breaking news
chirala municipality
-
ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత
- చీరాల మున్సిపాలిటీలో వట్టిపోతున్న వర్మీ కంపోస్టు యూనిట్లు - అవగాహన రాహిత్యంతో, ప్రారంభించిన నెలలోపు ఒకటి మూత - రెండు యూనిట్లలో అరకొరగా తయారీ - ఎండలకు చనిపోతున్న వానపాములు - వర్మికంపోస్టు ఎరువు ధర అధికంగా ఉండడంతో ముందుకురాని కొనుగోలుదారులు చీరాల రూరల్, న్యూస్‌లైన్ : లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు యూనిట్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆదాయం రాకపోవడం, నిర్వహణ పెరిగిపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లా మొత్తమ్మీద చీరాలలో మాత్రమే ఈ యూనిట్లు ఉన్నాయని గొప్పలు చెప్పుకునే అధికారులు వాటిని సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం ఉన్నత పాఠశాలకు సమీపంలో రెండు వ ర్మీ కంపోస్టు యూనిట్లు, కారంచేడు రోడ్డులో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. వాటికి విద్యుత్‌తో పాటు నీటి వసతి, యూనిట్లో పనిచేసేందుకు ఐదుగురు కార్మికులను ఏర్పాటు చేశారు. కారంచేడు రోడ్డులో ఏర్పాటు చేసిన యూనిట్ నిర్మించిన నెలలోపే మూసివేశారు. యూనిట్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు సామగ్రితో సహా విద్యుత్ మీటరు ఇనుపకంచెలు దొంగల పరమయ్యాయి. ఎన్‌ఆర్‌అండ్‌పీఎం ఉన్నత పాఠశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన రెండు యూనిట్లలో మాత్రం పనులు ప్రారంభించారు. రెండు యూనిట్లలో పనులు చేసేందుకు ఐదుగురు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను నియమించారు. వారికి నెలకు రూ.35వేలు వరకు మున్సిపాలిటీ జీతాలు చెల్లించాల్సి ఉంది. అంతేకాక విద్యుత్ చార్జీలు నెలకు రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. రెండు టన్నుల ఎరువును తయారుచేయడానికి కార్మికులకు మూడు నెలల సమయం పడుతుంది. యూనిట్లో తయారైన ఎరువు కేజి రూ.20గా మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. రెండు టన్నుల ఎరువు రూ.20 లెక్కన రూ.40వేలు అవుతుంది అంటే మూడు నెలలకు కేవలం రూ.40వేలు మాత్రమే ఆదాయం వస్తుం దన్న మాట. రెండు యూనిట్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు నెలకు రూ.35వేలు పైమాటే, వాటి నిర్వహణకు అదనంగా మరో రూ.2వేలు ఖర్చవుతుంది. అంటే సిబ్బందికి, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు లక్షపైమాటే. యూనిట్లో తయారయ్యే కేజీ ఎరువు రూ.20గా నిర్ణయించడంతో కొనుగోలుదారులూ ముందుకు రావడంలేదు. మూడు నెలలుగా తయారైన ఎరువు యూనిట్లోనే మగ్గిపోతుంది. యూనిట్లలో వచ్చే ఆదాయంతో పోల్చితే ఉత్పత్తికి అయ్యే ఖర్చే అధికంగా ఉంటుంది. చనిపోతున్న వానపాములు ఎండాకాలం కావడంతో వానపాములు చనిపోతున్నాయి. అవి చనిపోకుండా ఉండాలంటే వాటికి పూర్తిస్థాయిలో నీరు పెట్టాల్సి ఉంది. కానీ విద్యుత్ కోతలు అధికంగా ఉండడంతో యూనిట్లకు నీరుపెట్టడం లేదు. ఆదాయం కంటే యూనిట్లకు అయ్యే ఖర్చు అధికంగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై శానిటరీ సూపర్వైజర్ బషీర్‌ను ఁన్యూస్లైన్* వివరణ కోరగా యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం కంటే వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు అధికంగా ఉన్నమాట వాస్తమేనన్నారు. కానీ యూనిట్లు నెలకొల్పింది ఆదాయం కోసం కాదని ఇళ్లు, మార్కెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు మాత్రమేనని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగమే యూనిట్లు ఏర్పాటని చెప్పారు. -
నాకిది..నీకది..
చీరాల, న్యూస్‌లైన్ : ‘అందరం అధికార పార్టీకి చెందినవారమే. మన మధ్య వివాదాలొద్దు. పోటీలూ వద్దు. పనులన్నీ వాటాలుగా పంచుకుందాం. నిబంధనలతో మనకు పనిలేదు. అధికారులంతా మనకు అనుకూలమే. వారికి ముట్టచెప్పాల్సినవి ముట్టచెప్తే సరి. ఎటువంటి సమస్య ఉండదని’ అంటున్నారు చీరాల మున్సిపాలిటీలోని కాంట్రాక్టర్లు. అందినకాడికి దండుకునేందుకు నిబంధనలు తుంగలో తొక్కారు. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లను అనుకూలంగా మార్చుకుని పనులను వాటాలుగా పంచుకుంటున్నారు. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నా మున్సిపల్ అధికారులెవ్వరూ నోరుమెదపడంలేదు. పర్సంటేజీలు పుచ్చుకుని మిన్నకుండిపోయారన్న ఆరోపణలున్నాయి. చీరాల మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం లక్ష రూపాయలు దాటి తే ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఏ ప్రాంతం వారైనా టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇటువంటిదేమీ ఇక్కడ జరగడం లేదు. బయటి వ్యక్తులు, అధికార పార్టీ అండదండలేని వారు టెండర్లు వేస్తే వాటిని ఏదో కారణంతో తిరస్కరించడంతో పాటు ఒక పనులు చేసినా బిల్లులివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో బయటి వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనడంలేదు. కొంతకాలం నుంచి ఉన్నా అధికార పార్టీ అండదండలున్న కాంట్రాక్టర్లు మాత్రమే ఒక ‘పద్ధతి’ ప్రకారం పనులు పంచుకుంటున్నారు. వారుమాత్రమే అంచనాల రేట్లకు, లేదంటే నాలుగుశాతం తక్కువకు టెండర్లు వేస్తున్నారు. సింగిల్ టెండర్‌ను ఆమోదించడం సాధ్యం కాకపోవడంతో మరో డమ్మీ టెండరును వేస్తున్నారు. దక్కించుకున్న పనులను పంచుకుంటున్నారు. మున్సిపాలిటీలో నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద 1.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు టెండర్లు పిలిచారు. జనరల్ ఫండ్ కింద 10 లక్షలతో టెండర్లు జరిగాయి. అలానే పీఆర్సీ బిల్డింగ్ నిధులు 17 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎస్ఎఫ్టీ గ్రాంట్ 70 లక్షలతో డివైడర్ల అభివృద్ధి, మంచినీటి పైపులైను పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ అధికార పార్టీ నాయకులే పలహారంగా పంచుకున్నారు. పారిశుధ్య కాంట్రాక్టు పనులు కూడా పంపిణీనే.. మున్సిపాలిటీలోని నాలుగు డివిజన్లలో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గాను ఒకటో డివిజన్లో 11 మంది, 2వ డివిజన్లో 39 మంది, 3వ డివిజన్లో 33, 4వ డివిజన్లో 140 మంది పనిచేస్తున్నారు. మొత్తం 235 మంది కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనుల్లో ఉన్నారు. వీరికి నిబంధనల ప్రకారం కాంట్రాక్టు కార్మిక సొసైటీలకు మాత్రమే పనులివ్వాలి. అందులో కూడా 235 మంది కార్మికులు ఆ సొసైటీల్లో సభ్యులై ఉండాలి. కానీ అటువంటిదేమీ లేదు. అధికార పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కొందరు యూనియన్ నాయకులకు శనివారం పనుల పందేరం జరిగింది. దీంతో కార్మికులు నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కో కాంట్రాక్టు కార్మికుడికి మున్సిపాలిటీ నెలకు 6700 చెల్లిస్తోంది. ఈఎస్ఐ, పీఎఫ్ పోను 5775 కాంట్రాక్టు కార్మికుల ఖాతాల్లోకి జమవుతుంది. అయితే బోగస్ సొసైటీలు నడుపుతున్న వారు కాంట్రాక్టు కార్మికుల బ్యాంకు ఖాతాల ఏటీఎం కార్డులు వారి వద్దనే ఉంచుకుని ప్రతినెలా వారి ఖాతా నుంచి డ్రా చేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క కార్మికుడికి 3 లేదా 4 వేలు మాత్రమే అందిస్తారు. ఇదేమిటని అడిగే నాథుడే లేరు. కాంట్రాక్టు కార్మికులు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ కార్మికుడికి మరుసటి రోజు నుంచి పని ఉండదు. దీంతో వారు బాధను దిగమింగుకుని మౌనం దాలుస్తున్నారు.