breaking news
Coach Ravi Sasthi
-
అయితే క్లీన్‌బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులలో బరిలోకి దిగిన 11 మంది భారత జట్టు సభ్యులలో (శార్దుల్‌ను మినహాయించి) ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో జట్టు విజయంలో తలా ఓ చేయి వేశారు. టాప్–7లో ఆరుగురు కనీసం అర్ధ సెంచరీ సాధించారు, బౌలర్లలో ఉమేశ్ పది వికెట్లు, కుల్దీప్ ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ, అశ్విన్ కీలక వికెట్లతో విజయానికి బాటలు వేశారు. అయితే ఇంతటి ‘పండగ’ వాతావరణాన్ని సరిగా ఆస్వాదించలేకపోయిన దురదృష్టవంతుడు మాత్రం లోకేశ్ రాహుల్ ఒక్కడే. బలహీన ప్రత్యర్థిపై భారీగా పరుగులు సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన స్థితిలోనూ విఫలమైనందుకు రాహుల్ తనను తానే నిందించుకోవాలి. వరుస వైఫల్యాల తర్వాత కూడా తనను వెనకేసుకొస్తున్న టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టేదెప్పుడు? సాక్షి క్రీడా విభాగం : ఓపెనర్ లోకేశ్ రాహుల్ గత 19 టెస్టు ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మాత్రమే 50 పరుగులు దాటగలిగాడు. ఇందులో సొంత నగరంలో అఫ్గానిస్తాన్‌పై చేసిన అర్ధసెంచరీని పక్కన పెడితే ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన సెంచరీ మాత్రమే చెప్పుకోదగ్గది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి మినహా దాదాపు అందరూ విఫలం కాగా ఆ జాబితాలో రాహుల్ కూడా ఉన్నాడు. ఆ పర్యటనలో చివరి ఇన్నింగ్స్‌కు ముందు అతను వరుసగా 4, 13, 8, 10, 23, 36, 19, 0, 37 (మొత్తం 150) పరుగులు సాధించాడు. ఎలా చూసినా ఇది భారీ వైఫల్యం కిందే లెక్క.అదృష్టవశాత్తూ మురళీ విజయ్ తరహాలో సిరీస్ మధ్యలో గానీ సిరీస్ తర్వాత ధావన్‌లా కానీ అతనిపై వేటు పడలేదు. నిజానికి విండీస్ సిరీస్‌కు ముందు ఓవల్‌లో చేసిన 149 పరుగులే అతడిని కాపాడాయి. అప్పటికే సిరీస్ చేజారిపోయి చివరి మ్యాచ్‌లోనూ గెలిచే అవకాశాలు సన్నగిల్లిన స్థితిలో పోయేదేమీ లేదన్నట్లుగా ఎడాపెడా బాదిన ఆ ఇన్నింగ్స్‌ను బట్టి ఒక ఓపెనర్ సత్తాను అంచనా వేయడం పూర్తిగా తప్పు. అయితే ‘అపార ప్రతిభ’ కలవాడంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా అతనికి గట్టిగా మద్దతు పలుకుతుండటంతో రాహుల్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సరిగ్గా గమనిస్తే ఇంత నిలకడగా అటు విదేశాల్లో, ఇటు సొంతగడ్డపై విఫలమవుతున్న ఒక ఆటగాడికి ఇన్ని అవకాశాలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ... రాహుల్ 51 ఇన్నింగ్స్‌ల కెరీర్లో 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే అతి పేలవంగా ఆడిన సందర్భాలు అంతకంటే చాలా ఎక్కువ. కనీస సమయం పాటు కూడా క్రీజ్‌లో నిలబడకుండా ఆరంభంలోనే రాహుల్ చాలాసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. తాజాగా రాజ్‌కోట్ టెస్టులో తొలి ఓవర్లోనే ఔటైన అతను... హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 బంతులకే వెనుదిరిగాడు. కెరీర్లో ఏకంగా 24 సార్లు అతని ఆట 25 బంతుల్లోపే ముగిసిపోయింది! ఒక ఓపెనర్ నుంచి ఇలాంటి ఆటను ఏ జట్టూ ఆశించదు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సాధ్యమైనంత ఎక్కువసేపు మైదానంలో నిలబడటం, తొందరగా వికెట్ కోల్పోకుండా జట్టు ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేయడం ఓపెనర్ల సహజ లక్షణాలు. ఈ రకంగా పోలిస్తే రాహుల్‌కంటే విజయ్ ఎంతో మెరుగు. ఇక అతని బ్యాటింగ్‌లో ఇటీవల కనిపిస్తున్న అతి పెద్ద లోపం ఫుట్‌వర్క్. ఆరంభంలో పేసర్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన పాదాల కదలిక, చురుకుదనం అతనిలో కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే ‘ఔట్ స్వింగర్’లు అంటే అతను ముందే భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. క్రీజ్‌లో చిక్కుకుపోయి ఎల్బీడబ్ల్యూ కావడం లేదంటే బ్యాట్, ప్యాడ్ మధ్యలోంచి బంతి వెళ్లిపోయేలా ఆడి క్లీన్ బౌల్డ్ కావడం అలవాటుగా మారిపోయింది. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ నుంచి హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకు వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో అతను 5 సార్లు క్లీన్‌బౌల్డ్ కాగా, మరో 4 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దీనిని సరిదిద్దేందుకు, అతనిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు బంగర్ ఏమైనా ప్రయత్నించాడా లేదా అనేదానిపై స్పష్టతే లేదు. ఆస్ట్రేలియాలో ఎలా? తాజా వైఫల్యానికి ముందు అతను 11 వరుస ఇన్నింగ్స్‌లలో 9 అర్ధ సెంచరీలు సాధించాడు. వీటిలో 9 భారత గడ్డపై రాగా, మరో 2 శ్రీలంకలో స్కోరు చేశాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నాటి రాహుల్‌కు, ప్రస్తుతం అతని ఆటకు చాలా తేడా కనిపిస్తోంది. రాజ్‌కోట్‌లో వైఫల్యం తర్వాత హైదరాబాద్ టెస్టులో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయాలంటూ అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించిన సమయంలో కూడా కోహ్లి మద్దతు ఉండటంతో రాహుల్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ అక్కడైనా భారీ స్కోరు చేసే అవకాశాన్ని అతను చేజార్చుకున్నాడు. 72 పరుగుల లక్ష్యంతో విజయం ఖాయమైన స్థితిలో చేసిన 33 పరుగులను పరిగణలోకి తీసుకోనవసరం లేదు కాబట్టి విండీస్‌పై అతను విఫలమైనట్లుగానే భావించాలి. మరి సొంతగడ్డపై విండీస్‌పైనే పరుగులు సాధించలేని ఆటగాడు ఆస్ట్రేలియాలో ఎలా ఆడగలడంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అలాంటి ఆటగాడిపై జట్టు ఎలా విశ్వాసం ఉంచగలదు? ఓపెనర్‌గా పృథ్వీ షా దూసుకొచ్చినా... విజయ్, ధావన్ వైఫల్యాల తర్వాత మరో సీనియర్ అవసరం ఉంటుందనే కారణం ఒక్కటే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా రాహుల్‌కు అవకాశం కల్పించవచ్చు. కౌంటీల్లో ప్రదర్శనతో విజయ్‌కు మరో అవకాశం ఇస్తారా అనేది చెప్పలేం. కాబట్టి రాహుల్ స్థానానికి అప్పుడే వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే తాజా ఫామ్‌తో గనక అతను అక్కడ ఓపెనర్‌గా అడుగు పెడితే ఆసీస్ పిచ్‌లపై స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ ముందు ఈ ఓపెనర్‌కు విషమ పరీక్ష ఎదురు కావచ్చు. దాదాపు నాలుగేళ్ల క్రితం సిడ్నీలో అద్భుత సెంచరీతో రాహుల్ తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. ఇప్పటికే విమర్శల పాలవుతున్న రాహుల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఆసీస్ గడ్డ మళ్లీ వేదిక కాగలదు. అయితే ఆలోగా తన బ్యాటింగ్‌లోని సాంకేతిక లోపాలు సవరించుకునేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. లేదంటే నాడు రోహిత్ శర్మ స్థానంలో కొత్త కుర్రాడిగా తనను ఎంపిక చేసినట్లే ఇప్పుడు మయాంక్ అగర్వాల్‌ను తీసుకొస్తే తన కెరీర్‌కే దెబ్బ కాగలదు! లోకేశ్ రాహుల్ ఇప్పుడు సాంకేతిక సమస్యతో పాటు మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. షాట్ ఆడేటప్పుడు అతను తలను నిటారుగా ఉంచకుండా ఒక వైపు వంగిపోతున్నాడు.దాంతో శరీరం వికెట్లకు అడ్డంగా వస్తోంది. ఫలితంగా మళ్లీ మళ్లీ బౌల్డ్ లేదా ఎల్బీ అవుతున్నాడు. దీనిని అతను తొందరగా సరిదిద్దుకోవాలి. వరుసగా ఒకే తరహాలో ఔట్ కావడం కూడా అతనిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. – సునీల్ గావస్కర్ -
పృథ్వీలో ఆ ముగ్గురు: రవిశాస్త్రి
