బల్లి.. తల్లి..
కాన్పు ఏ మహిళకైనా పునర్జన్మే.. చిత్రంలోని ఇండోనేషియా మహిళ డెబీ(బెడ్‌పై ఉన్న ఆమె)కి కూడా.. అయితే, ఈమె నవమాసాలు మోసి.. జన్మనిచ్చింది బుల్లి పిల్లకు కాదు.. బల్లికి!! అవును. ఈ బల్లికి తల్లిని తానేనని డెబీ చెబుతోంది. తాను ఇన్ని నెలలు కడుపులో మోసింది ఈ బల్లినేనని గట్టిగా వాదిస్తోంది కూడా. మనమైతే.. ఇదంతా బోగస్ అని.. పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తాం. అయితే.. ఇండోనేషియా అధికారులు మాత్రం అలా కొట్టిపారేయలేదు. ఇది నిజమా కాదా అని తేల్చడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రస్తుతం ఆ బృందం దర్యాప్తు చురుగ్గా సాగుతోంది కూడా.. ఇంతకీ ఈ బల్లి తల్లి కథ ఏమిటంటే.. డెబీ గర్భవతి. ఆ విషయాన్ని డెబీ ఉండే ఓనంటో గ్రామస్తులు కూడా నిర్ధారిస్తున్నారు.
మే 30న ఆమెకు నొప్పులు వచ్చాయి. ఆస్పత్రి చాలా దూరం కావడంతో ఇంటి పక్కనున్న మహిళ జోసెఫెన్(బల్లిని చూపిస్తున్న మహిళ)ను కాన్పు కోసం సాయం కోరింది. ప్రసవం సమయంలో జోసెఫెన్ డెబీ ఇంట్లోనే ఉంది. ఆమె కూడా చిన్నారి కాకుండా చిన్న బల్లి వచ్చిందనే చెబుతోంది. ఏదో తేడా జరిగిందని గ్రహించి.. జోసెఫెన్ ఆ బల్లి పిల్లను, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది కూడా.. డెబీ వాదనను జోసెఫెన్ కూడా సమర్థిస్తుండంతో అధికారులు డైలమాలో పడ్డారు. ప్రసవం సమయంలో అక్కడ బల్లి ఉండిఉండవచ్చని అంటున్నారు. డెబీ, జోసెఫెన్ వాదనంతా అబద్ధమని చెబుతునే.. నిజం కనుక్కునే పనిలో పడ్డారు. అటు గ్రామస్తులు మాత్రం డెబీ చేతబడిలాంటివి చేస్తోందని.. అందుకే ఇలా జరిగిందని ఆమెపై ఫైర్ అవుతున్నారు.