breaking news
Choice Based Credit System
-
నచ్చిన సబ్జెక్టు.. మెచ్చిన చోట
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్’ను ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టును, నచ్చిన చోట పూర్తిచేసే వీలుంది. ఆఖరుకు ఆన్లైన్ ద్వారా చేసినా ఆమోదం లభిస్తుంది. అయితే, డిగ్రీలో 40 శాతం క్రెడిట్స్‌కు దీన్ని పరిమితం చేయాలని యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) షరతు పెట్టింది. గతంలో ఈ విధానంలో 20శాతం క్రెడిట్లకే అనుమతించేవారు. విస్తృత విద్యావకాశాలను విద్యార్థులు సొంతం చేసుకునేందుకే దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. అయితే, యూజీసీ అనుమతించిన ఆన్లైన్ సంస్థలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో క్లస్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచే అమల్లోకి తెచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఉండే మొత్తం తొమ్మిది కాలేజీలను అనుసంధానం చేసి, ఒకే పాఠ్యప్రణాళిక, పరీక్ష విధానం, బోధనా పద్ధతులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థి ఏదైనా ఒక సబ్జెక్టును తనకు నచ్చిన కాలేజీలో పూర్తి చేసే విధానం అమల్లోకి తెచ్చారు. కొన్ని కాలేజీల్లో వనరులు, మరికొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ, ఇంకొన్ని చోట్ల లైబ్రరీ లేదా లేబొరేటరీ అందుబాటులో ఉంటుంది. వీటిని ఉపయోగించుకునే అవకాశం క్లస్టర్ విధానంలో కలుగుతుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ దీన్ని మరింత విస్తృతం చేయనుంది. ఆన్లైన్ ఎలా? ఉదాహరణకు విద్యార్థి బీఏ హెచ్‌పీపీలో ఒక కాలేజీలో ప్రవేశం పొందాడు. హిస్టరీ సబ్జెక్టులో అతనికి యూరోపియన్ హిస్టరీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ తెలంగాణలో ఇది అందుబాటులో లేదు. అలాంటప్పుడు మిగతా సబ్జెక్టులన్నీ ప్రవేశం పొందిన కాలేజీలోనే పూర్తిచేసి, యూరోపియన్ హిస్టరీ సబ్జెక్టును ఆన్లైన్ ద్వారా> చేసుకోవచ్చు. దేశంలో మాసివ్ ఆన్లైన్ కోర్సెస్, స్వయం సహా అనేక సంస్థలకు యూజీసీ గుర్తింపు ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షను కూడా ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తారు. అందులో వచ్చిన క్రెడిట్స్‌ను విద్యార్థి మాతృ కాలేజీకి ఆన్లైన్ సంస్థ బదిలీ చేస్తుంది. తాను చేసే కోర్సు వివరాలను ముందే సంబంధిత మాతృ కాలేజీకి, ఏ కాలేజీలో ప్రవేశం పొందింది ఆన్లైన్ కాలేజీకి ముందే చెప్పాల్సి ఉంటుంది. కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థికి సానుకూలమైన సబ్జెక్టులతో ఫ్యాకల్టీ సమస్యను అధిగమించే వీలుందని అధికారులు అంటున్నారు. దీంతోపాటు ఆన్లైన్ సంస్థలు అంతర్జాతీయ నాలెడ్జ్‌తో కోర్సులను అందించేందుకు పోటీ పడుతున్నాయని చెబుతున్నారు. మార్పునకు నాంది ఈ తరహా కోర్సులకు యూజీసీ ఇప్పటికే అనుమ తించింది. భవిష్యత్‌లో దీనికి మరింత ఆదరణ పెరిగే వీలుంది. జాతీయ, అంతర్జాతీయ బోధనతో పోటీపడేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుంది. ఇప్ప టికే చాలామంది విద్యార్థులు వృత్తిపరమైన కొన్ని కోర్సులను ఆన్లైన్ ద్వారానే నేర్చుకుంటున్నారు. ఇవి కేవలం ఉపాధి కోసమే సాగుతున్నాయి. ప్రస్తుత విధానం విజ్ఞానం విస్తృతమవ్వడానికీ దోహదపడుతుంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
