పోర్టబుల్ టాయిలెట్లో ప్రాణాంతక జీవి
చావు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకడు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ కు గురవుతాడు. ఇంకొకడు కదులుతున్న రైలు నుంచి జారిపడి పైకిపోతాడు. మరొకడు టాయిలెట్ లోకి పోయి ప్రాణంమీదికి తెచ్చుకుంటాడు. ప్రపంచంలో ఏదీ సురక్షితంకాదు. టాయిలెట్లు కూడా!
పోర్టబుల్ టాయిటెల్ లో ప్రాణాంతక జీవి దాక్కున్న సంగతి తెలియక లోపలికి వెళ్లి పనికానిద్దామనుకున్న ఓ యువకుడు ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడగలిగాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను పర్యవేక్షించేందుకు సిడ్నీ శివారు ప్రాంతానికి వెళ్లిన ఆ యువకుడు అక్కడ ఏర్పాటుచేసిన పోర్టబుల్ టాయిలెట్ ను వాడేందుకు లోపలికి వెళ్లాడు. టాయిలెట్ బేసిన్ లో ఓ మూలన నక్కిన రెడ్ బ్యాక్ అనే విషపు సాలీడు యువకుడి పురుషాంగంపై కాటేసింది! ఈ రెడ్ బ్యాక్ అలాంటిలాంటి సాలీడుకాదు.. సాలీడు జాతిలోనే అత్యంత విషతుల్యమైనది. అది కుట్టిన చోట మొదట మంట, ఆ తర్వాత విపరీతమైన నొప్పి మొదలవుతుంది. కాటుపడిన భాగమంతా వాచిపోతుంది. ఒళ్లంతా చమటలు పడతాయి. బీపీ హై లెవెల్ కి వెళుతుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి. సకాలంలో ఆసుపత్రికి వెళ్లకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదమూ ఉంది.
దక్షిణ సిడ్నీలోని కొగారా అనే ఊళ్లో చోటుచేసుకున్న ఈ సంఘటనలో బాధిత యువకుడు రెడ్ బ్యాక్ కాటుకు గురైన వెంటనే పనివాళ్ల సాయంతో ఆసుపత్రికి చేరుకోగలిగాడు. డాక్టర్లు అతని పురుషాంగంలో వ్యాపించిన విషాన్ని తొలిగించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. విషపు సాలీళ్లకు ఆవాసమైన ఆస్ట్రేలియాలో ఇలాంటి కేసులు సహజమేనని, సాలీళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. పోర్టబుల్ టాయిలెట్ వాడేటప్పుడు మీకు కూడా ఇలాంటి ప్రమాదం ఎదురుకావచ్చేమో బీ కేర్ ఫుల్!