breaking news
Cilukuru Balaji Temple
-
చిలుకూరు కోనేటిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
చిలుకూరు బాలాజీ ఆలయ కోనేటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి సోదరి భర్త రఘునందన్(69)ది తమిళనాడు. బుధవారం చిలుకూరు వచ్చిన ఆయన ఆరోజు సాయంత్రం నుంచి కనిపించలేదు. ఈ విషయమై గోపాలకృష్ణ బుధవారం రాత్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రఘునందన్ ఆలయ కోనేటిలో శవమై తేలగా స్థానికులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు సమీక్ష మొయినాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నారు. 3న చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు చిలుకూరు మహిళా ప్రాంగణంలోని డీఆర్డీఏ కార్యాయలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల వారీగా ఏర్పాట్ల పనులను అప్పగిం చారు. ఆయా శాఖల అధికారులు పనులు వేగవంతం చేసిపటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచిం చారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుంటారని, ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆల య ప్రాంగణంలోనే ఓ మొక్కను నాటుతారని చెప్పారు. ఆలయంలో సుమారు 20-25 నిమిషాల పాటు సీఎం ఉంటారన్నారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగసభ ప్రాంతంలో మొక్కలు నాటి ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. సభ ముగింపు అనంతరం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతారని చెప్పారు. ఆ తర్వాత ఘట్కేసర్ మండలం నారపల్లికి చేరుకుని అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై శంషాబాద్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌తో సమీక్షించారు. వేగవంతంగా పనులు.. 3న సీఎం కేసీఆర్ రానుండడంతో చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సభావేదిక, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో మట్టిపోసి గుంతలను పూడ్చివేస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెల్లే రహదారికి మర్మతులు చేపట్టారు. గుంతల పడిన ప్రాంతంలో రీబీటీ తారురోడ్డు వేశారు. రోడ్డు ఇరుపక్కల మట్టిపోసి చదును చేస్తున్నారు. మొక్కలు నాటే స్థలాలను సైతం చదును చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు చేపడుతున్నారు. -
చిలుకూరులో నేడు మహాలక్ష్మి ఉత్సవం
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ను నిరసిస్తూ చిలుకూరు బాలాజీ దేవాల యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా నిర్వహిస్తూ కొంతమంది ప్రేమ ను వ్యాపారమయం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ అదేరోజున శ్రీమహాలక్ష్మి ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించి నట్టు దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ వెల్లడించారు. ఇందులో భాగంగా శనివారం బాలికలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. సంప్రదాయ దుస్తులతో అమ్మవారిలా అలంకరించి, కాళ్లకు పసుపు పారాణి పూసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. మొయినాబాద్: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రత్యేకతకు మారుపేరుగా నిలుస్తోంది. నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పటికే భగవంతుడిని వ్యాపారమయం చేయవద్దంటూ హుండీ, కానుకలు లేకుండా వీఐపీ దర్శనాలు, టికెట్ దర్శనాలకు అనుమతి ఇవ్వకుండా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే పద్ధతిలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఈ దేవాలయానికే సొంతం. ఇదే తరహాలో చిలుకూరులో మరో బృహత్కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా నిర్వహిస్తూ కొంతమంది ప్రేమను వ్యాపారమయం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఇదేరోజు శ్రీమహాలక్ష్మి ఉత్సవంగా నిర్వహిం చాలని నిర్ణయించారు. అది గుడిలోనే మొదలు కావాలన్న ఆకాంక్షతో ‘నారి సర్వజగన్మయి’ ఉద్యమం పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రేమకు వ్యతిరేకం కాదు.. మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి కృష్ణపరమాత్ముడిని ప్రేమించింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారిని ప్రేమించి పెళ్లాడారు. దేవతల కాలం నుంచే ప్రేమ అనేది ఉంది. ప్రేమ సున్నితమైంది, వ్యక్తిగతమైంది. సినిమావాళ్లు దీనిని కలుషితం చేసేలా, మహిళలను హింసించి వ్యక్తపరిచేలా మలిచారు. దీంతో సమాజంలో కీచకులు కథానాయకులుగా, పోకిరీలు ఆరాధ్యులుగా మారారు. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించింది. అందుకే చిలుకూరు నుంచి ఈ ఉద్యమాన్ని మొ దలుపెడుతున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఎందుకు చేపడుతున్నారంటే.. ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు పెరిగిపోయాయి. యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి భయంకర పరిస్థితిని రూపుమాపి సమాజంలో మహిళ కోల్పోయిన ఉన్నత స్థానాన్ని తిరిగి తీసుకురావడం కోసమే చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో యేటా ఫిబ్రవరి 14న శ్రీమహాలక్ష్మి ఉత్సవాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. దీనిపై ఆలయ అర్చకులు ఇప్పటికే ప్రచారం కల్పించారు. బాలికలచే ప్రద క్షిణలు నేడు.. మహాలక్ష్మి ఉత్సవంలో భాగంగా శనివారం బాలికలచే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించనున్నారు. సంప్రదాయ దుస్తులతో అమ్మవారిలా అలంకరించి, వారి కాళ్లకు పసుపు పారాణి పూసి భక్తులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మహిళా మహాలక్ష్మి ప్రతిరూపమే.. ప్రస్తుత సమాజంలో మహిళలపై అకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ రూపుమాపేందుకే ‘నారి సర్వజగన్మయి’ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం చిలుకూరులోనే నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని దేవాలయాల్లోనూ నిర్వహించేందుకు కృషి చేస్తాం. దేవాలయాలు, విద్యాలయాలు, సామాజిక కార్యకర్తలు, సేవా సంస్థలు, మహిళా సంస్థలు తమ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మంచిది. - రంగరాజన్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త