breaking news
DCCMS
-
పరస్పర సహకారంతో రైతులకు సేవలు
నష్టాల నుంచి గట్టెక్కుతున్న డీసీఎంఎస్ ప్రతీ సొసైటీలో త్వరలో గోదాంల నిర్మాణం కొత్త జిల్లాలకు డీసీఎంఎస్ కార్యాలయాల నిర్మాణం డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి కరీంనగర్ అగ్రికల్చర్ : రైతుల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ముందుకు సాగుతోందని డీసీఎంస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి తెలిపారు.కరీంనగర్‌లోని డీసీఎంస్ సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన 68వ సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మార్చి 28న నిర్వహించిన మహాసభ తీర్మానాలను ధ్రువీకరించారు. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016వరకు జరిగిన లావాదేవీలపై సమీక్షించి ఆమోదించారు. రాష్ట్రప్రభుత్వం జగిత్యాల, పెద్దపల్లిని నూతన జిల్లాలుగా ప్రతిపాదించడంతో ఆయా ప్రాంతాల్లో డీసీఎంఎస్ కార్యాలయాలు, గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.1.20 కోట్ల నష్టాన్ని రూ.61 లక్షల వరకు పూడ్చినట్లు చెప్పారు. సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, మంథని ప్రాంతాల్లోని డీసీఎంఎస్ ఆస్తులను పకడ్బందీగా కాపాడినట్లు పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో సహకార సంఘాలు పోటీపడకుండా డీసీఎంఎస్‌కు సహకరించాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలను నియంత్రించి మేలు రకాలైన సర్టిఫైడ్ విత్తనాలను డీసీఎంఎస్ ద్వారానే రైతులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచి సరఫరా చేస్తామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంçఘాల చైర్మన్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రతీ సొసైటీకి గోదాంల నిర్మాణంతోపాటు సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సౌకర్యమే లక్ష్యంగా విలువైన స్థిరాస్తులను కాపాడుకుంటూ లాభాల దిశగా వ్యాపారం చేయాలని సూచించారు. అంతకుముందు మేనేజర్ నివేదిక సమర్పించారు. సమావేశంలో డైరెక్టర్లు కె.గోపాల్‌రెడ్డి, నాంపెల్లి(జానీ), జి.పోతీలాల్, బి.లోకేశ్‌కుమార్, ఎం.కోటేశ్వర్, టి.దామోదర్, డి.లక్ష్మీనారాయణ, జి.కృష్ణారెడ్డి, బిజినెస్ మేనేజర్ ఆర్.వెంకటేశ్వర్రావు, కరీంనగర్ ఏడీఏ శ్రీధర్, మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్‌కుమార్, టీఎస్ సీడ్స్ డీఎం.కొండాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
డీసీఎమ్మెస్ సర్వసభ్య సమావేశం రేపు
నెల్లూరు రూరల్: జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరులోని సొసైటీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వంచనున్నట్లు ఎన్డీసీఎమ్మెస్ చైర్మన్ ఏడుగుండ్ల సుమంత్‌రెడ్డి తెలిపారు. శాంతినగర్‌లోని కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మార్కెటింగ్ సొసైటీ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.18.96 కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహించగా, రూ.26 లక్షల ఆదాయం, 2014 – 15లో రూ.36.6 కోట్ల వ్యాపారం చేయగా, రూ.28 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఆత్మకూరు, నెల్లూరులోని గోదాములు శిథిలావస్థకు చే రుకోగా, కొత్త వాటిని నిర్మించామని చెప్పారు. టీటీడీకి కందిపప్పును సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది మిరియాలు, బెల్లాన్ని సరఫరా చేసేందుకు అవకాశం వచ్చిందని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు పాలకవర్గ సభ్యులతో సమావేశం, మధ్యాహ్నం 11 గంటలకు సర్వసభ్య సమావేశానికి సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.