పాఠ్యాంశంగా మేధో సంపత్తి హక్కులు
న్యూఢిల్లీ: మేధోసంపత్తి హక్కులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక సబ్జెక్టును చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం కింద అందుబాటులోకి తీసుకురావాలని వర్సిటీలను యూజీసీ కోరింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్. సంధు వర్సిటీలకు లేఖ రాశారు. మానవ మేధస్సుకు సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, పేర్లు, ఫొటోలు, కళాకృతులు, సాహిత్యం, పారిశ్రామిక రంగ సంబంధిత పరికరాలు మేధోసంపతి హక్కుల కిందకు వస్తాయని లేఖలో పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్‌లోనూ సీబీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) తన పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీసీఎస్ అమల్లోకి వస్తే మార్కుల విధానం ఇకపై ఉండదు. విద్యార్థుల మార్కుల రేంజ్‌నుబట్టి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, క్రెడిట్ పాయింట్ల విధానం రానుంది. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ పరిధిలో 500కుపైగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులను నిర్వహించే డి గ్రీ, పీజీ కాలేజీలు ఉండగా వాటిన్నింటిలోనూ దీన్ని అమలు చేయనున్నారు. అలాగే జేఎన్టీయూహెచ్ ఇన్నాళ్లూ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయట్లేదు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రథమ సంవత్సరంతోపాటు అన్ని సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునే అవకాశం కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సీబీసీఎస్‌ను 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. -
ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్‌ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్‌కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్‌ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. అనుసంధానమెప్పుడు? సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తాము సూచించిన సిలబస్‌లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి. సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది. -
చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్..
ప్రస్తుత విద్యార్థుల్లో, మన స్నేహితుల్లోనో, బంధువుల్లోనో రంజిత్, వెంకట్, సురేశ్ లాంటివారెందరో కనిపిస్తుంటారు. ఎన్నో కారణాలతో కోర్సు, కెరీర్ ఎంపిక విషయంలో రాజీ ధోరణితో వ్యవహరించి ఆపై అనాసక్తంగా, అయిష్టంగా అకడమిక్స్‌తో భారంగా కాలం వెళ్లదీస్తూ.. మానసికంగా కుంగిపోతున్న వారెందరో..! ఇలాంటి వారందరూ ఇప్పుడు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులు అభ్యసించొచ్చు. అన్నిటికీ మించి మనసు మెచ్చే కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు.అందుకు మార్గం.. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్). దేశంలోని విద్యాసంస్థల్లో అందిస్తున్న కోర్సుల్లో ఏకరూపత, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెంచే దిశగా యూజీసీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమే.. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)పై ఫోకస్.. 