breaking news
crucifixion of Jesus
-
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్యజీవము
గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనేగాని ఎలా విస్తారమైన పంట నివ్వలేదో క్రీస్తు కూడా యుక్త కాలమున చనిపోవటం ద్వారా మనందరికీ మరణం తర్వాత తిరిగి శాశ్వత జీవం అనే ఆశీర్వాద భాగ్యం లభించింది. సర్వమానవుల కోసం ఒక్కడే ధైర్యంగా సిలువను మోశాడు... నిరపరాధ రక్తం చిందించబడింది... బలిగా తన పరిశుద్ధ రక్తం ప్రానార్పణం గావించాడు... పరలోక భాగ్యాన్ని తృణ్రప్రాయంగా త్యజించాడు... నిత్యజీవానికి బాట వేశాడు... యేసు మరణం మానవాళికి శుభదినం... ఒక్కడే ఒక్కడు... సజీవుడైన క్రీస్తు... నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు.చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళితే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మరణం అత్యంత హేయమైనది అమానుషమైనదిగా పేర్కొనబడినది. ఆయన ప్రేమించిన శిష్యులే చివరి గడియల్లో ఆయనను విడిచి పారిపోయారు. శిష్యుడైన యూదా ముప్ఫై వెండి నాణాలకు ఆశపడి దైవకుమారుడినే మతపెద్దలకు అమ్మివేశాడు. ఏ ప్రజలైతే తన సొంతవారిగా భావించి వారే తనకు ప్రధానం అనుకున్నాడో వారి మధ్య అనేక అద్భుతాలు చేశాడో విలువైన బోధలు చేశాడో వారే ఏకమై యేసును అతి క్రూరంగా చంపడానికి సిద్ధ పడ్డారు. కేవలం తమ పదవులకు ఎక్కడ అడ్డువస్తాడో అని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు యూదా పెద్దలు నాయకులు. వారితో తనకు ఆపద సంభవించనుందని తెలిసి పస్కా పండుగ సమయంలో అందరికోసం బలి పశువుగా మారేందుకు యెరూషలేము చేరుకున్నాడు యేసు. తాను అప్పగింపబడే రాత్రి గెత్సేమనె తోటలో ఒంటరియై తండ్రినిప్రార్థించాడు. మానవాళి విమోచన కోసం చేసే బలియాగం ఎంతో వేదనకరం. యేసు విలపించుచు ప్రార్థించుండగా అతని చెమట రక్త బిందువులుగా మారిపోయింది. అంతకంటే ఆయనను అప్పగించుటకు వచ్చిన వారిలో తన శిష్యుడైన యూదా ముందుండి బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దుపెట్టుకొని మరీ యేసును వారికి అప్పగించాడు. యేసు మాత్రం ‘చెలికాడా! నీ పని కానివ్వు’ అంటూ సంబోధించడం అతనిలో ద్వేషానికి ఏమాత్రం తావులేదనడానికి రుజువుగా నిలిచింది. యేసు ఏ నేరం చేయలేదని తెలిసినా, యూదా మత పెద్దలు కేవలం అసూయ చేత క్రీస్తును సిలువ వేయడానికి సిద్ధమయ్యారని తెలిసినా ఇతనిలో నాకు ఏ నేరం కనబడుటలేదని చెప్పినా, జనసమూహం సిలువ వేయమన్న కేకలే గెలిచాయి. యేసు గలలియ వాడని తెలుసుకొని హేరోదు వద్దకు పంపినా అక్కడా తృణీకారమే ఎదురైంది. తిరిగి పిలాతు వద్దకు పంపబడ్డాడు. పొంతి పిలాతు ఎన్ని సార్లు యేసును విడుదల చేద్దామని ప్రయత్నించినా చివరకు నరహత్య చేసే గజదొంగ బరబ్బాను వదిలివేయండి, కానీ యేసును మాత్రం సిలువ వేయాలని మొండిపట్టు పట్టారు యూదా మతపెద్దలు.క్రీస్తు శ్రమలుసిలువ మరణం కనికరం లేని మరణం. దోషులను అతిక్రూరంగా శిక్షించేందుకు సిలువ మరణం ఏర్పాటు చేసేది అప్పటి రోమా ప్రభుత్వపు పెద్దలు. సిలువ మీద మరణించినవాడు శాపగ్రస్తుడుగా యూదుల ధర్మశాస్త్రంలో రాయబడివుంది. ఏ పాపమెరుగని యేసు మనుష్యజాతి రక్షణ కొరకు పాపంగా చేయబడ్డాడు. సిలువలో రోమా సైనికుల క్రౌర్యం హేళన దూషణతో వారి కర్కశమైన దండన ఎంతో భయోత్పాతం, భీతిని కలిగించేది. ఒక నిలువు చెక్క కమ్మి మీద అడ్డకమ్మెని అమర్చి దానిపై నేరం చేసిన దోషిని పడుకోబెట్టి రెండు అరచేతులు చాపి వాటిలో రెండు పొడవైన మేకులతో గుచ్చి కింద రెండు పాదాలు కలిపి అతి పొడవైన మేకుతో బలంగా చెక్కకు దిగగొట్టేవారు. ఇలా సిలువపై వేలాడబడిన మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంతో దుర్భరంగా ఉండేది. ఊపిరి పీల్చుకోడానికి ప్రయత్నించిన ప్రతిసారి నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. చివరకు ఊపిరితిత్తులు పగిలి చనిపోతారు. ఒక వేళ సాయంత్రంలోగా చనిపోకపోతే రెండు కాళ్ళు తెగనరికి రోమా సైనికులు అక్కడినుంచి వెళ్లిపోతారు.ఈ శ్రమలకు అదనంగా రోమా సైనికులతో పాటు యూదా మత పెద్దలు, పరిసయ్యులు, ప్రజలు చేరి హేళన, వస్త్రహీనత, కొరడా దెబ్బలు, తలపై ముళ్ల కిరీటం... యూదుల రాజంటూ హేళన చేస్తూ ముఖంపై పిడిగుద్దులతో దైవకుమారుడి సుందర సుకుమార దేహం అందవిహీనంగా కురూపిగా మారిపోయింది. పదివేలలో అతిప్రియుడు పరిహాసమొందాడు. అన్యాయపు తీర్పు తర్వాత యేసు మోయలేని సిలువను వీపుమీదపెట్టి కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో తిప్పుతూ కల్వరి కొండకు తీసుకు వస్తారు. యేసుకు ఇరువైపులా ఇద్దరు గజదొంగలను సిలువ వేశారు. అపహాస్యం చేయడానికి ‘యూదుల రాజైన నజరేయుడైన యేసు’ అంటూ రాయించి సిలువకు ఒక ఫలకం తగిలించారు. అతని వస్త్రాన్ని చింపి సైనికులు పంచుకున్నారు. ఒళ్ళంతా రక్తసిక్తమైన యేసుని చూసి ఏమాత్రం కనికరం లేక యూదుల రాజువైతే దిగిరా అంటూ హేళన చేశారు. అంత బాధలోనూ యేసు ఏమాత్రం నోరు తెరువలేదు. మౌనంగా సిలువ బాధను భరించాడు. యేసుక్రీస్తు మరణం ఈ లోకానికి నిత్య జీవం అనే ఆశీర్వాదం తీసుకువచ్చింది. మరణానికి బందీగా మారిన మానవుడు భయం లేకుండా నిర్భయంగా జీవించే ధైర్యాన్ని ఇచ్చింది. మానవునిలో పిరికి ఆత్మను తీసివేసి ధైర్యంగా జీవించమని దీవించే దైవాత్మను అనుగ్రహించింది యేసు మరణం. యేసులో వున్న వారికి ఆయన మరణం ద్వారా నిత్యజీవమార్గం సుగమమైంది. అందుకే ఇది శుభ శుక్రవారం అయింది.ఏడు విలువైన మాటలు... ఆచరణీయ పాఠాలు యేసుక్రీస్తు సిలువ పైన మాట్లాడిన ఏడు మాటలు శుభ శుక్రవారం నాడు ప్రపంచంలోని క్రై స్తవ విశ్వాసులందరూ ధ్యానించడం పరిపాటి. అంతేకాదు ఏసు పలికిన ఈ పలుకులు ఈ లోకంలో మానవుడు లోకకల్యాణం కోసం ఎలా జీవించాలో గొప్ప పాఠాలను నేర్పుతాయి. మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శంగా ఆచరణీయంగా నిలుస్తాయి.శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యేసుప్రాణం విడువ గా అనేక అద్భుతాలు జరిగినట్లుగా లేఖనాలు పేర్కొన్నాయి. ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాసేపు అదృశ్యం అయ్యాడు. భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరువబడ్డాయి. యెరూషలేము దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగిందని లేఖనాలు చెబుతున్నాయి.పాప పంకిలమైన మానవుడ్ని రక్షించడానికి ఆ దేవాదిదేవుని గొప్ప సంకల్పమే సిలువ. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మానవులను తమ పాపాలనుంచి రక్షించి మరణానంతరం నిత్యజీవం ఇవ్వడానికి ఎన్నుకున్న ఏకైక మార్గమే సిలువ. సిలువలో నిర్దోషి, నిష్కళంకుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తం ద్వారా గొప్ప విమోచన కార్యం దేవుడు సిద్ధం చేశాడు. యేసు తనకు తానుగా సిలువకు సమర్పించుకున్నాడు.1: తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము (లూకా 23:34)2: నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)3: అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ‘ఇదిగో నీ తల్లి అని చెప్పెను. (యోహాను 19:26–27)4: నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం (మత్తయి 27:46)5: దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)6: సమాప్తమైనది (యోహాను 19:30)7: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను (లూకా 23:46)– బందెల స్టెర్జి రాజన్ -
క్రీస్తును ఎలా శిలువ వేశారు?
లండన్: నేడు పవిత్ర శుక్రవారం. అంటే ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజు. శిలువ వేయడం అంటే శిలువకు క్రీస్తును ఆనించి చేతులకు, కాళ్లకు మేకులు దిగేయడంగా మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏ క్రీస్తు శిలువ విగ్రహాన్ని చూసిన ఇదే అర్థం అవుతుంది. మరి నిజంగా క్రీస్తును శిలువ వేసినప్పుటు ఆయన చేతులకు, కాళ్లకు మేకులు దిగేశారా? అన్నది ఇప్పుడు చర్చ. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని, ప్రజల్లో తిరుగుబాటు లేవదీసిన వారిని శిలువ వేయడం నాటి రోమన్ సంస్కృతి. శిలువ వేయడం అంటే మరణ శిక్ష వేయడమని కూడా కాదు. కొన్ని రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా అలా శిలువపై మాడుస్తారు. హింసిస్తారు. కొందరు ఆ శిక్ష ను తట్టుకోలేక చనిపోతారు. బతికున్న వారిని వదిలేస్తారు. మరి ఏసు క్రీస్తును ఎలా శిలువ వేశారు? రోమన్లు శిలువ వేసినప్పుడు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేవారనడానికి ఎక్కడా శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. పురావస్తు తవ్వకాళ్లో శిలువ శిక్ష అనుభవించిన వారి శకలాలు దొరికాయి. వారి చేతులకు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు దొరకలేదు. ఒకే ఒక్క మానవ శకలం అలా దొరికింది. దానికి కూడా కాళ్లకు మాత్రమే మేకులు దిగేసినట్లు ఉంది. చేతులకు లేవు. బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న నాలుగవ శతాబ్దం నాటి క్రీస్తు శిలువ విగ్రహాల్లో క్రీస్తు చేతులు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు లేవు. భుజం మీద అడ్డంగా ఉన్న కర్రకు మణికట్టు వద్ద చేతులు కట్టేసినట్లు మాత్రమే అవి ఉన్నాయి. రత్నపు రాళ్లపై చెక్కిన ఆ విగ్రహాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. నాటి కాలం గాస్పెల్స్ (క్రీస్తు జీవితం, ప్రవచనాల ప్రచారకులు) కూడా ఏనాటు క్రీస్తును ఈ విధంగా శిలువ వేశారని చెప్పలేదు. కొత్త టెస్టామెంట్ ప్రకారం మాత్యూ, మార్క్, లూక్, జాన్ అనే గాస్పెల్స్ కొంచెం అటూ ఇటుగా క్రీస్తుకు మేకులు దిగేశారని చెప్పారు. నాటి రోమన్ కాలంలో మనుషులను శిలువ వేసినప్పుడు మేకులు కొట్టేవారు కాదని, చేతులను, కాళ్లను కట్టేసేవారని మనకు ‘మోంటీ పైథాన్స్ లైప్ ఆఫ్ బ్రెయిన్’ హాలివుడ్ పురాతన సినిమా కూడా తెలియజేస్తోంది.