సాక్షి, హైదరాబాద్: ఓపెనింగ్ సంచలనం పృథ్వీ షాలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్, సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘పృథ్వీ క్రికెట్ ఆడేందుకే పుట్టినట్లున్నాడు. ముంబైలోని మైదానాల్లో ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అతనిలో కష్టపడాలన్న తపన కనిపిస్తోంది. అతను ఆడే షాట్లలో సచిన్... ఒక్కోసారి సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుండా ఇలాగే కష్టపడితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టెస్టుల్లో 10 వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజాలైన కపిల్ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘జట్టుకు తాను విలువైన బౌలర్‌నని ఉమేశ్ తాజా ప్రదర్శనతో చాటుకున్నాడు. ఓపెనర్ రాహుల్ టచ్‌లోకి వచ్చాడు. అతను ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్. కొన్నిసార్లు బాగా కష్టపడతాడు. ఈ మ్యాచ్‌లో నాకదే కనిపించింది. ఈ వరుసలో తాజాగా రిషభ్ పంత్ వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు’ అని రవిశాస్త్రి అన్నాడు. వృద్ధిమాన్ సాహాకు పంత్ నుంచి ఏర్పడిన పోటీపై స్పందిస్తూ... ఇవన్నీ సాను కూలాంశాలన్నాడు. ఒకరు లేకపోతే ఇంకొకరు సత్తా చాటుతున్నారని చెప్పాడు. శార్దుల్ ఓ సెషన్లో దూరమైతే ఉమేశ్ ఆ స్థానాన్నీ భర్తీ చేశాడని, పది వికెట్లు తీయగలిగాడని దీంతో జట్టు ఏ ఒక్కరిమీద ఆధారపడలేదనే విషయం స్పష్టమవుతుందని కోచ్ వివరించాడు. -
ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి
బిజీ షెడ్యూల్‌పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి అసంతృప్తి ముంబై: దాదాపు రెండు నెలలపాటు సాగిన శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి20 ఆడి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ పర్యటన అనంతరం జట్టు తగిన విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 13 వరకు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... ఈ సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే నవంబర్ 7 వరకు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక్కడైనా ఆగారా అంటే అదీ లేదు. కివీస్‌తో సిరీస్ ముగిసిన వారం రోజుల అనంతరం భారత్‌కు రానున్న శ్రీలంక జట్టుతో డిసెంబర్ 24 వరకు వన్డే సిరీస్ ఉంటుంది. లంకతో సిరీస్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 28న దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లి సేన వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడ మూడు టి20, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడాక స్వదేశానికి వస్తుంది. మా అభిప్రాయాలు తీసుకోండి... అలుపెరగని రీతిలో ఉన్న భారత బిజీ షెడ్యూల్‌పై సహజంగానే జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు ఉండటం జట్టుకు చేటు తెస్తుందని అన్నారు. ఇదే విషయమై ఆయన పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా చర్చించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ఆటగాళ్లకు ఏవిధంగా విశ్రాంతినిచ్చి కాపాడుకుంటున్నాయో వివరించారు. వారికి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ బ్రేక్ కింద స్వదేశానికి వచ్చేలా వెసులుబాటు ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పుడు భారత జట్టు కివీస్‌తో ఆడే వన్డే సిరీస్ దీపావళి సమయంలోనే ఉంటుంది. కానీ మన ఆటగాళ్లకు వారి ఇళ్లకు వెళ్లి వచ్చే వీలుండదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో షెడ్యూల్‌పై ఏమీ చేయలేమని బోర్డు అశక్తత వ్యక్తం చేసింది. కనీసం భవిష్యత్‌లోనైనా టూర్ల షెడ్యూల్ సమయంలో కెప్టెన్, కోచ్‌ల అభిప్రాయాలను తీసుకోవాలని శాస్త్రి బీసీసీఐకి సూచించారు. శాస్త్రి సూచనలను పరిగణిస్తాం... మరోవైపు రవిశాస్త్రి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి తెలిపారు. ‘ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ క్యాలెండర్ విరామం లేకుండా ఉంటోంది. మ్యాచ్‌లతో పాటు సుదీర్ఘ విమాన ప్రయాణాలతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతుంటారు. ఈ విషయంపై ఆలోచించాలని శాస్త్రి మాతో చెప్పారు. విరామం ఉంటే ఆటగాళ్లు వేగంగా కోలుకుంటారన్నారు. ఇంగ్లండ్, ఆసీస్ జట్లు తమ సిరీస్‌ల మధ్య తగిన విరామం ఉండేలా చూసుకుంటారు. ఇలాగే బీసీసీఐ కూడా ఇదే విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు ఆటగాళ్ల సంక్షేమాన్ని కూడా పట్టించుకున్నట్టవుతుంది’ అని జోహ్రి అన్నారు.