breaking news
comissionar
-
‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన! కమిషనర్ శ్రీహరిరాజు
నాగర్‌కర్నూల్: పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతామని అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు కమిషనర్‌కు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పగా.. ఆయన పరిష్కార మార్గాలు వివరించారు. అన్ని వార్డులను పర్యవేక్షిస్తున్నామని, మున్సిపల్ పాలకవర్గంతో చర్చించి అవసరం ఉన్నచోట అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ఇప్పటికే పలు వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కుక్కలు, పందులను పట్టణ శివారు బయట ఉంచేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆహార, ఇతర వ్యర్థ పదార్థాలను బయట పడేయకుండా ఇళ్ల వద్దకు వచ్చే చెత్తబండికి అందించాలన్నారు. కుక్కలు ఏయే కాలనీల్లో అధికంగా ఉన్నాయో పరిశీలించి వాటి పరిస్థితులను గమనించడానికి శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో 4 టీంలను ఏర్పాటు చేశామన్నారు. పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌హౌస్, చికెన్, మటన్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆహార వ్యర్థాలను రోడ్లకు ఇరువైపులా వేయకుండా సూచిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రశ్నలకు బదులుగా.. ► ప్రశ్న: మా కాలనీలో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతుంది. దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉంది. వీధిలైట్లు వెలగడం లేదు. – నిరంజన్, వెంకటస్వామి– ఏడో వార్డు, మహేష్, వాణి– జూబ్లీనగర్, కుమార్– ఆదర్శనగర్, మోతీలాల్– మధురానగర్, రతన్‌కుమార్– సాయినగర్. కమిషనర్: వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేస్తాం. సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయిస్తాం. కొత్త కాల్వల నిర్మాణానికి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తా. ► ప్రశ్న: టీచర్స్‌కాలనీలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలి. – శ్రీశైలం, ఉపాధ్యాయుడు కమిషనర్: సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. ► ప్రశ్న: మధురానగర్ మూడో రోడ్డులో కంపచెట్లను తొలగించాలి. – లాలయ్య, మధురానగర్ కాలనీ కమిషనర్: రెండు రోజుల్లో కంప చెట్లను తొలగిస్తాం. ► ప్రశ్న: ఆర్టీసీ బస్ డిపో వెనక వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. – అష్రఫ్, పట్టణవాసి కమిషనర్: రెండు రోజుల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తాం. ► ప్రశ్న: పట్టణంలోని నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారి మంజు టెంట్ హౌజ్ వెనక భాగంలో వర్షపు నీరు నిలిచి దుర్గంధం వస్తుంది. – తాహేర్‌పాష, టీచర్ కమిషనర్: పరిశీలించి పరిష్కరిస్తాం. ► ప్రశ్న: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. – మండికారి బాలాజీ, మణికంఠ, అచ్చంపేట కమిషనర్: నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: వెంకటేశ్వరనగర్కాలనీలో మురుగు కాల్వలు నిర్మించాలి. – శ్రీధర్ టీచర్, రాణాప్రతాప్, మాజీ ఆర్మీజవాన్, వెంకటేశ్వరనగర్ కాలనీ కమిషనర్: మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. ► ప్రశ్న: పట్టణంలోని 18వ వార్డు, విద్యానగర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదు. మూడో వార్డులో బోరు మోటారు రిపేర్ చేయాలి. – మాధవి– 18వ వార్డు, శివకుమార్– 3వ వార్డు, పద్మ– విద్యానగర్‌కాలనీ, కృష్ణ– జూబ్లీనగర్, సాయిరాం– 18వ వార్డు. కమిషనర్: వాటర్మెన్లతో కలిసి వార్డును పరిశీలిస్తాం. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరిస్తాం. 3వ వార్డులో బోరు మోటారు రిపేర్ చేయిస్తాం. ► ప్రశ్న: పందుల పెంపకందారులకు స్థలాన్ని కేటాయించి పట్టణానికి దూరంగా ఉంచేలా చూడాలి. – ఖలీల్, విష్ణు, జ్యోతి, మారుతీనగర్. కమిషనర్: ఇప్పటికే పందుల పెంపకందారులకు నాలుగు సార్లు నోటీసులు అందించాం. పట్టణ శివారుకు దూరంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: పట్టణంలో కుక్కలు, పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. – ప్రియాంక, 9వ వార్డు, రాంమోహన్‌రావు, అడ్వకేట్ కమిషనర్: కుక్కలను పరిశీలించడానికి పట్టణంలో 4 టీంలు ఏర్పాటు చేశాం. పందుల పెంపకం దారులకు నోటీసులు అందించాం. కోతులను పట్టుకునే వారిని త్వరలోనే పిలిపిస్తాం. ► ప్రశ్న: సాయినగర్‌కాలనీ మల్లంకుంట ప్రదేశంలో, హాస్టళ్ల సమీపంలో చికెన్ వ్యర్థాలు పడవేస్తున్నారు. దుర్గంధం వెదజల్లుతోంది. – అరవింద్, సాయినగర్ కమిషనర్: చికెన్ సెంటర్ నిర్వాహకులను పిలిపించి హెచ్చరికలు చేస్తాం. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసుకునేలా చూస్తాం. నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించి చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: పాతబజార్‌లో మోడల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. – గౌరీశంకర్, కౌన్సిలర్ కమిషనర్: పాతబజార్‌లో త్వరలోనే టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం. కౌన్సిల్ తీర్మానం కూడా ఆమోదం పొందింది. -
