వరించిన పదవి
► చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా పుష్కర్ రామ్మోహన్రావు నియామకం
► ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్‌గా ప్రస్తుతం బాధ్యతలు
► సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తొలి అడుగు
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయి పదవి లభించింది. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా జిల్లాకు చెందిన పుష్కర్ రామ్మోహన్‌రావును సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియమించారు. మందమర్రికి చెందిన రామ్మోహన్రావు గత 31 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నారు.
తెలుగు, హిందీ భాషలకు చెందిన 25 సినిమాలను నిర్మించడంతో పాటు పంపిణీదారుడుగా 250 సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసిన రికార్డు ఉంది. మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సీఈవోగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్‌రావుకు మంచిర్యాల హైటెక్‌సిటీ కాలనీతో అనుబంధం ఉంది. పునర్విభజన తరువాత ఏర్పాటైన కొత్త జిల్లాకు ఇదే తొలి కార్పొరేషన్ చైర్మన్ పదవి కావడం విశేషం.
గత ఎన్నికల సమయంలో మెరిసి...
2014 ఎన్నికల సమయంలోనే మంచిర్యాల శాసనసభస్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని రామ్మోహన్రావు భావించారు. అభ్యర్థి ఎంపిక చివరి వరకు పోటీలో ఉన్న ఆయనకు వివిధ సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్టు లభించలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు మిగిలి ఉన్న సమయంలో కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం సంపాదించడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మంచిర్యాల టిక్కెట్టుకు ప్రధాన పోటీదారుడిగా రామ్మోహన్రావు బరిలో ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి.
టీవీ, చలనచిత్ర రంగ అభివృద్ధికి కృషి...
ఈ సందర్భంగా రామ్మోహన్రావు సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తెలంగాణలో చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమతో తనకు అనుబంధం ఉందని, సినీ నిర్మాతగా, పంపిణీదారుడిగా పరిశ్రమకు చెందిన వారందరితో సాన్నిహిత్యం ఉందని ఆయన చెప్పారు.
తన అనుభవానికి తోడు పరిశ్రమ పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని టీవీ, చలనచిత్ర రంగాలను మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ రంగంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి ఈ పదవి కట్టబెట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.