలైన రత్న వేగంగా ముందుకు సాగలేకపోయారు. ‘ఇల్లు కూలుతుందేమో బయటకు వచ్చేయండీ’ అంటూ భర్తను, ఇద్దరు కుమారులను ఆమె హెచ్చరిస్తున్న దశలోనే రెండు అలలు ఆమెను చుట్టుముట్టేశాయి. మూడోసారి వచ్చిన బలమైన అల ఆమెను నిలువులోతు నీళ్లలో ముంచేసింది. అత్త పక్కనే ఉండిన కోడలు మిని అతి కష్టంమీద నిలదొక్కుకుని ప్రాణాలు దక్కించుకుంది. తనకు అండాదండగా ఉన్న భార్యను సునామీ మింగేయడంతో కృంగిపోయిన చెల్లప్పన్ కొద్దికాలంలోనే కన్నుమూశాడు. అమ్మజ్ఞాపకాలు పదిలం: అనిల్‌కుమార్ మమ్మల్ని కాపాడాలనే తాపత్రయంలో అమ్మ తన ప్రాణాలను కోల్పోయిందని తలచుకున్నపుడల్లా మేము తల్లడిల్లిపోతాము. తమ్ముడు ఉదయాన్నే చర్చికి, అమ్మ, భార్య చేపల కోసం పోయివున్నారు. నాన్న, నేను మాత్రమే ఇంటిలో ఉన్నాము. కాలుకదపలేని స్థితిలో నాన్న ఇంటిలోనే ఉండిపోగా, నేను మాత్రం మిద్దెపై నుండి కిందకు వచ్చాను. సముద్రపు అలలతో ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్ మునిగిపోయింది. నేను కూడా నీళ్లలో కొట్టుకుపోతూ మధ్యలో కరెంటు స్తంభం పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాను. అమ్మ కొట్టుకుపోతుంటే, 15 ఏళ్ల నా కుమార్తె కాపాడే ప్రయత్నం చేసింది. నీటి మట్టం తగ్గిన తరువాత చూస్తే అమ్మ శవం అడుగున పడి ఉంది. డిసెంబరు వస్తే చాలు.. అమ్మ గుర్తుకు వచ్చి గుండె అంతా దిగులవుతుంది.