ఎన్నికల బరిలో వైఎస్సార్ టీయూసీ
జీవీఎంసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర సంఘంగా బరిలోకి దిగిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌పై ఏఐటీయూసీ అనుబంధ సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించి గుర్తింపు యూనియన్‌గా అవతరించింది. దీని కాలపరిమితి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలంటూ వివిధ సంఘాలు కోరుతున్నాయి. తొలిసారిగా బరిలో వైఎస్సార్ టీయూసీ ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బరిలోకి దిగుతోంది. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థగా పోటీలో నిలుస్తోంది. వైఎస్సార్టీయూసీతో పాటు జీవీఎంసీ పరిధిలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ఉన్నాయి. ఏఐటీయూసీతో విబేధాలు రావడంతో ప్రస్తుత గుర్తింపు యూనియన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఓటు హక్కు కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పర్మినెంట్, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జీవీఎంసీకి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. జీవీఎంసీలోని శానిటరీ వర్కర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ వరకూ వివిధ కేడర్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 3,238 మంది ఓటర్లుండగా ఈసారి ఎన్నికలు నెలాఖరులోగా జరిగితే 3,400 మంది ఓటర్లుంటారు. ఒక నెల ఆలస్యమైతే ఓటర్ల సంఖ్య తగ్గనుంది. జూన్ నెలలో 120 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఏ కార్పొరేషన్లో లేని విధంగా.. రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోనూ గుర్తింపు యూనియన్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. కేవలం జీవీఎంసీలో మాత్రమే ఈ తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 2002లో తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 2004లో టీఎన్టీయూసీ, 2007లో ఏఐటీయూసీ, 2010లో స్వతంత్ర యూనియన్ వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2012లో ఏఐటీయూసీ, 2014లో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2017లో ఏఐటీయూసీ గెలుపొందాయి. ఈ ఏడాది వైఎస్సార్టీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమా యూనియన్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది బూత్‌లు ఏర్పాటు మొత్తంగా ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ జరగనున్న ఈ ఎన్నికల కోసం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరు బూత్‌లు, గాజువాక, మధురవాడ, అనకాపల్లిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కమిషనర్ సైతం కార్మిక శాఖతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతాయని ప్రకటించడంతో ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు తొలిసారిగా కార్పొరేషన్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోటీ చేస్తోంది. అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా అవతరించి కార్పొరేషన్ పై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరగా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ బలోపేతానికి ఇప్పటికే పావులు కదుపుతున్నాం. – వీవీ వామనరావు, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఆర్టీఐ అమలుతీరుపై కమిషనర్ అసంతృప్తి
అనంతపురం: ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆర్టీఐ కమిషనర్ తాంతియా కుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఆర్టీఐ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీఆర్వో సహా 8 మంది ఎంఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు అధికారులు నోటీసులకు స్పందించకుంటే సస్పెన్షన్లకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కమిషనర్ తాంతియా కుమారి సూచించారు.