breaking news
coalgate scam
-
నిందితులను కలవడం ముమ్మాటికీ తప్పే: సుప్రీం
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ స్కాంలో నిందితులను పలుమార్లు రంజిత్ సిన్హా కలవడం ఏమాత్రం సరికాదని, దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని, దీనిపై విచారించాలని జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సీబీఐ మాజీ చీఫ్‌పై విచారణ ఎలా జరగాలో నిర్ణయించడంలో సహకరించాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను సుప్రీంకోర్టు కోరింది. జూలై ఆరోతేదీ లోగా ఈ విషయమై తన సమాధానం చెప్పాలని తెలిపింది. రంజిత్ సిన్హాపై సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. సిన్హా ఇంటివద్ద ఉన్న అతిథుల జాబితా డైరీని బట్టి చూస్తే.. కోల్గేట్ స్కాంలోని పలువురు నిందితులు ఆయనతో ప్రత్యక్షంగా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని, అంటే వాళ్లను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లే భావించాలని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది. -
ప్రధానీ కుట్రదారే
* బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ సంచలన వ్యాఖ్యలు * మన్మోహన్‌ను కూడా బొగ్గు కేసులో చేర్చాలని డిమాండ్ * కేటాయింపుల్లో అక్రమాలు జరగలేదు: ‘సాక్షి’తో పరేఖ్ * నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా * ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ * హిందాల్కో సంస్థలో రూ. 25 కోట్లు స్వాధీనం! సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీకార్యదర్శి పీసీ పరేఖ్, ప్రధాని మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఆ శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘గనుల కేటాయింపు నేను ఒక్కడినే తీసుకున్న నిర్ణయం కాదు. బొగ్గు గనుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయాన్నే ప్రభుత్వానికి సిఫార్సు చేశాను. ప్రధాని కార్యాలయం, అప్పటి బొగ్గు శాఖ మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ దాన్ని ఆమోదించారు. గనుల కేటాయింపులో ఆయనదే తుది నిర్ణయం. గనుల కోసం దరఖాస్తు చేసుకున్న కుమార మంగళం బిర్లా, సిఫార్సు చేసిన నేను.. ఇద్దరమూ కుట్రలో భాగస్వాములం అయితే, నా సిఫార్సుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి మూడో కుట్రదారుడు అవుతారు’ అని పరేఖ్ చెప్పారు. కేటాయింపులో కుట్ర జరిగిందని భావిస్తే ముగ్గుర్నీ దోషులుగానే పరిగణించాలన్నారు. అసలు కుట్రలో ప్రధాన భాగస్వామిగా కచ్చితంగా ప్రధానిని చేర్చాలని చెప్పారు. ఎందుకంటే తాను ప్రతిపాదన చేసినా.. ఆ శాఖ మంత్రిగా తుది సంతకం చేసే అధికారం మన్మోహన్‌కు ఉందన్నారు. నచ్చకపోతే ఆయన తిరస్కరించవచ్చని చెప్పారు. అయినా ప్రధానిని వదిలేసి తనను, బిర్లాను మాత్రమే ఎందుకు కుట్రదారులుగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని సీబీఐని డిమాండ్ చేశారు. ‘దర్యాప్తులో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను’ అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని పరేఖ్‌ను నిందితునిగా చేరుస్తూ అవినీతి నిరోధక చట్టాల ప్రకారం సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎనిదేళ్ల క్రితం ఆ కేటాయింపు నిష్పాక్షికంగా జరిగిందని పరేఖ్ వివరించారు. ఒడిశాలోని బొగ్గు గని కోసం అప్పట్లో హిందాల్కో, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకున్నాయని, ప్రభుత్వ కంపెనీ నైవేలీకి గని కేటాయించాలని బొగ్గు శాఖ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. తాము మొదట దరఖాస్తు చేసుకున్నందుకు గని తమకే కేటాయించాలిన బిర్లా కంపెనీ ప్రధానికి విజ్ఞప్తి చేసిందని ఆయన వెల్లడించారు. అప్పుడు తాను నైవేలీ, హిందాల్కోలను జాయింట్ వెంచర్‌గా రూపొందించాలని ప్రధానికి ప్రతిపాదించగా దానికి ఆయన అంగీకరించారన్నారు. కేటాయింపుల్లో ఇంత స్పష్టత ఉన్నపుడు ఈ కేసు నుంచి ప్రధానిని ఎందుకు తప్పించారో సీబీఐని అడగాలని కోరారు. అయితే తాము నిష్పాక్షికంగా, సరియైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ.. దానిలో కుట్ర దాగుందని సీబీఐ ఎందుకు భావిస్తోందో తనకు అర్థం కావడంలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి పీఎంవో నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు రాలేదని తెలిపారు. అయితే అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు చేతుల మీదుగానే దస్త్రాలన్నీ వెళ్లాయని, ఆయన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని పరేఖ్ కోరారు. అయితే పరేఖ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పరేఖ్ తన వాదనను సీబీఐ ముందు వినిపించాలని చెప్పారు. పరేఖ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం అవుతాయని మంత్రి మనీశ్ తివారీ తెలిపారు. కాగా, మహానది కోల్‌ఫీల్డ్స్, నైవేలీ లిగ్నైట్‌కు తలాబిరా 2, 3 గనులు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత కుమార మంగళం బిర్లా, పరేఖ్‌ను కలిశారని, అనంతరం నిర్ణయంలో మార్పు జరిగిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీనిలో పరేఖ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. హిందాల్కో సంస్థలో సోదాలు చేసిన సీబీఐకి లెక్కల్లో చూపని రూ. 25 కోట్లు లభించాయని సమాచారం. ఢిల్లీలోని యూకో బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో సోదాలు చేసిన సీబీఐ డబ్బుతో పాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి తదుపరి విచారణకు ఇన్‌కం ట్యాక్స్‌కు కేసు బదిలీ చేసింది. ప్రధాని రాజీనామా చేయాలి: బీజేపీ బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానికి కూడా పాత్ర ఉందని పరేఖ్ విమర్శించడంపై తామేమీ ఆశ్చర్చపోలేదని, ప్రతీ ఫైలు ఆయన కనుసన్నల్లోంచే బయటకి వెళ్లాలి కాబట్టి ఈ స్కాంలో ఆయన పాత్ర కాదనలేనిదని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. పరేఖ్ ప్రతిపాదనలను ప్రభుత్వం కావాలనే పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు జరిగిన సమయంలో ఆ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావుపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదనే సందేహం వ్యక్తం చేశారు. ప్రధానిని కూడా కుట్రదారుగానే పరిగణించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. బిర్లాపై కేసు దురదృష్టకరం: ఆనంద్ శర్మ కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్య దేశంలో పెట్టుబడులు పెట్టే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుందని చెప్పారు. ఇటువంటి కఠిన చర్యలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మరో మంత్రి రాజేశ్ పైలట్ అన్నారు. ప్రధానిపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలపై మరో మంత్రి మనీశ్ తివారీ ఎదురు దాడికి దిగారు. మన్మోహన్పై విమర్శలు చేస్తూ బీజేపీ సెల్ఫ్ ఫైరింగ్ చేసుకుంటోందని విమర్శించారు. -
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
-
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మళ్లీ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలలో సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో చార్జీషీట్లో తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేరును ఛార్జీషీట్లో చేర్చింది. అలాగే బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ పేరు కూడా చార్జీషీట్లో నమోదు చేసింది. ఇక యుపిఎ-1 హయాంలో ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా బొగ్గు మంత్రిత్వశాఖను పర్యవేక్షించిన కాలంలో చోటుచేసుకొన్న భారీ బొగ్గు కేటాయింపుల కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం జరిగిందని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2 జి స్పెక్ట్రమ్ కేసులో లక్ష డెబ్బై వేల కోట్ల నష్టం జరిగిందని వెలుగులోకి తెచ్చిన కాగ్ ఆతర్వాత బొగ్గు గనుల కేటాయింపులో వేలం పాటలు నిర్వహించనందున పదిలక్షల డెబ్బైవేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది. -
బొగ్గు కుంభకోణం ‘అపురూపం’
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సోమవారం రాజ్యసభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జీరోఅవర్‌లో ప్రకాశ్ జవదేకర్(బీజేపీ) బొగ్గు కుంభకోణం ‘అపురూపమైన’దంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. బొగ్గు కేటాయింపుల ఫైళ్లకు తాను కాపలాదారును కాదని ఇటీవల రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దుయ్యబట్టారు. ప్రధాని ఫైళ్లకే కాదు, దేశానికి కూడా కాపలాదారు వంటివారే. కానీ ఆయన ఈ రెంటిలో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తిం చడం లేదని జవదేకర్ అన్నారు. దీనిపై ప్రధాని సవివర ప్రకటన చేయాలని పట్టుబట్టారు.