breaking news
DCP Ramachandra Reddy
-
చౌటుప్పల్‌లో కార్డన్ సెర్చ్
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి నాయకత్వంలో 150మంది పోలీసులు 10బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బుడిగ జంగాల కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి తనిఖీలు చేస్తుండడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులంతా ఇండ్లల్లోకి ఎందుకు వచ్చారో తెలియక మొదట ఆందోళన చెందారు. గంజాయి స్వాధీనం పోలీసుల కార్డన్ సెర్చ్‌లో కుంబ శ్రీరాములు ఇంట్లో అరకిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ధైర్యంగా గంజాయిని ఇంట్లో నిలువచేసుకోవడం పట్ల పోలీసులు విస్తుపోయారు. శ్రీరాములును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అదే విధంగా సరైన పత్రాలు లేని 42ద్విచక్రవాహనాలు, 1కారు, 3ఆటోలు, 1సిలిండర్ పట్టుబడ్డాయి. కాలనీ పరిసరాల్లో మద్యం అమ్మే ముగ్గురు బెల్టు షాపు దుకాణాదారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా మరో ఐదుగురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే : డీసీపీ ఈ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు మండల కేంద్రంలోనే సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందింది. అందులో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందన్నారు. పాత, కొత్త నేరస్తుల గుండెల్లో గుబులు పుడుతుందని తెలిపారు. ప్రజలంతా సరైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల ఒర్జినల్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏసీపీలు రామోజు రమేష్, శ్రీనివాసాచార్యులు, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై చిల్లా సాయిలు, వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేటలో 40 ద్విచక్రవాహనాలు.. సూర్యాపేటక్రైం : జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శంకర్ ఆధ్వర్యంలో 150మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, దొంగతనాలు నివారించడం, అక్రమకార్యకాలపాలు, సంఘ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, శాంతి భద్రతల రక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల అదుపు చేయడము కోసమే జిల్లా వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్‌సెర్చ్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఆందోళన చెందవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీపాల దందా గుట్టురట్టు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ కంపెనీల పాలను కల్తీ చేసి... రీ-ప్యాకింగ్‌తో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నిర్వహిస్తున్న నిందితుడి నుంచి ప్యాకింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన డి.అమృతలాల్ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నేరేడ్మెట్లోని సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఐదేళ్లుగా హెరిటేజ్ పాల కంపెనీకి డిస్ట్రిబూటర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను కొని టీస్టాల్స్, హోటల్స్‌తో పాటు కొన్ని ఇళ్లల్లోనూ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే పాలను నీళ్లతో కల్తీ చేసి, మళ్లీ రీ-ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టాడు. కల్తీ తంతు ఇదీ... అమృత్లాల్ టీ స్టాల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తుంటాడు. రోజూ తెల్లవారుజామున మూడున్నరకల్లా హెరిటేజ్ కంపెనీ నుంచి ఇతడికి 300 నుంచి 400 లీటర్ల పాల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లను అనుమానం రాకుండా కత్తిరించి, పాలను టబ్‌లో పోస్తాడు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 100 లీటర్లకు పైగా నీళ్లు కలుపుతాడు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేకపోతే... ఒక్కోసారి కలుషిత నీటినే వాడేసేవాడు. ఆ పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలో నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ చేస్తాడు. ఆ ప్యాకెట్లను హోటళ్లు, టీ స్టాళ్లు, ఇళ్లకు బట్వాడా చేయిస్తున్నాడు. సేకరించిన ఖాళీ పాల ప్యాకెట్లలో కొన్ని పాతవి ఉంటే వాటిపై ఉన్న తయారీ తేదీని థిన్నర్ సాయంతో తుడిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం దాడి చేసి అమృత్లాల్ను పట్టుకున్నారు. దాడి సమయంలో 237 పాల ప్యాకెట్లతో పాటు రెండు ప్యాకింగ్ మిషన్లు, మూడు థిన్నర్ బాటిళ్లు, వివిధ కంపెనీలకు చెందిన 100 ఖాళీ పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహాలో గతంలోనూ నగర శివార్లలో యూరియా, మంచినూనె కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠానూ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్యాకెట్ల సైజ్ కాస్త చిన్నగా ఉంటుందని, ప్యాకెట్లలో ఖాళీస్థలం తక్కువగా ఉంటుందని, ప్యాకె ట్లపై తయారీ తేదీ చెరిపేసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాకెట్లను అనుమానించాలని, వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు విని యోగదారులకు సూచిస్తున్నారు.