breaking news
chinna shankaram pet
-
ప్రధాన పార్టీల నేతలకే తలపోటు
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండలంలోని అంబాజిపేట ఎంపీటీసీ స్థానం ప్రధాన పార్టీల అధ్యక్షులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ అభ్యర్థులకన్నా ఆయా పార్టీల అధ్యక్షులకే టెన్షన్ ఎక్కువైంది. అంబాజీపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో అంబాజిపేటతోపాటు కామారం గ్రామాలు ఉన్నాయి. అంబాజిపేటలో 728 ఓట్లు, కామారంలో 904 ఓట్లు ఉన్నాయి. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు పూలపల్లి యాదగిరి సతీమణి మంజుల యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈమె గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంపీటీసీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున అంబాజిపేటకు చెందిన ద్యాప మణెమ్మ పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, అంబాజిపేటకు చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ సమీప బంధువు లతాశ్రీని బరిలో నిలిపారు. బీజేపీ నాయకులు కామారం గ్రామానికి చెందిన జూకోటి లక్ష్మిని అభ్యర్థిగా పోటీలో దింపారు. ప్రధాన పార్టీల నేతలకు సవాల్.. అంబాజిపేట స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మండల అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్.రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపయ్యగారి రాంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పాపయ్యగారి రాజిరెడ్డిలది కామారం గ్రామం. వీరందరిదీ ఒకే గ్రామం కావడంతో ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. అదీగాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సుభాష్‌రెడ్డి స్వయాన సోదరులు. టీఆర్ఎస్, బీజేపీ అధ్యక్షులు కూడా సొంత అన్నదమ్ములు. ఇలా ఆయా పార్టీ నేతల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థులు సైతం ఆయా పార్టీ నేతలకు సమీప బంధువులు, అనుచర వర్గమే కావడంతో అభ్యర్థుల కన్నా సదరు పార్టీల నాయకులకే టెన్షన్ ఎక్కువైంది. ఆ మేరకు ప్రచారాన్ని కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఓ రకంగా ఇది పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోరుగా మారడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -
అయ్యో.. ఇదేం నిరీక్షణ
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 291 మంది విద్యార్థినులుంటారు. ఇక్కడ 21 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే అందులో ప్రాధానోపాధ్యాయురాలితో కలుపుకొని 11 మంది మహిళలున్నారు. వీరి కోసం కనీసం నాలుగైదు టాయిలెట్స్ ఉండాలి. 120 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ ఇక్కడ వందల మంది విద్యార్థినీ, విద్యార్థులున్నా ఒకే మరుగుదొడ్డి ఉండడంతో అవస్థలు పడుతున్నారు. అరగంటకుపైగా.. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉండడంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. టాయిలెట్‌కు వెళ్లాలని భావిస్తే కనీసం అరగంట నుంచి గంట సేపు వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు. తరగతి గది నుంచి వెళ్లి టాయిలెట్ వద్ద క్యూ కట్టాల్సి వస్తుంది. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. టాయిలెట్‌కు వెళ్లే ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు కొందరైతే దాహం వేసినా మంచి నీళ్లు తాగడం మానేశారు. ఇంకొందరైతే బలవంతంగా ఆపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుండడం వల్ల తరగతి గదిలో విద్యార్థినుల ఏకాగ్రత లోపిస్తున్నట్టు సమాచారం. తరగతుల వారీగా ఇంటర్వెల్.. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధ్యాయులు తరగతుల వారీగా ఇంటర్వెల్‌కు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రకంగానైనా విద్యార్థినులు తరగతి గదికి చేరుకునే సరికి అరగంట అవుతున్నట్టు తెలుస్తోంది. అదనపు గదులను నిర్మించేందుకుగాను ఏడాది కిందట నిర్వహించిన శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలకు వచ్చిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. జెండా పండుగలకు వచ్చినప్పుడల్లా గ్రామపెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఏర్పాటు కావడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.