breaking news
Cylinder leakage
-
గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి
అహ్మదాబాద్: ఇంట్లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీతో సంభవించిన పేలుడులో నలుగురు చిన్నారులు సహా 9 మంది తీవ్ర గాయాలతో చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారులో ఈనెల 20వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా మధుసూదన్‌గర్‌కు చెందిన వారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు, శుక్రవారం ఐదుగురు, శనివారం ఒకరు చనిపోగా ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ‘కార్మికులు, వారి కుటుంబసభ్యులు 9 మంది కలిసి ఒక ఇరుకు గదిలో నిద్రిస్తుండగా, ఆ గదిలోని ఎల్పీజీ సిలిండర్ లీకయింది. ఇది పసిగట్టి పొరుగునే ఉండే కుల్‌సింహ్ భైరవ అప్రమత్తం చేసేందుకు ఆ ఇంటి తలుపు తట్టాడు. నిద్రిస్తున్న ఒకరు లేచి, లైట్ స్విచ్ ఆన్ చేయగా, అప్పటికే గదంతా దట్టంగా వ్యాపించిన గ్యాస్ అంటుకుని మంటలు, పేలుడు సంభవించాయి. కుల్‌సింహ్ సహా మొత్తం 10 మందికి ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు చిన్నారులు సహా 9 మంది చనిపోగా, కుల్‌సింహ్ బైరవ పరిస్థితి విషమంగా ఉందని శనివారం పోలీసులు తెలిపారు. భైరవ సొంతూరు రాజస్తాన్‌లోని కరౌలీ అని చెప్పారు. -
నగర శివారులో పేలుడు
సాక్షి, ముంబై: నగర శివారు ప్రాంతమైన నాలాసొపారలో శనివారం ఉదయం ఓ ఇంట్లో సంభవించిన పేలుడు ఘటనలో ఇద్దరు తీవ్రగాయాల పాల య్యారు. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులంతా సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఎం. డి.నగర్‌లోని మహాలక్ష్మీ అపార్టుమెంట్ బి-వింగ్‌లోని ఓ ఫ్లాటులో ఉదయం ట్యూబ్‌లైట్ స్విచ్ వేయగానే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంటితోపాటు ఇరుగుపొరుగు ఇళ్లలో కూడా సామగ్రి చిందరవందరగాపడిపోయాయి. భయంతో ఇళ్లల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంవల్ల లైట్ స్విచ్ వేయగానే పేలి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్థారణకు వచ్చారు. పేలుడుగల కారణాలు తెలుసుకునేందుకు మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.