
బెంగళూరు: తమ ప్రభుత్వం చేపట్టిన పథకానికి ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నుంచి సర్టిఫికెట్ అందిందని గొప్పగా ప్రకటించిన కర్ణాటక సీఎం ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలిన దరిమిలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల.. రాష్ట్రంలోని మహిళలకు ‘శక్తి యోజన’పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించామని, ఈ నేపధ్యంలో మహిళలు అత్యధికంగా ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. దీనిని ప్రపంచ రికార్డుగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించిందని ప్రకటించారు. కర్ణాటక రెండు చరిత్రాత్మక రికార్డులతో ప్రపంచ వేదికపైకి ప్రవేశించిందని పేర్కొన్నారు.
‘శక్తి యోజన’ పథకం కింద మహిళలు మొత్తంగా 564.10 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఇది మహిళల రోజువారీ ప్రయాణాలలో కొత్త రికార్డు అని సిద్దరామయ్య తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. దీనికితోడు కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ 1997 నుంచి ఇప్పటివరకూ 464 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందని చెబుతూ, రెండు సర్టిఫికెట్ల ఫొటో కాపీలను షేర్ చేశారు.ఈ రెండు సర్టిఫికెట్లపై లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్(ఇండియా)డాక్టర్ అవినాష్ డి. సకుండే, యూరోపియన్ యూనియన్ హెడ్(క్రొయేషియా)డాక్టర్ ఇవాన్ గచినాల సంతకాలున్నాయి.
A BIG embarrassment for Congress.
Yesterday, no less than Karnataka CM Siddaramaiah proudly claimed that two state schemes were recognised by the London Book of Records.
Turns out — it’s FAKE. Someone literally conned the Congress! 😂
The so-called “certificate” is full of… pic.twitter.com/N0NPu3OUji— Amit Malviya (@amitmalviya) October 17, 2025
ఈ సర్టిఫికెట్లను గమనించిన ప్రతిపక్ష పార్టీలు ఇది కేవలం ప్రచార స్టంట్ అని ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలకు అధికంగా ఖర్చు చేస్తోందని, రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు మొత్తం రూ.6,330 కోట్ల అప్పును కలిగి ఉన్నాయని, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. కాగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ బ్రిటన్‌లో నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ అధికారికంగా 2025, జూలై 15న మూతపడింది. అవినాష్ ధనంజయ్ సకుండే 2024, జూన్ 28న ఈ సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు మనుగడలో లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు చెల్లనివని నిరూపితమయ్యాయి. బీజేపీ నేత అమిత్ మాలవియ కర్నాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు ఫేర్ అంటూ ఆధారాలతో సహా షేర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సీఎం సిద్దరామయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం