breaking news
CRDA tenders
-
కోటరీ కోరినట్టే టెండర్లు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల టెండర్లకు ఓ విధానం అంటూ లేకుండా కోటరీ, బినామీ కాంట్రాక్టు సంస్థలు కోరినట్లుగా ప్రభుత్వ పెద్దలు కట్టబెడుతున్నారు. ఏ విధానంలో తమకు ఎక్కువ లాభదాయకమో అదే విధానాన్ని ఎంచుకుంటున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి సమీకరించిన భూముల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇప్పటికే రెండు విధానాల్లో టెండర్లను ఆహ్వానించిన పెద్దలు కోటరీ సంస్థలు ఎంపిక కాకపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. కోటరీ, బినామీ సంస్థలు కోరిన విధానంలో లంప్సమ్ పర్సెంటేజ్ విధానంలో టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఎస్కలేషన్ క్లాజు విధించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించిన టెండర్లలో ఎస్కలేషన్ క్లాజు విధించరు. ఈపీసీ విధానంలో కూడా ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అయితే లంప్సమ్ విధానంలో ల్యాండ్ పూలింగ్ స్కీములో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో సీఆర్డీఏ ఎస్కలేషన్ క్లాజును విధించడం పట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. అదనపు పని... అదనంగా బిల్లులు ల్యాండ్ పూలింగ్ స్కీములోని ఐదు జోన్లలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. లంప్సమ్ పర్సంటేజ్ విధానం అంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత మేర అదనంగా నిధులను చెల్లించడం. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అదనంగా పనులను చేపడితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోటరీ కాంట్రాక్టర్లకు భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించి కమీషన్లు కాజేసేందుకే ఎస్కలేషన్ క్లాజు తెరపైకి తెచ్చారనే విషయం స్పష్టం అవుతోందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు ల్యాండ్ పూలింగ్ స్కీముల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.5,784.20 కోట్ల విలువైన పనులకు లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈనెల 22వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అదే రోజు సాంకేతిక బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్ ఈ నెల 28వ తేదీన తెరుస్తారు. హైబ్రీడ్ యాన్యుటీ అంటే... హైబ్రీడ్ యాన్యుటీ విధానం కింద ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం సొమ్మును నిర్మాణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 60 శాతం వ్యయం ప్రైవేట్ డెవలపర్ భరించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం సొమ్ము చెల్లించేందుకు అంగీకరించింది. 51 శాతం డెవలపర్ భరిస్తాడని పేర్కొంది. ఇది హైబ్రీడ్ యాన్యుటీ విధానానికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రైవేట్ డెవలపర్ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు ఏటా రెండు వాయిదాల్లో చెల్లించాలి. అప్పటివరకు ఉన్న వడ్డీకి అదనంగా మూడు శాతం కలిపి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంది. అయితే తదుపరి ప్రభుత్వం ఈ టెండర్లను రద్దుచేస్తే తమ పరిస్థితి ఏమిటని కోటరీ సంస్థలు ప్రశ్నించడంతో సీఆర్డీఏ ఆ టెండర్లను రద్దు చేసింది. కోటరీ కోరికపై ఈపీసీ రద్దు! ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించినా కోటరీ సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందులో ఎస్కలేషన్ క్లాజు ఉండదు. అంతేకాకుండా టెండర్లలో పేర్కొన్న అంతర్గత అంచనా వ్యయంపై ఐదు శాతం కన్నా ఎక్కువగా కోట్ చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోటరీ సంస్థలు మనసు మార్చుకుని ఈపీసీ విధానంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరాయి. దీంతో సీఆర్డీఏ వీటిని రద్దు చేసి కోటరీ కోరిక మేరకు మూడోసారి లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో ఎస్కలేషన్ క్లాజుతో టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్ల పాటు నిర్వహణ... - జోన్–4 కింద పిచ్చుకలంక, తుళ్లూరు, అనంతవరంలోని 843.66 ఎకరాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ స్కీములో రహదారులు, వంతెనలు, డ్రైన్స్ తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.563.16 కోట్లతో లంప్సమ్ పర్సంటేజ్ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్లలో మౌలిక వసతులను కల్పించి ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. - జోన్–12 కింద కురగల్లు, నవులూరు, నిడమానూరులో 2,748.68 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,600.15 కోట్లతో టెండర్లను పిలిచారు. - జోన్–12 ఏ కింద కురగల్లు, నిడమానూరులో 2,155.79 ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,154.35 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. - జోన్ 9, 9 ఏ కింద ఐనవోలు, నేలపాడు, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం పరిధిలోని 1,811.39 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.2,466.54 కోట్లతో టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది. కొత్త సర్కారు వస్తే? రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీము జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలుత హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో అక్రమాలను ‘సాక్షి’ బట్టబయలు చేయడం, పలువురు విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయడంతో కోటరీ సంస్థలు ఈ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగు వేశాయి. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో లొసుగులు, లోపాలను తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం తప్పుబట్టి దర్యాప్తునకు ఆదేశిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాయి. దీనికి సీఆర్డీఏ, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పలేకపోయారు. -
ఏపీ సచివాలయం అదనపు పనుల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్
- రూ.350 కోట్ల విలువైన వసతుల టెండర్లూ ఆ రెండు కంపెనీలకే - మళ్లీ ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీకే ఖరారు సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన రూ.350 కోట్ల విలువైన అదనపు పనులను ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు కుమ్మక్కై సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు సీఆర్డీఏ టెండర్లు ఖరారు ప్రక్రియను గోప్యంగా ఉంచి.. ఆ రెండు సంస్థలకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడంతో వాటి పని సులభమైంది. మొత్తం ఐదు ప్యాకేజీల్లో మూడింటిని ఎల్ అండ్ టీ సొంతం చేసుకోగా, రెండింటిని షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. వెలగపూడిలో ఆరు భవనాలకు గాను రెండింటిని షాపూర్జీ పల్లోంజీ, నాలుగింటిని ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అవే భవనాల్లో అంతర్గత పనులను మూడు ప్యాకేజీలుగా, సముదాయంలో అంతర్గత రోడ్లు, అనుసంధాన రహదారి, మురుగునీటి శుద్ధి కేంద్రం, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి 20 రోజుల క్రితం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ ఐదు ప్యా కేజీలకు దాఖలైన టెండర్లను శుక్రవారం తెరిచారు. అయితే వీటన్నింటికీ షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వాటి ప్రైస్ బిడ్లను శనివారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో తెరిచి తక్కువ కోట్ చేసిన కంపెనీకి టెండర్లు ఖరారు చేశారు. ఇప్పటికే వెలగపూడిలో ఏ కంపెనీ ఏ బ్లాకును నిర్మిస్తుందో అదే కంపెనీ అదే బ్లాకుకు సంబంధించిన అంతర్గత పనులను దక్కించుకోవడం గమనార్హం. దీన్నిబట్టి రెండు కంపెనీలు ముందే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని తమకు కావాల్సిన మొత్తాలకు టెండర్లు కోట్ చేశాయనేది విదితమవుతోంది. షాపూర్జీ పల్లోంజీ ప్రస్తుతం తాను నిర్మిస్తున్న రెండు భవనాలకు.. నిబంధనల మేరకు టెండర్లు దాఖలు చేయగా, అవే భవనాలకు ఎల్ అండ్ టీ ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసింది. దీంతో ఆ రెండు టెండర్లు షాపూర్జీకి దక్కాయి. ఇలాగే ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగు భవనాలకు ఆ కంపెనీ కచ్చితంగా వచ్చేలా టెండర్లు వేయగా.. షాపూర్జీ కంపెనీ ఎక్సెస్‌కు టెండర్లు వేసింది. దీంతో ఎల్ అండ్ టీ టెండర్లు ఖరారయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం ఐదు ప్యాకేజీలకు ఐదు శాతం ఎక్సెస్‌కు టెండర్లు వేయగా వాటిని ఆమోదించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీఆర్డీఏ మీడియా సహా ఎవరికీ తెలియకుండా నిర్వహించింది. గతంలోనూ 12 శాతం ఎక్సెస్‌కు ఆమోదం.. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఇప్పటికే నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాల టెండర్లను మూడు నెలలక్రితం రూ.202 కోట్లకు దక్కించుకున్నాయి. అప్పట్లోనూ 12 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసినా కేబినెట్ ఆమోదంతో వాటిని ఖరారు చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచి రూ.240 కోట్లకు ఆరు భవనాల నిర్మాణ పనులను రెండు కంపెనీలకు అప్పగించారు. తాజాగా అదనపు పనులు, అంతర్గత పనులన్నీ కలిపి రూ.350 కోట్ల విలువైన టెండర్లను మళ్లీ వాటికే అప్పగించారు. దీంతో రూ.590 కోట్ల పనులను ఆ రెండు సంస్థలకు అప్పగించినట్లయింది. ఈ నెల 27వ తేదీకల్లా హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు రావాలని అల్టిమేటం ఇచ్చిన ప్రభుత్వం మౌలిక వసతుల పనులను మాత్రం శనివారం ఖరారు చేయడం గమనించాల్సిన అంశం. నిబంధనల ప్రకారం ఈ పనులను మూడు నెలల్లోపు పూర్తి చేసే అవకాశాన్ని ఆ కంపెనీలకిచ్చారు. కానీ అనధికారికంగా పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.