'హేమకు చాలాసార్లు డబ్బులిచ్చా'
ముంబై: ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయతో తనకు ఎలాంటి వివాదాలూలేవని, ఇప్పటికీ ప్రేమిస్తున్నానని ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ పోలీసుల విచారణలో చెప్పాడు. తమ మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలను కూడా పరిష్కరించుకున్నట్టు తెలిపాడు. హేమ ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది భంభానీలు ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే.
గతంలో చింతన్తో విభేదాల కారణంగా హేమ విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే ఆమె హత్యకు గురైంది. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హేమ భర్త చింతన్ను విచారించారు. 'విడాకులకు దరఖాస్తు చేసినపుడు ఓ ఫ్లాట్ విషయంలో మా మధ్య వివాదాలుండేవి. ఈ ఫ్లాట్ కావాలని హేమ పలుసార్లు కోరగా, నేనెప్పుడూ తిరస్కరించలేదు. ఈ ఫ్లాట్ అమ్మేసి డబ్బును చెరి సగం పంచుకుందామని చెప్పాను. నేను ఢిల్లీలో ఉన్నా.. ముంబై వచ్చినప్పుడల్లా హేమ ఇంట్లోనే ఉండేవాడిని. మా ఇద్దరి మధ్య సమస్యులు లేవు. చాలా సార్లు ఆమె డబ్బు అడగ్గా, నేను సాయం చేశాను. హేమ అదృశ్యమైన రోజు కూడా నేను 2 లక్షల రూపాయలను భరణం కింద ఆమె లాయర్‌కు ఇచ్చాను' అని చింతన్ పోలీసులకు చెప్పాడు. హేమ అంత్యక్రియలకు చింతన్ హాజరయ్యాడు.