breaking news
Cultural atmosphere
-
Diwali 2022: అమావాస్య చీకట్లలో పున్నమి వెలుగులు
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి పండుగ. మన మహర్షులు ఏర్పరచిన మన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీక ‘దీపావళి పండుగ‘. సమగ్ర భారత దేశంలో హిందువులే కాక జైనులు, బౌద్ధులు, సిఖ్ఖులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్ లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. అమావాస్యను, పౌర్ణమిని కూడా ‘పూర్ణ తిథులు‘ అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటాము. ‘దీపానాం ఆవళీ – దీపావళీ.‘దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు – సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించటం, పితృతర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గదర్శనమవుతుంది. నరకుడు అలా పుట్టాడు: హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. ‘తథాసు’్త అన్నాడు బ్రహ్మ. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, అమాయకులను, సాధువర్తనులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. దీపావళి పండుగను అజ్ఞానం మీద జ్ఞానం, అంధకారం మీద వెలుగు విజయంగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయంగానూ చెప్పవచ్చును. ఈ దీపావళి పండుగనాడు కొందరు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని కేదారేశ్వర వ్రతం చేస్తారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ప్రతీతి. దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానం అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి. ‘తమసోమా జ్యోతిర్గమయ‘ అంటే అర్థం ఇదే! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ జాతి విభేద రహితంగా జరుపుకుని ఆనందించేది ఈ దీపావళి పండుగ. దీపం చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలను ‘కౌముది ఉత్సవాలు‘ అంటారు. ఈ దివ్వెల పండుగ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవారాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ విశ్వమంతా ఆనంద డోలికలలో తేలియాడుతున్న భావనతో అందరి హదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యం, ధర్మం, సమత, ప్రేమ, భూత దయ, సౌమనస్యం వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని అనుభవిస్తాం. దీపావళినాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందాలు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది. దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయమయినప్పుడు మనం ఆ ఆనందాన్ని సర్వప్రాణి కోటికి పంచగలుగుతాం. పరమాత్మ అనుగ్రహంతో యావద్విశ్వం ఆనందమయమగు గాక! దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంతసేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీ ‘బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు, వాకిళ్ళను తుడిపించుకోవాలి‘ అని ధర్మశాస్త్రం చెప్తోంది. ∙చతుర్దశి మొదలు మూడు రాత్రులు దేవాలయాలలో, మఠాలలో, ఉద్యాన వనాలలో, వీధులలో, ఇళ్ళల్లో, గోశాలలలో, గుర్రాలు, ఏనుగులు ఉండు చోట్లల్లో దీపాలు వెలిగించాలి అని శాస్త్ర వచనం. ∙ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు ఉదయం చంద్రుడు ఉండగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. సూర్యాస్తమయ సమయంలో నరకాసుర వధ జరిగింది కనుక విథూయంలో అభ్యంగన స్నానమాచరించాలి అని పెద్దలు చెప్పారు. ∙‘దీపావళి ముందరి చతుర్దశి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగామాత ఆవేశించి ఉంటారు‘ అని పద్మ పురాణం చెప్తోంది. ఆరోజున సూర్యోదయాత్పూర్వం స్నానం చేసిన వారు యమలోకాన్ని దర్శించరట. ∙నువ్వుల నూనె శరీరానికి పట్టించుకుని అభ్యంగన స్నానం చేయటం వలన శనిదోష నివారణే కాకుండా, కండరాలు నరాలు దృఢపడతాయి. నరక చతుర్దశి రోజున తెల్లవారుఝామున స్వాతి నక్షత్ర కాంతి నీటిపై తన ప్రభావం చూపిస్తుంది. దీపావళి రోజు అమావాస్య కనుక సూర్యుడు తన సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తాడు. జలాధిపతి అయిన వరుణుడు తన అనుగ్రహాన్ని నీటిలో ఉంచుతాడు. కనుక ఈ స్నానం ఆరోగ్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పద్మ పురాణ, స్కాంద పురాణాలలో దీపావళి గురించిన ప్రస్తావన ఉంది. శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగదొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైన రోజు ఈరోజు కనుక ఈరోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరుకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృత, త్రేతా, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవే కాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. – డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి -
గెలుపు పాఠం
ఎన్నో శతాబ్దాలు వలస పాలనలో ఉన్న పోలాండ్ పడిన చోటే నిటారుగా నిల్చుంది. సొంత ఉనికిని కాపాడుకుంటూ వడివడిగా అడుగులు వేసింది. ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా అభివృద్ధి జెండాను ఎగురవేసింది. 14వ శతాబ్దంలో పోలాండ్ బలమైన ఏకీకృత రాజ్యంగా ఉనికిలో ఉంది. 16వ శతాబ్దంలో సంపన్న రాజ్యంగా విలసిల్లింది. 17వ శతాబ్దంలో మాత్రం శత్రురాజ్యాల వల్ల పోలాండ్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది. రకరకాల యుద్ధాలు పోలాండ్‌ను నిట్టనిలువునా కూల్చేశాయి. ఆస్తి నష్టమే కాదు ప్రాణనష్టం కూడా విపరీతంగా జరిగింది. ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాలు పోలాండ్‌ను పంచుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా పోల్స్ రెండు మూడుసార్లు తిరుగుబాటు చేసినా అవి విఫలం అయ్యాయి. పరాయి పాలకుల పాలనలో అణచివేతకు గురైన పోలాండ్ సంస్కృతి 19వ శతాబ్దంలో మళ్లీ వికసించింది. రాజకీయశక్తిగా కూడా పోలాండ్ బలపడింది. 1918లో పునర్నిర్మాణమైన పోలాండ్ ‘కమ్యూనిస్ట్ పోలాండ్’ (8 ఏప్రిల్ 1945)గా 1989 నుంచి ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా ఉనికిలో ఉంది.bజర్మన్లు, ఉక్రేనియన్లు, లిథువేనియన్లు...మొదలైన జాతుల ప్రజలు ఉండడం వల్ల దేశమంతా భిన్నమైన సాంస్కృతిక వాతావరణం కనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 ప్రాంతాలుగా విభజించారు. వీటిని ‘వైవోడేషిప్’ అంటారు. వీటిని 379 పొవైట్స్గా విభజించారు. దేశంలో 20 పెద్ద నగరాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వ్రోక్సా నగరం గురించి. ఈ పురాతన నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒకొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక వంతెన చొప్పున వ్రోక్సాలో వందకు పైగా వంతెనలు ఉన్నాయి. వ్రోక్సాలో 25 మ్యూజియమ్లు ఉన్నాయి. ఈ నగరానికి ఆనుకొని ఉన్న సుడెటెన్ కొండలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. పోలాండ్ రాజధాని వార్సా. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈ నగరం అభివృద్ధిపథంలో పయనించింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది యాత్రికులు వచ్చే ఈ నగరం యూరోపియన్ దేశాలలో ఆకర్షణీయమైన పర్యాటక నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పోలాండ్ ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన స్థితిలో ఉంది. దేశీయ విపణి బలంగా ఉండడమే దీనికి కారణం. విశేషం ఏమిటంటే 2000లలో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని కూడా తట్టుకొని నిలబడింది పోలాండ్. అభివృద్ధికి అవకాశం ఉన్నా అభివృద్ధి చెందలేని దేశాలు, రాజకీయ సంక్షోభాలతో చావు దెబ్బతిని ‘ఇక కోలుకోవడం కష్టం’ అని నిరాశపడే దేశాలు...పొలాండ్ నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. టాప్ 10 1. ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం పోలాండ్. 2. పోలాండ్‌కి పశ్చిమంలో జర్మనీ, దక్షిణంలో చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, తూర్పులో ఉక్రెయిన్, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి. 3. పోలాండ్ అధికారిక నామం: ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’ 4. పోలాండ్ జాతీయచిహ్నం తెలుపు డేగ. 5. ‘పొలనై’ అనే తెగ పేరు నుంచి ‘పోలాండ్’ అనే పేరు వచ్చింది. దీని అర్థం...‘బహిరంగ ప్రదేశాల్లో నివసించే ప్రజలు’ 6. ‘వరల్డ్స్ స్రాంగెస్ట్ మ్యాన్’ టైటిల్ గెలుచుకున్న విజేతల్లో ఎక్కువమంది పోలాండ్ వారే ఉన్నారు. 7. {పఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్... ధార్న్ పట్టణం (కింగ్డమ్ ఆఫ్ పోలాండ్)లో జన్మించారు. 8. పాపులర్ స్పోర్ట్: ఫుట్‌బాల్. 9. 1999లో ‘నాటో’లో, 2004లో ‘యురోపియన్ యూనియన్’లో పోలాండ్ చేరింది. 10. పోలాండ్ కరెన్సీ ‘జోల్టీ’. పోలిష్‌లో దీని అర్థ్ధం బంగారం. దేశం పోలాండ్ రాజధాని వార్సా అధికార భాష పోలిష్ కరెన్సీ జోల్టీ జనాభా 3 కోట్ల 84 లక్షల 84 వేలు (సుమారుగా)