breaking news
Corporate educational institution
-
‘అయినా... ఇంకా కాలుస్తూనే ఉన్నారు’
ఈ కాలమ్ మీదే చర్చా వేదిక చిత్తూరు నుండి డి. ప్రభావతి రాసిన లేఖ ‘అయినా... ఇంకా కాలుస్తూనే ఉన్నారు’ మనకెందుకులే అనుకోవడం వల్లే! సభ్యసమాజం తలదించుకునే సంఘటనలు రోజూ జరగడానికి ‘మనకెందుకులే’ అనే నిర్లిప్తత ధోరణే కారణం. నిరసన తెలియజేయకపోవడం వల్లే బహిరంగ ధూమపాన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘బహిరంగ ధూమపానం చేయడం బుద్ధి లేనివాళ్లు చెసే పని’ అని ఆరోజు ప్రభావతిగారితోపాటు చుట్టూ ఉన్న నలుగురు కూడా అని ఉంటే బహిరంగ ధూమపానాలు పునరావృతం కావు. మాటల వల్ల మారుతారా? అనేది తరువాత విషయం, ముందైతే తప్పనిసరిగా మన నిరసన తెలియజేయాలి. - టి.శ్రావణ్‌కుమార్, గోదావరిఖని, సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చట్టాలు మార్చలేవు... గుట్కా, బహిరంగ దూమపానం చేసేవాళ్లు మానసికంగా మారాలే తప్ప చట్టాలు మార్చలేవు. తాగుడు అలవాటు మంచిది కాదనే విషయం అందరికీ తెలుసు. అయినా తాగుతూనే ఉన్నారు. తెల్లవారేసరికి మందు దొరికే ఏర్పాటును ప్రభుత్వమే చేస్తుంది.బస్సులో ఫుట్‌పాత్ మీద వేలాడుతున్నవారిని కండక్టర్ లోనికి రమ్మంటే, కండక్టర్ మీద ఆ ప్రయాణికులు తిరగబడితే ఏ ఒక్క ప్రయాణికుడు కండక్టర్ తరపున మాట్లాడలేదంటే ఏమనుకోవాలి. నేటి తరం చెడు మార్గాన ప్రయాణిస్తున్నారే తప్ప మంచి మార్గాన నడవాలని చెప్పినా వినే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ఎవరికివారు నాకెందుకులే అని తప్పుకుంటారు.సిగరెట్టు, లిక్కర్, పాన్పరాగ్లాంటి హానికరమైన కంపెనీల ప్రకటనలు నిషేధించాలి. పొగాకు పంటను కొంచెం కొంచెం తగ్గించి గంజాయి పంటలా కొంత కాలానికి పూర్తిగా నిషేధించాలి. - సూర్యప్రకాశరావు తిరునగరి, మధురవాడ, విశాఖపట్నం. కొమ్ము రఘువీర్ యాదవ్, వరంగల్ ‘ఇక మన సినిమాల్లో కొత్తదనం కనిపించదా?’ (లేఖకు స్పందన) కొత్తదనం లేకపోవడం ఏమిటి? తెలుగు సినిమాల్లో కొత్తదనం లేకపోవడం ఏమిటి? ఈమధ్య కాలంలో వచ్చిన ‘ఈగ’ ‘మిథునం’ అందాల రాక్షసి’ ‘మిణుగురులు’ నా బంగారు తల్లి’ ‘మనం’లాంటివి ఒక విధంగా ప్రయోగాత్మక చిత్రాలే. కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని సాధించలేదు. అందుకు కారణం...ప్రేక్షకుల అభిరుచి నటులనుబట్టి మారిపోతుండడమే.డీగ్లామరస్ రోల్స్ వేయడంలో మన హీరోలు వెనుకంజ వేయడం వాస్తవమే. అలాగని సహజత్వం అనే సాకుతో తమిళచిత్ర పరిశ్రమలో వచ్చే కొన్ని ఆఫ్-బీట్ సినిమాలు, యాంటి-క్లైమాక్స్ కథలు మాత్రమే ప్రయోగాలు అనుకోవడం పొరపాటు. ‘గీతాంజలి’ ‘ఆదిత్య369’ ‘భైరవద్వీపం’లాంటివి మన తెలుగులో తీసిన కథలే. పరభాష నుంచి అరువు తెచ్చుకున్నవేమీ కావు.టాప్-ప్రొడ్యూసర్లు లోబడ్జెట్ సినిమాలతో రిస్క్ లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయవచ్చు. స్టార్ హీరోలు కూడా మూస పాత్రలు వదిలి వైవిధ్యమైన కథలపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే రోటీన్ సినిమాల నుండి తెలుగు చిత్రపరిశ్రమ బయటపడుతుంది. - కీర్తి ముకుంద్, హైదారాబాద్ నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక ‘తెలుగులో మాట్లాడడం తప్పా?’ (లేఖకు స్పందన) ఇలా చేస్తే సరి... కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అమ్మ భాషను పరిపుష్టం చేసుకోవాలంటే ఉత్తమస్థాయిలో కృషి జరగాలి. పాఠశాల, కళాశాలల్లో తెలుగు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ఇంటర్, డిగ్రీలతో పాటు, వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి తెలుగును విధిగా ఓ పాఠ్యాంశం చేయాలి. విజ్ఞాన శాస్త్రాలను సైతం మాతృభాషలోనే బోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. రష్యా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్... తదితర దేశాల్లో మాతృభాషలోనే విజ్ఞానశాస్త్రాలను బోధిస్తున్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు తెలుగు విభాగాల్లో పదవ్యుత్పత్తి కోశాలను తయారుచేయించాలి. విద్యాలయాల్లో పెద్దబాలశిక్షతో పాటు శబ్దరత్నాకరం, వజ్రకోశం వంటి నిఘంటువులను, పూర్వగాథాలహరిని విద్యార్థులు చదివేలా కృషి చేయాలి. మండల స్థాయిలో అధికార భాషా సంఘాలను ఏర్పాటు చేయాలి. - వి.