'మహా'మోసం
ఆదిలాబాద్: మహారాష్ట్ర.. ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతోంది. దళారులు మహారాష్ట్రలోని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, జిల్లా రైతుల పేర సీసీఐకి అంటగడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న నాందెడ్, ధర్మాబాద్, భోకర్, కిన్వట్ మహారాష్ట్ర తాలూకాల గ్రామాల నుంచి జిల్లాలోని భైంసా కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. ఆదిలాబాద్ కొనుగోలు కేంద్రానికి పాండ్రకోడ, యావత్మాల్, పాఠన్‌బోరి తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ కేంద్రాలకు కూడా సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల నుంచి వ్యాపారులు పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని ప్రభావం కరువు జిల్లా ప్రకటనపై పడుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పత్తి అంతా జిల్లాలోనే పండినట్లు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ రికార్డులకు ఎక్కుతుంది.
భారీ స్థాయిలో పత్తి దిగుబడి వచ్చి రికార్డుల్లో నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో జిల్లాలో కరువు లేదని, కరువు జిల్లాగా ప్రకటించే అవకాశం లేకుండాపోతోంది. ఈ నివేదికలు అడ్డుపడుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. దళారులు మహారాష్ట్రలో క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,600 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ పత్తిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.4,050 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో క్వింటాల్‌పై రూ.400 వరకు లబ్ధిపొందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందకుండా పోనుంది.
అంచనాలు దాటి..
ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు 8.67 లక్షల ఎకరా(3.47 లక్షల హెక్టార్లు)ల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, చీడపీడల ధాటికి పంట దిగుబడి ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లకు మించలేదని వ్యవసాయ శాఖ అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో పండిన పంట అంతా విక్రయిస్తే 43.35 లక్షల క్వింటాళ్లు ఉండాలి. కానీ.. ఇప్పటికే ఒక్క సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 42 క్వింటాళ్లు ఉంది. ఇవి కాకుండా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి మరో రెండు లక్షల క్వింటాళ్ల వరకు ఉంటుంది. రికార్డులకెక్కని జీరో కొనుగోళ్లు మరో లక్ష క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో పండిన పత్తి అంతా ఇప్పటికే అమ్మకం అయిపోవాల్సి ఉంది. కానీ.. ఇంకా కొనుగోలు కేంద్రాలకు పత్తి వస్తూనే ఉంది. మరో ఐదు నుంచి ఆరు లక్షల క్వింటాళ్ల వరకు రైతుల వద్ద పత్తి ఉన్నట్లు అనధికారిక అంచనా. దీన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఏ స్థాయిలో పత్తి విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న దళారులు..
మహారాష్ట్ర పత్తిని జిల్లాకు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. భైంసా, ఆదిలాబాద్ కేంద్రాలకు 25క్వింటాళ్లకు మించి పత్తి తెచ్చిన వాహనాలను అధికారులు అనుమతించలేదు. అలాగే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్లతో కూడిన వాహనాల నుంచి తెచ్చిన పత్తిని కొనుగోలు చేయవద్దని నిర్ణయించారు. దీంతో దళారులు తమ రూటు మా ర్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో పత్తిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర వాహనాల్లో పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తరిలించిన దళారులు ఇప్పుడు రూటు మార్చారు. అధికారులకు అనుమానం రాకుండా జిల్లాకు చెందిన వాహనాలనే ఇక్కడి నుంచి తీసుకువెళ్లి పత్తిని సేకరిస్తున్నారు.