breaking news
Civil Aviation secretary R N Choubey
-
అలా అయితే ఎయిరిండియాను అమ్మం..
న్యూఢిల్లీ : తీవ్ర అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం వాటాల కొనుగోలుకు బిడ్లను సైతం కేంద్రం ఆహ్వానించింది. అయితే మంచి ధర వస్తేనే వాటాలను విక్రయిస్తామని, లేదంటే అమ్మబోమని కేంద్రం తాజాగా స్పష్టంచేసింది. బిడ్ ధర ఆమోదయోగ్యంగా.. అంచనావేసిన ఫ్లోర్ ప్రైస్‌ను చేరుకునే విధంగా ఉంటేనే అమ్ముతామని, లేకపోతే ఎయిరిండియాను విక్రయించబోమని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే డిజ్ఇన్వెస్ట్మెంట్ నిబంధనల కింద ఎయిరిండియా నికర విలువను లేదా మినిమమ్ ఫ్లోర్ ప్రైస్‌ను లెక్కించడానికి ఎంటర్ప్రైజ్ వాల్యుర్స్ను నియమించుకుందని తెలిపారు. ప్రతి బిడ్డింగ్ ప్రక్రియ మాదిరిగానే ఫ్లోర్ ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చిన బిడ్లనే ఆమోదిస్తామని చెప్పారు. ఆమోదయోగ్యంగా బిడ్లు లేకపోతే, ఎయిరిండియాను తాము విక్రయించమని తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్న ఎయిరిండియాకు వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. దీంతో ఆ భారం నుంచి బయటపడేందుకు ఎయిరిండియాను ప్ర్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియాలో 76శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను కూడా ఆహ్వానించింది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఎయిరిండియాను కొనుగోలు చేయాలనే రేసు నుంచి ఇండిగో, జెట్ ఎయిర్వేస్, టాటాగ్రూప్లు వెనక్కి తగ్గాయి. కేంద్ర విధించిన నిబంధనలతో ఈ సంస్థలు తాము కొనుగోలు చేయలేమని ప్రకటించాయి. ఎయిరిండియాలో వాటా కొన్న వారు తమ సొంత వ్యాపారాలతో దీన్ని విలీనం చేయరాదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు ఉద్యోగులను తగ్గించకూడదని ఇలా ఇతరత్రా నిబంధనలు విధించింది. -
విమానంలో వై-ఫైకు అనుమతి!!
న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్‌న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిందట. 10 రోజుల్లో దీనిపై ఓ శుభవార్తను అందించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. భారత గగనతలంలో వై-ఫై ఆపరేట్‌కు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని అనుమతించేవారు కాదు. ఎవరైనా ఫోన్‌ను వాడితే అది నేరంగా పరిగణించేవారు. ప్రస్తుతం పౌర విమానయానం తీసుకునే ఈ నిర్ణయంతో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వాగ్దానంతో, 'అచ్చే దిన్' ఫైనల్‌గా విమాన ప్రయాణికుల ముందుకు విచ్చేస్తుందట. ఈ ప్రతిపాదన అమలుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, 10 రోజుల్లో ప్రయాణికుల ముందుకు ఈ అవకాశాన్ని తీసుకురానున్నట్ట చౌబే తెలిపారు. భారత గగనతలంలో ఎగిరే భారత, విదేశీ విమనాలన్నింటికీ ఈ సౌకర్యం అనుమతించనున్నట్టు వెల్లడించారు. ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో చౌబే ఈ విషయాన్ని తెలిపారు.