పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్‌ గన్‌లతో తక్షణ చర్యలు | India's Diwali fireworks set off alarm in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్‌ గన్‌లతో తక్షణ చర్యలు

Oct 21 2025 3:36 PM | Updated on Oct 21 2025 3:57 PM

India's Diwali fireworks set off alarm in Pakistan

న్యూఢిల్లీ: భారతదేశం అంతటా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశప్రజలంతా ఉత్సాహంగా టపాసులు కాల్చారు. అయితే వీటి ప్రభావం పొరుగునున్న పాకిస్తాన్‌పై పడింది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో కాల్చిన బాణసంచా పాక్‌వైపు పొగమంచుగా వెళ్లింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, రాజధాని నగరం లాహోర్‌లో గాలి నాణ్యత బాగా క్షీణించిందని పాక్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది.

దీపావళి నేపధ్యంలో భారత్‌లో విడుదలైన ఉద్గారాలు, కాలుష్యకారకాలు పాక్‌లోకి ప్రవేశించి, అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని కరాచీలోని డాన్‌ పత్రిక పేర్కొంది. పంజాబ్ పర్యావరణ పరిరక్షణ విభాగం (ఈపీడీ) తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల నుండి విడుదలైన కాలుష్య కారకాలను మోసుకెళ్లే గాలులు.. పాకిస్తాన్ పంజాబ్‌లో వాయు పరిస్థితులు దిగజారడానికి గణనీయంగా దోహదపడ్డాయి. మంగళవారం ఉదయం నాటికి లాహోర్ లో గాలినాణ్యత(ఏక్యూఐ)266కు దిగజారింది. దీంతో ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరంగా  లాహార్‌ మారిపోయింది. న్యూఢిల్లీ తర్వాత ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరింది.
 

విషపూరిత గాలిని తట్టకునేందుకు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్‌లోని ముఖ్య రహదారులపై యాంటీ స్మోగ్ గన్‌లను వినియోగించడం, నీరు చల్లడం లాంటి అత్యవసర చర్యలను ప్రారంభించింది. కాలుష్య నియంత్ర కార్యకలాపాల కోసం తొమ్మిది విభాగాలను  ఏర్పాటు చేశారు. స్మోగ్ రెస్పాన్స్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు, గాలిని కలుషితం చేస్తున్న వారిపై అధికారులు దాడులకు ఉపక్రమించారు. గంటకు 4 నుండి 7 కి.మీ వేగంతో గాలి వీచడంతో, గాలిలోని కణాలు సరిహద్దులు దాటి లాహోర్, ఫైసలాబాద్, గుజ్రాన్‌వాలా, సహివాల్, ముల్తాన్ తదితర పాకిస్తాన్ నగరాలను ప్రభావితం చేస్తున్నాయి.

పాక్‌ మంత్రి మరియం ఔరంగజేబ్ ప్రస్తుత పరిస్థితిని పెను పర్యావరణ సవాలుగా అభివర్ణించారు. అమృత్సర్, లూథియానా, హర్యానా నుండి వచ్చే గాలులు  కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయని ఆరోపించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రాంతాలలో నిర్మాణాలను నిలిపివేయనున్నామని, కీలక రహదారుల్లో ట్రాఫిక్‌ను పరిమితం చేస్తామని, పొగను విడుదల చేసే వాహనాలపై జరిమానా విధించనున్నమని ఆమె హెచ్చరించారు.  మరోవైపు లాహోర్ పోలీసులు పలు ప్రాంతాల్లో కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న 83 మందిని అరెస్టు చేశారు. వీరిలో పరిశ్రమల నిర్వాహకులు, టైర్లు లాంటివి తగలబెడుతున్నవారు ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: Karnataka: ‘వరల్డ్‌ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement