సినిమాకు దూరంగా...
నీ నవ్వే చాలు అంటూ హన్సిక గురించి పాడుకునే అభిమానులెందరో.... అలా ముసి ముసి నవ్వులతో, ఓర చూపులతో కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న హన్సిక కొన్ని రోజులు సినిమాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎందుకబ్బా? అవకాశాల్లేవా? అంటే అరడజనుకు పైగా చిత్రాలతో ఆమె డైరీ ఫుల్ అయ్యింది. ఇటీవలే ఇళయదళపతితో విదేశాల్లో పులి చిత్రం కోసం డ్యూయెట్ పాడి వచ్చారు. మరో పాటలో కూడా చేయాలి. ఇది విజయ్ నటిస్తున్న భారీ సోషియో, ఫాంటసీ చిత్రం. ఇందులో హన్సిక అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా యువరాణిగా కనిపించనున్నారు.
మరో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో తొలిసారిగా సాహసోపేతమైన పోరాటాలు కూడా చేశారట. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. అహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కళాశాల అమ్మాయిగా ఉదయనిధి స్టాలిన్‌తో ప్రేమ పాఠాలు చదువుకున్నారట. ఇప్పటికే జయం రవితో రోమియో జూలియట్ అంటూ యువళగీతాలు పాడేస్తున్నారు.
ఇలా ప్రస్తుతం 8 చిత్రాలను తన కిట్‌లో వేసుకన్న హన్సిక కొన్ని రోజులు సినిమాకు దూరంగా ఉండాలనుకోవడానికి కారణం తన దత్తత పిల్లలతో గడపాలనుకోవడమేనట. తన ప్రతి పుట్టినరోజుకు ఒక అనాథ చొప్పున 25 ఏళ్ల హన్సిక ఇప్పటికి (ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురిని కూడా) 30 మందిని దత్తత తీసుకు న్నారు. వారిలో ఇద్దరు అస్వస్థతకు గురి కావడంతో ఈ బ్యూటీ కొన్ని రోజులు సినిమాకు దూరంగా వారితో గడపాలని నిర్ణయించుకున్నారట.