కొండలరావు, నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యుడు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా. చిన్నచూపు తగదు... తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీ పడి మరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేర్పించి చదివిస్తున్నారు. కానీ మానసిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మాత్రం... మాతృభాషలో చదివిన విద్యార్థులు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతారని, విషయావగాహన ఎక్కువగా ఉంటుందని తరచుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాతృభాషలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలి. చాలామంది విద్యార్థులు తమకు ఇష్టం ఉన్నా లేక పోయినా తల్లిదండ్రుల ఒత్తిడితో ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్నారు. దీంతో చదువులో రాణించలేకపోతున్నారు. దీనివల్ల అటు మాతృభాషలో ఉన్నత చదువులు చదవక, ఇంట ఆంగ్లమాధ్యమంలో గెలవలేక రెండిటికి చెడిన రేవడిలా తయారవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, ఆదేశాలు తెలుగులో విడుదల చేసే విధంగా భాషా సంఘం చొరవ చూపాలి. తద్వారా సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది. - తోట యోగేందర్, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
సమస్యల్లోనే ‘ఆదర్శ’మా?
నిజాంసాగర్ : కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాల భవన సదుపాయాన్ని నిర్మించినా.. కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యలో మార్పు లేకపోవడం తో విద్యాబోధనపైనా ప్రభావం పడుతోం ది. ప్రయోగశాల ఉన్నా.. శిక్షకులు లేరు. దీంతో రూ. 3.2 కోట్లు వెచ్చించి నిర్మించిన మోడల్ స్కూల్ భవనం.. సమస్యల్లోనే ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం కోసం రెండేళ్ల క్రితం ప్రభుత్వం మాడల్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. మండలానికొకటి చొప్పున ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున కేటాయించింది. మొదటి విడతలో గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్య అందించనున్నారు. గతేడాది ఆరు, ఎనిమిది, ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతిలో 80 సీట్లున్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు పెరిగాయి. 6, 7, 8, 9, ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తరగతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. అన్ని తరగతుల్లో పూర్తిస్థాయి విద్యాబోధనకుగాను ఒక్కో మోడల్ స్కూల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా స్కూళ్లలో ఎడెనిమిది మందే ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ప్రయోగశాల ఉన్నా.. ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ల్యాబ్ సౌకర్యం కల్పించింది. అయితే శిక్షకులు లేకపోవడంతో ఇది నిరుపయోగంగానే ఉంటోంది. అసౌకర్యాలే.. నిజాంసాగర్ సమీపంలో నిర్మించిన మోడల్ పాఠశాలలో టాయ్‌లెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం సైతం లేదు. దీంతో ఇంటినుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మాడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.