ఆటోడ్రైవర్ హత్య
కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపిన దుండగులు
హతుడి స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యాకుత్‌పురా: దుండగులు ఓ ఆటోడ్రైవర్‌ను కత్తులతో పొడిచి, బండరాయితో మోది హతమార్చారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి ఈ హత్య జరినప్పటికీ... బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులకు సమాచారం అందలేదు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం ప్రకారం... భవానీనగర్ చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన కరీం చావూష్ (32) ఆటోడ్రైవర్.
ఇతనిపై భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం, దాడి కేసులున్నాయి. 2010లో రౌడీషీటర్ సాబేర్ అలియాస్ సర్క్యూట్‌తో చావూష్కు గొడవలు జరిగాయి. ఇదిలా ఉండగా, చావూష్ మంగళవారం రాత్రి 7 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం భవానీనగర్ బాకర్ గ్యారేజీ రైల్వే ట్రాక్ వద్ద శవమై పడి ఉన్నాడు. రైలు ఢీకొనడంతో చనిపోయి ఉంటాడని స్థానికులు మొదట భావించారు.
మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చావూష్ హత్యకు గురైనట్టు నిర్థారించారు. దుండగులు కత్తులతో పొడిచి, బండరాయితో మోది చాపారని, మంగళవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగి ఉంటుందని తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దక్షిణ మండలం డీసీపీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాగా, ఆటో యజమాని ఫయీంతో చావూష్కు ఫైనాన్స్ వివాదం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. తనకు డబ్బు చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫయీం గతంలో హెచ్చరించాడని, అతనే చావూష్ స్నేహితులు రౌడీషీటర్ సాబేర్, తాహేర్, సలీంతో పథకం వేసి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు హతుడి స్నేహితులు సాబేర్, తాహేర్, సలీం తదితరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.