breaking news
Charon
-
ప్లూటోకు ‘చందమామ’ రక్ష!
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహమైన ప్లూటోపై ఉన్న వాతావరణం తరిగిపోకుండా దాని ఉపగ్రహం(చందమామ) కారన్ కాపాడుతోందని తాజా పరిశోధనలో తేలింది. ప్లూటో చుట్టూ కవచాన్ని ఏర్పరచి సౌర పవనాలను దానికి దూరంగా దారి మళ్లిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్లూటో, కారన్కు మధ్య ఉన్న సంబంధం.. అలాగే సౌర పవనాల నుంచి కారన్ ఎలా కాపాడుతోందన్న దానిపై లోతైన అధ్యయనం చేశారు. ప్లూటో వ్యాసార్థం కన్నా ఎక్కువ పరిమాణంలో ఉండే కారన్ కేవలం 19,312 కిలోమీటర్ల దూరం నుంచే పరిభ్రమిస్తుంది. సూర్యుడికి, ప్లూటోకు మధ్య వచ్చినపుడు కారన్ అక్కడి వాతావరణాన్ని కాపాడుతుందని పరిశోధన చెబుతోంది. కారన్కు సొంత వాతావరణమంటూ ఏదీ లేదని, అయితే అది ఏర్పడ్డపుడు ప్లూటో చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచి, సౌరపవనాల నుంచి ప్లూటోను కాపాడుతుందని జార్జియా టెక్ అసోసియేట్ ప్రొఫెసర్ కారోల్ పాటీ వివరించారు. న్యూ హరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించి, భూమిపైకి పంపిన విషయాల ఆధారంగా పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
ప్లూటో ఉపగ్రహంపై మంచుగడ్డలు
వాషింగ్టన్: ప్లూటోకు ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన హైడ్రాపై మంచుగడ్డలు పేరుకుపోయినట్లు నాసా అంతరిక్ష వాహకనౌక పంపిన సమాచారం ద్వారా తెలిసింది. తొలిసారిగా ఈ వాహకనౌక ప్లూటో ఉపగ్రహాల గురించి సమాచారాన్ని పంపింది. ప్లూటో ఉపగ్రహాల్లో అతి పెద్దదైన చరోన్పై కూడా మంచు గడ్డలు పేరుకుపోయాయి. అయితే చరోన్ కన్నా హైడ్రాకు మంచు నీటిని శోషించుకునే సామర్థ్యం ఎక్కువ. అందువల్ల చరోన్ కన్నా హైడ్రాపై ఉన్న మంచు రేణువులు పెద్దవనీ, కొన్ని కోణాల్లో ఎక్కువ కాంతిని పరావర్తనం చెందిస్తాయని శాస్త్రవేత్తలంటున్నారు.