1. రంజిత్‌కు ఇంజనీరింగ్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఆసక్తి. కానీ ఎంట్రెన్స్‌లు, ప్రవేశాల నిబంధనల కారణంగా ఇంజనీరింగ్‌లో సీటు పొందలేకపోయాడు. ప్రస్తుతం బీకాం చదువుతున్నాడు. కానీ మనసంతా ఇంజనీరింగ్ కోర్సుపైనే! 2. వెంకట్.. ఓ సాధారణ కళాశాలలో బీఎస్సీ అభ్యసిస్తున్నాడు. వాస్తవానికి మంచి కాలేజీలో చేరాలనే అభిలాష. పరిస్థితులు అనుకూలించక సీటు దొరికిన కళాశాలలోనే చదువుతున్నాడు. కానీ భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో రాణించగలనా..? అనే బెంగ!! 3. సురేశ్.. డిగ్రీలో ఉండగానే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మరో సంవత్సరంలో డిగ్రీ పూర్తవుతుందనగా.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కోర్సు పూర్తిచేయలేకపోయాననే దిగులు.. రెండేళ్లు చదివిన చదువు వృథాగా పోయిందనే బాధ.. ఉన్నత కోర్సులు అభ్యసించడానికి వీలులేదా? అనే ఆందోళన!!! మీ కెరీర్ ఎంపిక.. మీ చేతుల్లోనే సీబీసీఎస్ అంటే ఐఐటీలు, బిట్స్ వంటి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో కొన్నేళ్ల క్రితం నుంచే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అమలవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీలు తప్పనిసరిగా సీబీసీఎస్ విధానం అమలు చేయాలని యూజీసీ తాజాగా మార్గనిర్దేకాలు జారీ చేయడంతో ఇప్పుడిది అందరి నోటా వినిపిస్తోంది. దాంతో అసలు సీబీసీఎస్ అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే ప్రశ్నలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తలెత్తున్నాయి. సీబీసీఎస్ అంటే.. ఏదైనా ఒక కోర్సులో చేరిన విద్యార్థి కోర్ సబ్జెక్ట్‌లకు తగిన ప్రాధాన్యమిస్తూనే.. వాటిని మేజర్ సబ్జెక్ట్స్‌గా చదువుతూ... కోర్సుతో సంబంధం ఉన్నా, లేకున్నా తనకు ఇష్టమైన ఇతర సబ్జెక్ట్‌లను అదనంగా మైనర్/ఎలక్టివ్స్‌గా అభ్యసించేందుకు అవకాశం కల్పించే విధానం. దీనివల్ల విద్యార్థులకు ప్రధానంగా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లభిస్తుంది. ఫలితంగా.. భవిష్యత్తులో ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా కెరీర్ అవకాశాలను విస్తృతం చేసుకునే వీలుంటుంది. యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ కేవలం విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్కే పరిమితం కాకుండా.. కరిక్యులం, టీచింగ్-లెర్నింగ్ విధానాలు, మూల్యాంకనం, ఫలితాల్లో విస్తృత మార్పులకు నాంది పలుకనుంది. కీలక మార్పు.. క్రెడిట్స్ సీబీసీఎస్ విధానంతో అకడమిక్స్‌లో రానున్న కీలక మార్పు.. క్రెడిట్స్. ఇప్పటివరకు ఏదైనా కోర్సును ఎంచుకుంటే.. సంబంధిత కోర్సులోని ఒక్కో సబ్జెక్ట్‌కు గరిష్టంగా కేటాయించిన మార్కులకు విద్యార్థులు పొందిన మార్కులు గణనలోకి వచ్చేవి. తాజా విధానంలో ఒక గ్రూప్‌లోని ప్రతి సబ్జెక్ట్‌కు దాని పరిధి, ప్రాధాన్యత ఆధారంగా సెమిస్టర్ వ్యవధిలో.. టీచింగ్-లెర్నింగ్ అంశాలను పరిగణిస్తూ గరిష్టంగా కొన్ని క్రెడిట్స్ కేటాయిస్తారు. ఇది ప్రతి సబ్జెక్ట్‌కు మారుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్న ఐఐటీ-హైదరాబాద్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. సెమిస్టర్లో వారానికి మూడు లెక్చర్స్ చొప్పున సెమిస్టర్‌కు గరిష్టంగా 42 లెక్చర్స్ ఉండే ఒక సబ్జెక్ట్‌కు మూడు క్రెడిట్స్ ఇచ్చే విధానం అమలవుతోంది. ఈ క్రెడిట్స్ సంఖ్యలోనూ సెమిస్టర్ వారీగా మార్పులు ఉంటాయి. మొదటి సెమిస్టర్లో 18 క్రెడిట్స్ ఉంటే.. రెండో సెమిస్టర్లో 15.5 క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థుల అభీష్టానికే పెద్దపీట క్రెడిట్ సిస్టమ్‌లో మరో ముఖ్యమైన అంశం.. అభ్యసనం పరంగా విద్యార్థుల అభీష్టానికే పెద్దపీట వేయడం. