breaking news
Chairman Selection
-
రసవత్తరం.. సహకార రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా కాంగ్రెస్‌లో హల్చల్ మొదలైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఎన్నిక ఆ పార్టీలో లుకలుకలకు దారితీసింది. డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ నెల 8వ తేదీన (బుధవారం) ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ సంస్థాగత రాజకీయ ఒప్పందాల నేపథ్యంలో చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి తన పదవికి గత నెల 15వ తేదీన రాజీనామా చేశారు. ఫలితంగా చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉంది. కానీ అంత సానుకూలమైన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ చేతిలో ఉన్న 19 మంది డెరెక్టర్లంతా ఏకతాటిపై నిలబడతారా లేదా అన్న సంశయం నెలకొంది. మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల మధ్య ఎన్నికల ముందు ఓ ఒప్పందంకుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా చైర్మన్ విజ యేందర్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. జానారెడ్డి అనుచరుడైన విజయేందర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుడైన వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు చెరి రెండున్నరేళ్లు ఛైర్మన్ పదవిలో కొనసాగేలా ఒప్పం దం కుదుర్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జనవరిలో చైర్మన్ విజయేం దర్‌రెడ్డి సెలవుపై వెల్లడంతో ఆరునెలల పాటు వైస్ చైర్మన్ పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్‌గా పదవిలో కొనసాగారు. తిరిగి జూన్ చివరిలో విజయేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి విజ యేందర్‌రెడ్డిని పదవి నుంచి తప్పించడానికి కాంగ్రెస్ పార్టీకే చెందిన డెరైక్టర్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. ఆరునెలలు సెలవుపై వెళ్లడంతోపాటు మూడు సమావేశాలకు హాజరుకానందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏకంగా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఏకతాటిపై..అనుమానమే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోవడంతో ఇద్దరు మాజీ మంత్రుల మాటలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లంతా ఏకతాటిపై ఉంటారా అనేది అనుమానామే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొత్తం 21మంది డెరైక్టర్లలో 20 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. టీడీపీకి చెందిన ఏర్పుల సుదర్శన్‌ను మినహాయిస్తే అంతా కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాపల లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్ల సంఖ్య 19కి పడిపోయింది. 8వ తేదీన జరగనున్న ఛైర్మన్ ఎన్నికలో టీసీఎల్పీ నేత జానారెడ్డి వర్గీయులు పాండురంగారావుకు అనుకూలంగా ఓటు వేస్తారా అన్నది కూడా అనుమానమేని ప్రచారం జరుగుతోంది. పోటీ తప్పదా..? చైర్మన్ ఎన్నికలో వైస్ ైఛైర్మన్ పాండురాంగారావు గట్టిపోటీ తప్పదు. ఇప్పటికే పాండురంగారావుకు వ్యతిరేకంగా ఉన్న డెరైక్టర్లంతా ఏకమై రహస్య ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితులలో పాండురంగారావుకు చైర్మన్ పదవిని దక్కనివ్వవద్దని కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు డెరైక్టర్లు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి క్యాంపులు నిర్వహిస్తూ డెరైక్టర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇదీ .. షెడ్యూలు ఎన్నికకు సంబంధించి గత నెల 29న రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న, జిల్లా సహకార ఆడిట్ అధికారి లక్ష్మినారాయణ ‘సాక్షి’కి తెలిపారు. నామినేషన్ స్వీకరణ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. నామినేషన్ల పరిశీలన 11.30 నుంచి 12 గంటల వరకు, నామినేషన్ల ఉపసంహరణ 12 గంటల నుంచి 2 గంటల వరకు. అభ్యర్థుల తుది జాబితాను 2.30 గంటలకు ప్రకటిస్తారు. ఓటింగ్ 3గంటల నుంచి 5 గంటల వరకు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5.30గంటలకు నిర్వహించి అనంతరం విజేతను ప్రకటిస్తారు. -
8న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ను ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8న చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 8వ తేదీన ఒక్కరోజే ఎన్నికల ప్రక్రియ మొత్తం చేపట్టాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రక్రియ మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలని కోరారు. కాగా, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార ఆడిట్ అధికారి లక్ష్మీనారాయణను నియమించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీసీసీబీ చైర్మన్ యెడవెల్లి విజయేందర్‌రెడ్డి ఈనెల 15వ తేదీన తన రాజీనామాను కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్‌కు అందజేశారు. చైర్మన్ రాజీనామాను ఆమోదించిన అధికారులు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. డీసీసీబీ పాలకమండలిలో 21మంది డెరైక్టర్లు ఉన్నారు. అక్టోబర్8న జరగబోయే ఓటింగ్‌లో డెరైక్టర్లందరూ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.