breaking news
Commercial project
-
ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓ పక్క గృహ నిర్మాణాలలో ప్రీలాంచ్ విక్రయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న బిల్డర్లు.. పెట్టుబడిదారులనూ వదలడం లేదు. స్థలం కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు రాకముందే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్ డిజైన్లు, అందమైన బ్రోచర్లతో ఆకర్షిస్తున్నారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువే లాభం, వంద శాతం సొమ్ము ముందే చెల్లిస్తే సగం ధరకే వాణిజ్య స్థలం, ప్రాజెక్ట్ పూర్తయ్యాక రెట్టింపు అద్దె అంటూ అన్ని రకాల మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చివరకు నట్టేట ముంచేస్తున్నారు. బాధితులు వేల సంఖ్యలో.. సాహితీ, ఫీనిక్స్, సీఎన్ఎన్ వెంచర్స్, సెన్సేషన్, గరోండా బిల్డర్స్, సంధ్యా కన్వెన్షన్ వంటి నిర్మాణ సంస్థలెన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామని జనాలను నమ్మించి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి హైస్ట్రీట్ ఏరియాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. బిల్డర్ల చేతిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్ పోలీసులు, ప్రవాసులూ చిక్కి విలవిల్లాడుతున్నారు. కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలని డెవలపర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ బిల్డర్లు బౌన్సర్లను నియమించుకుని కొనుగోలుదారులను కనీసం ఆఫీసు లోపలికి కూడా రానివ్వటం లేదని సత్యా టెక్నో పార్క్ బాధితుడు వాపోయారు. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా అద్దె! సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ నానక్‌రాంగూడలో జీ+47 అంతస్తులలో హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. రూ.60 లక్షలకు 397 చ.అ., రూ.82 లక్షలకు 546 చ.అ. స్పేస్‌ను ప్రీలాంచ్లో భాగంగా విక్రయిస్తోంది. రూ.60 లక్షల పెట్టుబడిదారులకు రూ.14,500, రూ.82 లక్షల వాళ్లకు రూ.62 వేలు అద్దె ప్రతి నెలా కంపెనీయే చెల్లిస్తుందని మాయమాటలు చెబుతోంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 10 ఏళ్ల పాటు ఈ అద్దె అగ్రిమెంట్ ఉంటుందని నమ్మబలుకుతోంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవచ్చని లేదా కస్టమర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వల వేస్తోంది. ఇంతా చేస్తే ప్రాజెక్ట్‌ను నిర్మించే స్థలం సెన్సేషన్ కంపెనీ పేరు మీదే లేకపోవటం గమనార్హం. అంతా గోల్మాల్.. బోయిన్‌పల్లిలో 4 ఎకరాలలో ధనా మాల్ నిర్మిస్తామని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రచారం చేసింది. 120 చ.అ. స్థలం రూ.10 లక్షల చొప్పున వందలాది మందికి విక్రయించింది. కానీ సంస్థకు నేటికీ నిర్మాణ అనుమతులు రాలేదు. ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారులు రోజూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సంస్థ మాత్రం కిక్కురుమనడం లేదు. తాజాగా ఇదే సంస్థ బెంగళూరులోని చిక్కజల ప్రాంతంలో 7 ఎకరాలలో ధనా మాల్ పేరిట ప్రీలాంచ్ కింద కమర్షియల్ రిటైల్ షాపింగ్ స్పేస్‌ను విక్రయిస్తుండటం గమనార్హం. కమర్షియల్స్‌ను ప్రీలాంచ్లో విక్రయించకూడదు కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేయకుండా విక్రయాలు చేయకూదు. నిబంధనలు అతిక్రమించిన డెవలపర్లకు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – కె.విద్యాధర్, టీఎస్ రెరా సెక్రటరీ -
సామాన్యుడిని పట్టించుకోరా?
అధికారులపై హైకోర్టు ఆగ్రహం పునరాభివృద్ధి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకతవిచారణ వాయిదా న్యూఢిల్లీ: సామాన్యుడి ఇబ్బందులు, ఆరోగ్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోకుండా వాణిజ్య ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్టు అనుమతులు ఇవ్వడం సరికాదని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. ‘మనమంతా ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాం. బడాబాబులు మాత్రం భారీ భవనాలు కట్టుకుంటున్నారు. సామాన్యుడి బాధల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు ప్రాజెక్టుల అనుమతులే ముఖ్యం. ప్రజలు ఏమైనా ఫర్వాలేదు’ అని న్యాయమూర్తి మన్మో హన్ వ్యాఖ్యానించారు. కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ 2 వంటి ప్రాంతాల పునరాభివృద్ధి ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెం బర్ 29కి వాయిదా వేశారు. ఈ ప్రాజెక్టులు అమలైతే ఈ రెండు ప్రాంతాల్లో పేదరికం పెరుగుతుందని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి వివరిస్తూ సంబంధిత అధికారులు విడుదల చేసిన బ్రోచర్లు చూస్తుంటే ఈ ప్రాంతం ఒక పట్టణ మురికివాడలా మారగలదని అనిపిస్తోందని న్యాయమూర్తి మన్మోహన్ పేర్కొన్నారు. నగరాల్లో మురికివాడలను పెంచే ఇలాంటి ప్రాజెక్టులను అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు. కిద్వాయ్‌నగర్ ప్రాజెక్టు ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ప్రస్తుతమున్న రోడ్లు, నీరు, విద్యుత్ ఈ ప్రాజెక్టుకు సరిపోతాయో లేదో ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఆదేశాలు జారీ చేయకపోయినా, ఎల్జీ వివరణ అందిన తరువాత స్పందిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రణాళికలను మంజూరు చేసింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) కాబట్టి ఈ కేసులో దానిని కూడా వాదిగా చేర్చాలని హైకోర్టు సూచించింది. సౌత్ ఎక్స్టెన్షన్, దాని పరిసర ప్రాంతాల సహజత్వం దెబ్బతినే చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి పైవ్యాఖ్యలు చేశారు. కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ 2 పునరాభివృద్ధి ప్రాజెక్టు అమలు ప్రమాణాల ప్రకారం జరగడం లేదని, అందుకే దానిని రద్దు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల పెరిగే వాహన సంచారానికి సరిపడా రహదారులు లేవనే విషయాన్ని పోలీసుశాఖ ఇది వరకే తెలిపిందని న్యాయవాది అమన్ లేఖీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వ్యాపారీకరణకు భారీగా స్థలం కేటాయించడం వల్ల గృహవసతి సదుపాయాలు తగ్గి మురికివాడలు ఏర్పడతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.