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి క్లాస్ రూం టీచింగ్, ప్రాక్టికల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలా సంబంధిత అన్ని అంశాల సమ్మేళనంతో గరిష్టంగా నిర్దిష్ట సంఖ్యలో క్రెడిట్స్ కేటాయిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పొందాల్సిన క్రెడిట్స్‌ను కూడా నిర్దేశిస్తారు. ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశం. తమ సొంత శైలిలో అభ్యసన మార్గాలను ఎంచుకునేందుకు ఈ క్రెడిట్ సిస్టమ్ ఆస్కారమిస్తుంది. ఇష్టమున్నా, లేకున్నా గంటల తరబడి క్లాస్ రూంలో కూర్చోవాలనే పరిస్థితులకు స్వస్తి పలుకుతుంది. బిట్స్ ఈ విషయంలో ఇప్పటికే ముందంజలో ఉంది. బిట్స్ క్యాంపస్‌ల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ పేరుతో అమలు చేస్తున్న విధానం ప్రకారం.. విద్యార్థులకు కచ్చితంగా క్లాస్‌కు హాజరుకావాలనే నిబంధన నుంచి వెసులుబాటు లభిస్తోంది. దీంతో తమకు నచ్చిన రీతిలో క్లాస్‌రూం అభ్యసనానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. పాఠాలపై పట్టు సాధించొచ్చు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ దిశగా సీబీసీఎస్‌లోని మరో ప్రధాన అంశం.. విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెంచడం. తాజాగా యూజీసీ జారీ చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం- ఒక గ్రూప్‌లో కోర్సుల స్వరూపాన్ని మూడు రకాలుగా నిర్ణయించింది. అవి.. కోర్ కోర్సు: ఒక గ్రూప్‌నకు సంబంధించి తప్పనిసరి అయిన కోర్ సబ్జెక్ట్‌లు అభ్యసించడం. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్ కోర్సులనే మేజర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఎలక్టివ్ కోర్సు: కోర్ గ్రూప్, సబ్జెక్ట్స్‌తో సంబంధం లేకుండా విద్యార్థుల ఆసక్తి మేరకు తమకు నచ్చిన సబ్జెక్ట్‌లను అభ్యసించేందుకు వీలు కల్పించే కోర్సులు. ఉదాహరణకు బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎకనామిక్స్ వంటి కోర్సులు. ఈ తరహా టీచింగ్-లెర్నింగ్ విధానం అమలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని యూజీసీ నిర్దేశించింది. ఫలితంగా విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లభిస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో ఎలక్ట్రిక్ పరికరాల తయారీలో అవసరమయ్యే మెకానికల్ నైపుణ్యాలను సొంతం చేసుకునే విధంగా మెకానికల్‌ను సైతం ఎలక్టివ్సగా ఎంచుకోవచ్చు. ఫౌండేషన్ కోర్సు: ఒక గ్రూప్‌నకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పించే కోర్సులివి. యూజీసీ తాజా నిర్దేశకాల ప్రకారం- ఫౌండేషన్ కోర్సును కూడా కంపల్సరీ ఫౌండేషన్, ఎలక్టివ్ ఫౌండేషన్ అని రెండు రకాలుగా వర్గీకరించింది. కంపల్సరీ ఫౌండేషన్ ఉద్దేశం విద్యార్థి చేరిన గ్రూప్‌లో ప్రాథమిక అవగాహన కల్పించడం. ఇది అన్ని కోర్సులకు తప్పనిసరి. ఎలక్టివ్ ఫౌండేషన్ మాత్రం విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు. దీనివల్ల మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ సొంతమవుతుంది. సీఎస్ఈ విద్యార్థి లిబరల్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌ను అభ్యసించొచ్చు. అంటే.. కోర్ అవసరాల దృష్ట్యా కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ చేస్తూనే వ్యక్తిగత ఆసక్తి మేరకు కథక్ నృత్యాన్నో లేదా సంగీతాన్నో అధ్యయనం చేయొచ్చు. నిరంతర మూల్యాంకనం సీబీసీఎస్ విధానంలో మరో ప్రత్యేకత.. నిరంతర మూల్యాంకన విధానం. ఒక ఏడాది కోర్సును ఆరు నెలల వ్యవధి చొప్పున రెండు సెమిస్టర్లుగా విభజిస్తారు. 15 నుంచి 18 వారాల వ్యవధిలో ఉండే ఒక్కో సెమిస్టర్లో గరిష్టంగా 90 టీచింగ్ అవర్స్ ఉండాలి. కోర్సుకు గరిష్టంగా కేటాయించిన క్రెడిట్స్, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారికి క్రెడిట్స్ కేటాయిస్తారు. కోర్ కోర్సుల విషయంలో మాత్రం మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం తగ్గకుండా సెమిస్టర్ చివర్లో థియరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మార్కుల స్థానంలో గ్రేడింగ్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క మార్కు తక్కువ వచ్చినా పర్సంటేజీల్లో తేడాలు వచ్చి.. ఎంతో వెనుకంజలో ఉంటాం, అవకాశాలు దూరమవుతాయే మోనని విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో అకడమిక్ పర్సంటేజీలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇకపై ఇలాంటి పరిస్థితి నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. సీబీసీఎస్‌లో భాగంగా అన్ని గ్రూప్‌ల్లో, అన్ని స్థాయిల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా ఎస్‌జీపీఏ (సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్), సీజీపీఏ (క్యుమిలేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్) విధానాలు అమలుకానున్నాయి. సెమిస్టర్లో ఒక కోర్సుకు కేటాయించిన గరిష్ట క్రెడిట్స్, విద్యార్థి పొందిన గ్రేడ్ పాయింట్‌ను గుణించి వాటి మొత్తం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఉదా.. ఒక సెమిస్టర్లో మూడు క్రెడిట్లు ఉన్న కోర్సులో 10 గ్రేడ్ పాయింట్లు పొందితే లభించే క్రెడిట్ పాయింట్స్ 30. ఇది ‘ఒ’ (ఎక్సలెంట్) గ్రేడ్‌కు సమానం. ఇలా ప్రతి కోర్సుకు సెమిస్టర్ వారీగా క్రెడిట్, గ్రేడ్ పాయింట్లను లెక్కించి.. కోర్సు పూర్తయ్యేనాటికి విద్యార్థి పొందిన క్రెడిట్ పాయింట్స్ మొత్తం ఆధారంగా గ్రేడ్ జారీ చేస్తారు. మార్కుల నుంచి గ్రేడ్లకు మార్చే క్రమంలో ఉన్నత విద్యకు అవసరమైన కనీస అర్హత మార్కులకు సరితూగే విధంగా ఈ గ్రేడ్లు ఉంటాయి. ఉదాహరణకు యూజీసీ నెట్‌కు కనీస అర్హత పీజీలో 55 శాతం మార్కులు. దీన్ని పరిగణనలోకి తీసుకుని 55 శాతం మార్కుల శ్రేణిని బి+ లేదా బిగా ఉండేలా చూడాలని యూజీసీ పేర్కొంది. మెచ్చిన కాలేజీకి మార్గం సీబీసీఎస్ విధానంలో విద్యార్థులకు ఎంతో మేలు చేసే అంశం.. మెచ్చిన కాలేజీలో అభ్యసనం చేసే అవకాశం లభించనుండటం. క్రెడిట్ ట్రాన్స్ఫర్ పేరుతో అమలు చేయనున్న కొత్త విధానంలో.. ఒక కళాశాలలో కొన్ని క్రెడిట్స్ పొందిన విద్యార్థి కొన్ని రోజుల తర్వాత మరో కళాశాల లేదా యూనివర్సిటీకి తన ఎన్‌రోల్‌మెంట్‌ను బదిలీ చేసుకొని కోర్సును కొనసాగించొచ్చు. మౌలిక సదుపాయాల లేమి, ఫ్యాకల్టీ కొరత వంటి సమస్యలున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో అభ్యసిస్తున్న లక్షల మంది విద్యార్థులు ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌తో మేలైన ఫలితాలు, మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ‘డిస్కంటిన్యూ’ బెంగకు స్వస్తి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో భాగంగా అమలు చేయనున్న క్రెడిట్ ట్రాన్స్ఫర్ విధానంతో ఆయా కోర్సులను మధ్యలో ఆపేసిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తాజా విధానంతో ఏదైనా కోర్సులో చేరి మధ్యలో ఆపేసిన విద్యార్థులు మళ్లీ తమ కోర్సు కొనసాగించొచ్చు. అప్పటివరకు పొందిన క్రెడిట్స్ లేదా మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. విద్యార్థుల కోణంలో విలువైన సమయం వృథా అయిందనే బెంగ తీరడంతోపాటు కోర్సును పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అదనపు కోర్సులు, క్రెడిట్స్ సీబీసీఎస్ విద్యార్థులకు అందనున్న మరో అద్భుత అవకాశం.. అదనపు కోర్సులు, క్రెడిట్స్ పొందే వీలు లభించడం. నిర్దిష్ట వ్యవధిలోని ఒక ప్రోగ్రామ్ (ఇప్పటివరకు కోర్సు)లో చేరిన తెలివైన విద్యార్థి సదరు ప్రోగ్రామ్‌కు కేటాయించిన గరిష్ట క్రెడిట్స్‌ను, కనీస అర్హత క్రెడిట్స్‌ను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన సమయంలో వేరే కోర్సులను అభ్యసించి అదనపు క్రెడిట్స్ సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు బహుముఖ నైపుణ్యాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. మారనున్న స్వరూపాలు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో భాగంగా ఇప్పటివరకు మనం కోర్సు, డిగ్రీగా భావిస్తున్న వాటి పిలుపులు కూడా మారనున్నాయి. ఇక నుంచి కోర్సులను (డిగ్రీ, డిప్లొమా, పీజీ) ప్రోగ్రామ్‌లుగా పేర్కొననున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పేపర్‌గా పిలుస్తున్న సబ్జెక్ట్‌లు ఇక పై కోర్సులుగా మారనున్నాయి. ఇలా స్వరూపం నుంచి సర్టిఫికేషన్ వరకూ.. పలు కొత్త మార్పులకు నాంది పలకనున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్.. యువత సమర్థ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు మార్గం వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీసీఎస్.. సాధ్యమేనా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అమలు దిశగా యూజీసీ శరవేగంగా కదులుతుండగా.. మరోవైపు ఈ విధానం మన దేశంలో అమలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా మొదలైంది. ప్రస్తుతం దేశంలో యూనివర్సిటీల స్థాయిల్లో కోర్సులు, సిలబస్, టీచింగ్-లెర్నింగ్ విధానాలు వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సిలబస్, కరిక్యులం రూపొందిస్తేనే సీబీసీఎస్ ద్వారా సత్ఫలితాలు ఆశించడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న సీబీసీఎస్ సమర్థంగా అమలు కావాలంటే మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి. కానీ రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లో అధిక శాతం యూనివర్సిటీలు ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సీబీసీఎస్ వాస్తవ ఉద్దేశం నెరవేరాలంటే ముందుగా ఇన్స్టిట్యూట్ల స్థాయిలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. క్షేత్ర నైపుణ్యాల దిశగా.. యూజీసీ రూపొందించిన సీబీసీఎస్ విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే క్షేత్ర నైపుణ్యాలు అందించేందుకు దోహదపడుతుంది. ప్రాక్టికాలిటీ, నిరంతర మూల్యాంకనం వంటి విధానాలతో విద్యార్థుల అకడమిక్‌గా ప్రతిభావంతులవుతారు. అదే విధంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ విధానం ఫలితంగా.. కోర్సు, కాలేజీ ఎంపికలో ఎంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఉపశమనం లభిస్తుంది. కరిక్యులం, సిలబస్ రూపకల్పన వంటి విషయాల్లో సహకరించేందుకు యూజీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే సీబీసీఎస్ లక్ష్యం. - డాక్టర్ డి.ఎన్.రెడ్డి, చైర్మన్ డీఆర్డీఓ-ఆర్ఏసీ, యూజీసీ సభ్యులు ఆచరణ సాధ్యమే.. దేశంలోని యూనివర్సిటీల్లో వేర్వేరు సిలబస్‌లు, బోధన పద్ధతులు అమలవుతున్న తరుణంలో సీబీసీఎస్ ఆచరణ సాధ్యమేనా అని సందేహించక్కర్లేదు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో విజయవంతమైన ఈ విధానం రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లోనూ సమర్థంగా అమలు చేయొచ్చు. సీబీసీఎస్‌కు సంబంధించి యూజీసీ త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వనుంది. దాని మేరకు కరిక్యులంలోనూ ఏకరూపత (యూనిఫార్మిటీ) లభించే అవకాశాలున్నాయి. అది కార్యరూపం దాల్చితే సీబీసీఎస్ విజయవంతం అవుతుంది. - ప్రొఫెసర్ మొహమద్ మియాన్, వీసీ-మనూ (యూజీసీ సభ్యులు) మేలైన నిర్ణయం.. సీబీసీఎస్‌లో పేర్కొన్న పలు అంశాల ప్రకారం- విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. థియరిటికల్ నాలెడ్జ్, మార్కులు/పర్సంటేజిలు అనే ఆలోచనలకు దూరంగా ఉంచేసీబీసీఎస్ ఎంతో అవసరం. కానీ ఈ విధానాన్ని అమలు చేయాలంటే ముందస్తు కసరత్తు చేయాలి. ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచి అవసరమైన మార్పులు తేవాలి. విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.ఇప్పటికే బిట్స్ క్యాంపస్‌ల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. ఫలితంగా విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు పెంచుకుంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులు సీబీసీఎస్ విధానాన్ని కోర్ నైపుణ్యాలను పెంచుకునేందుకు సాధనంగా ఉపయోగించుకోవాలి. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు, డెరైక్టర్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్ టెక్నికల్ విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలు.. సీబీసీఎస్ వల్ల టెక్నికల్ విద్యార్థులు విభిన్న రంగాల్లో నైపుణ్యాలు పొందొచ్చు. ఇలాంటి విధానం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. ఇంజనీరింగ్ విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో పలు విభాగాల (మార్కెటింగ్, అకౌంట్స్, ఫైనాన్స్ తదితర) వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోర్ సబ్జెక్ట్లే కాకుండా.. ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్ చేతికి చేరే వరకు అవసరమైన అన్ని విభాగాల గురించి అవగాహన పొందడం కెరీర్ పరంగా కలిసొస్తుంది. దీనికి సీబీసీఎస్‌లోని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ మార్గం వేస్తుంది. ఇప్పటికే ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇలాంటి విధానాలు అమలవుతున్నాయి. - ప్రొఫెసర్ ఫయాజ్ అహ్మద్ ఖాన్, డీన్ (అకడమిక్స్), ఐఐటీహెచ్ -
కనులపండువ..
