Diwali 2022: అమావాస్య చీకట్లలో పున్నమి వెలుగులు

Diwali 2022: Diwali Celebration in India, Sakshi Special

దీపావళి ప్రత్యేకం

భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి పండుగ. మన మహర్షులు ఏర్పరచిన మన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి.

కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీక ‘దీపావళి పండుగ‘. సమగ్ర భారత దేశంలో హిందువులే కాక జైనులు, బౌద్ధులు, సిఖ్ఖులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్‌ లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు.

అమావాస్యను, పౌర్ణమిని కూడా ‘పూర్ణ తిథులు‘ అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటాము.

‘దీపానాం ఆవళీ – దీపావళీ.‘దీపావళి అంటే దీపాల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్‌ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు – సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించటం, పితృతర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గదర్శనమవుతుంది.

నరకుడు అలా పుట్టాడు: హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు.

అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. ‘తథాసు’్త అన్నాడు బ్రహ్మ. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, అమాయకులను, సాధువర్తనులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు.

దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు.

కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి.

దీపావళి పండుగను అజ్ఞానం మీద జ్ఞానం, అంధకారం మీద వెలుగు విజయంగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయంగానూ చెప్పవచ్చును.
ఈ దీపావళి పండుగనాడు కొందరు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో తమ జీవితాలు కలకాలం కళకళలాడుతూ సాగాలని కేదారేశ్వర వ్రతం చేస్తారు. కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. జగన్మాత మంగళ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ కేదారేశ్వర వ్రతం చేసిన దంపతులు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ప్రతీతి.

దీపావళి మానసిక వికాసాన్ని కలిగించే పండుగ. అజ్ఞానం అనే చీకట్లు తొలగాలి అంటే జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి. ‘తమసోమా జ్యోతిర్గమయ‘ అంటే అర్థం ఇదే! అమావాస్య నాటి చీకటిని చిరు దివ్వెల వెలుగుతో పారద్రోలాలి, అని మన పెద్దలు చెప్పారు. ఎప్పటికైనా అధర్మం నశించి, ధర్మం ఉద్ధరింపబడుతుందని, మంచి అన్నదే శాశ్వతమని చాటి చెప్పేదే దీపావళి పండుగ. కుల మత వర్ణ వర్గ జాతి విభేద రహితంగా జరుపుకుని ఆనందించేది ఈ దీపావళి పండుగ.

దీపం చైతన్యానికి ప్రతీక. దీపావళి ఉత్సవాలను ‘కౌముది ఉత్సవాలు‘ అంటారు. ఈ దివ్వెల పండుగ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తూ గడపటం, నువ్వుల నూనె దీపాలు వెలిగించి, దైవారాధన చేయటం వంటి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ విశ్వమంతా ఆనంద డోలికలలో తేలియాడుతున్న భావనతో అందరి హదయాలలో ఆధ్యాత్మిక ఆనంద తరంగాలు జాగృతమై, సత్యం, ధర్మం, సమత, ప్రేమ, భూత దయ, సౌమనస్యం వంటి సాత్విక గుణాలు ఉదయించి, ఒక విధమైన ప్రశాంతతని అనుభవిస్తాం.

దీపావళినాడు పగలంతా బంధుమిత్రుల ఆనందోత్సాహాల పలకరింపులు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలతోను, రాత్రంతా అద్భుతమైన ప్రకాశవంతమైన జ్యోతుల దర్శనంతో, మతాబుల వెలుగుల తేజస్సుతో మనలోని ఆధ్యాత్మిక చీకట్లు తొలగినట్లు, జ్ఞాన ఆనందాలు కలిగినట్లుగా ఆత్మానందానుభూతి కలుగుతుంది. దివిలోని తారలన్నీ భువికి దిగి వచ్చినట్లుగా లోకం వెలిగిపోతుంది. ఆనందోత్సాహాలు ఉరకలేస్తాయి. మన హృదయాలు ఆనందమయమయినప్పుడు మనం ఆ ఆనందాన్ని సర్వప్రాణి కోటికి పంచగలుగుతాం. పరమాత్మ అనుగ్రహంతో యావద్విశ్వం ఆనందమయమగు గాక!

దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు.

ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంతసేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీ ‘బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు, వాకిళ్ళను తుడిపించుకోవాలి‘ అని ధర్మశాస్త్రం చెప్తోంది.

∙చతుర్దశి మొదలు మూడు రాత్రులు దేవాలయాలలో, మఠాలలో, ఉద్యాన వనాలలో, వీధులలో, ఇళ్ళల్లో, గోశాలలలో, గుర్రాలు, ఏనుగులు ఉండు చోట్లల్లో దీపాలు వెలిగించాలి అని శాస్త్ర వచనం. ∙ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు ఉదయం చంద్రుడు ఉండగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. సూర్యాస్తమయ సమయంలో నరకాసుర వధ జరిగింది కనుక విథూయంలో అభ్యంగన స్నానమాచరించాలి అని పెద్దలు చెప్పారు. ∙‘దీపావళి ముందరి చతుర్దశి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగామాత ఆవేశించి ఉంటారు‘ అని పద్మ పురాణం చెప్తోంది.

ఆరోజున సూర్యోదయాత్పూర్వం స్నానం చేసిన వారు యమలోకాన్ని దర్శించరట. ∙నువ్వుల నూనె శరీరానికి పట్టించుకుని అభ్యంగన స్నానం చేయటం వలన శనిదోష నివారణే కాకుండా, కండరాలు నరాలు దృఢపడతాయి. నరక చతుర్దశి రోజున తెల్లవారుఝామున స్వాతి నక్షత్ర కాంతి నీటిపై తన ప్రభావం చూపిస్తుంది. దీపావళి రోజు అమావాస్య కనుక సూర్యుడు తన సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తాడు. జలాధిపతి అయిన వరుణుడు తన అనుగ్రహాన్ని నీటిలో ఉంచుతాడు. కనుక ఈ స్నానం ఆరోగ్యాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

పద్మ పురాణ, స్కాంద పురాణాలలో దీపావళి గురించిన ప్రస్తావన ఉంది. శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగదొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైన రోజు ఈరోజు కనుక ఈరోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరుకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృత, త్రేతా, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవే కాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు.
– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top