breaking news
collectarate protest
-
కార్పొరేషన్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
మంకమ్మతోట : కరీంనగర్ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రజాభీష్టానికి విరుద్ధంగా నగర కార్పొరేషన్లో 11 గ్రామాలను విలీనం చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం బలవంతంగా విలీనం చేస్తే ప్రజల మద్దతుతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విలీనం చేస్తున్న ఈ గ్రామాల్లో వేలాదిమంది ప్రజలు, రైతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజల నిర్ణయం తీసుకోకుండా బలవంతంగా విలీనం చేస్తే.. వారు వ్యవసాయం కోల్పోయి జీవనోపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పన్నుల భారం పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, దాదాపు 5కిలోమీటర్ల దూరం వచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో కట్టరాంపూర్, కోతిరాంపూర్, రాంనగర్ గ్రామాలు విలీనం జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్ర నాయకుడు అక్కెనపెల్లి కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరాల శ్రీనివాస్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధులు ఎండీ షాహెన్షా, కోట రాజ్‌కుమార్, యూత్ పట్టణ అధ్యక్షుడు సాధిక బలాల, యువత జిల్లా కార్యదర్శి ఎండీ ఫెరోజ్, పార్టీ ఆఫీస్ ఇన్చార్జి ఎండీ రహీమోద్దీన్, మాజీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్‌యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఆకోజు విఠలాచారి, జిల్లా కార్యదర్శి జంగిలి రవిచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకె ఆనంద్, కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు ఇప్పనపెల్లి శేఖర్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు కడార్ల నాగార్జునాచారి, క్రిస్టియన్ మైనార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు జి.నికోలస్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు యూనస్, సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ వలీయోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నాయకులు అస్లమ్, తిరుపతి, జయశ్రీ పాల్గొన్నారు. -
అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
హైదరాబాద్: వేతన పెంపుపై ప్రభుత్వ హామీలు నమ్మేదీ లేదని, జీఓ జారీ చేసేంత వరకు ఉద్యమం ఆపేదిలేదంటూ అంగన్ వాడీలు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన జీతాలను సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని అంగన్ వాడీలు ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. ఈ సందర్భంగా పలు జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు , అంగన్ వాడీలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు తలెత్తాయి. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతపురం: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసి దాని ప్రకారం జీతాలు అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేసిన కార్యక్రమంలో పోలీసులకు అంగన్ వాడీలకు మధ్య తోపులాట జరిగింది. శుక్రవారం ఉదయం నుంచే అనంత కలెక్టరేట్ ఎదుటకు చేరిన వేలాది కార్యకర్తలు గేట్లు తోసుకొని కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో భారీగా మొహరించిన పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. కాకినాడ : అంగన్వాడీలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ, హెల్ఫర్స్ యూనియర్స్ శుక్రవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.