- ఘనంగా నల్సార్ స్నాతకోత్సవం - రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘన స్వాగతం - 649మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం శామీర్‌పేట్ : మండలపరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ముఖ్యఅతిథిగా హజరై స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి ,నల్సార్ లా యూనివర్సిటీ చాన్స్‌లర్ క ళ్యాణ్ జ్యోతిసేన్ గుప్త సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 649 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం చేశారు. వీరిలో పలువురికి ప్రశంసాపత్రాలతో పాటు బంగారు పతకాలను అందజేశారు. మొత్తం 48 బంగారు పతకాలకుగానూ బీఏఎల్ ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసిన విద్యార్థిని కుమారి ప్రియంవదా దాస్ 11 బంగారు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన విజయాలను, విద్యా విషయాలను వివరించారు. నల్సార్‌లో ఇటీవల ఆరంభించిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ద్వారా విద్యార్థులు భిన్నమైన కేసుల వివరాలను తెలుసుకునే వీలు కలిగిందన్నారు. తొలుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి హెలీకాప్టర్ సాయంత్రం 4 గంటలకు నల్సార్ లా యూనివర్సిటీలో ప్రత్యేకంగాఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగగా అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో స్నాతకోత్సవ ప్రాంగణానికి ఆయనను తీసుకువచ్చారు. శామీర్‌పేట్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు గవర్నర్ నరసింహాన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తలు వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో వారిని స్నాతకోత్సవ ప్రాంగణానికి తీసుకువచ్చారు. -
విద్యార్థులకు వరం
వైవీయూ, న్యూస్‌లైన్ : కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యావిధానంలో సైతం అధునాతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా తాను చదివే చదువుతో పాటు నచ్చిన సబ్జెక్టుల్లో సైతం ప్రావీణ్యం పొందుతూ డిగ్రీ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని ఉన్నతవిద్యాశాఖ విద్యార్థులకు అందిస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ర్టవ్యాప్తంగా తొలిసారి చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పేరుతో నచ్చిన విద్యను అందిపుచ్చుకునేందుకు అటానమస్ హోదా కలిగిన 10 కళాశాలలను ఎంపికచేశారు. రాయలసీమ నుంచి కర్నూలు సిల్వర్జూబ్లి కళాశాలతో పాటు కడపకు చెందిన ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అంటే.. డిగ్రీ విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టుతో పాటు ఇతర అంశాలపైనా అవగాహన పొందేందుకు రూపొందిస్తున్న పాఠ్యప్రణాళికా విధానమే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌ను 2014-15 విద్యాసంవత్సరం నుంచి స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలో తొలిసారిగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కళాశాలల అధ్యాపకుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన ఉన్నత విద్యాశాఖ ఈ యేడాది నుంచి అమలుచేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విధానం ప్రకారం కాలేజ్ స్టడీస్ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ప్రతి విభాగానికి అనుబంధంగా మరో రెండు ఏవైనా పరీక్షపత్రాలను విద్యార్థి చాయిస్ విధానంలో ఎన్నుకోవచ్చు. ఓ విద్యార్థి బీఎస్సీ చదువున్నట్లయితే ఆ విద్యార్థి సాప్ట్వేర్ కానీ పర్యాటకం, జెమాలజీ, జర్నలిజం ఇలా ప్రత్యేకతలు కలిగిన 18 అంశాల్లోని ఏవైనా సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. అలాగే ఒక గ్రూపునకు సంబంధించిన విద్యార్థులు మరో గ్రూపుకు చెందిన సబ్జెక్టులను సైతం ఐచ్చికంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షా విధానంలో సైతం గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అవుట్ స్టాండింగ్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఇ గ్రేడ్, నాట్ క్వాలిఫైడ్ గ్రేడిం గ్ (ఎఫ్ గ్రేడ్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెమిస్టర్ స్థానంలో మాడ్యూల్స్.. ఈ యేడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థి తొలిసంవత్సరం క్రెడిట్ 1, క్రెడిట్ 2తో ప్రథమ సంవత్సరం పూర్తయిన తర్వాత సెకండియర్ చివరలో సర్టిఫికెట్ కోర్సు లేదా విద్యార్థి ఐచ్ఛిక సబ్జెక్టు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. చదువుతున్న సిలబస్‌కు అవసరాన్ని బట్టి అదనంగా చేర్చడం లేదా తొలగించడం తదితర ప్రక్రియలతో కూడిన విధానం విద్యార్థికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతం.. జిల్లాలో అటానమస్ పొందిన కళాశాల కావడంతో సీబీసీఎస్‌ను ఆర్ట్స్ కళాశాలలో అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థి స్వేచ్ఛగా తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకుంటూ ఇతర సబ్జెక్టులపైనా అవగాహన పొందవచ్చు. ఈ యేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం అమలుపరచనున్నాం. - డాక్టర్ రవికుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప