పాఠశాలల్లో సెల్ టవర్లు వద్దు!
ముంబై: నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రి భవనాలపై ప్రభుత్వం సెల్ టవర్లను నిషేధించినట్లు ప్రకటన జారీ చేసింది. కొందరు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ ఈ ప్రకటనలో ఉన్న ఉన్న కొన్ని లొసుగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో సూచించిన వివరాల మేరకు.. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల ఆవరణల నుంచి మూడు మీటర్ల వరకు ఈ సెల్ టవర్ల ఏర్పాటును నిషేధించాలని సూచించారు. అంతేకాకుండా సెల్ టవర్ యాంటీనాలను నేరుగా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల దిశగా ఉంచకూడదని పేర్కొన్నారు.
కాగా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల్లో నిర్దిష్ట కాలపరిమితితో టవర్లను ఏర్పాటు చేసుకోవచ్చని ఇటీవల పట్టణాభివృద్ధి శాఖ ఒక ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీటిని నిషేధించడంతో ఇంతకు ముందు ఏర్పాటుచేసిన వాటిని గడువు పూర్తి కాగానే తొలగించాలని హెచ్చరించారు. అంతేకాకుండా ఇక మీదట గడువు పెంచబోమని స్పష్టం చేశారు. రేడియేషన్ నిరోధక కార్యకర్త ప్రకాష్ మున్షీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు, ఆస్పత్రుల భవనాలపై ఈ సెట్ టవర్ల నిషేధం అంగీకారయోగ్యమైనప్పటికీ భవనంలోని చివరి అంతస్తుల్లో ఉన్న వారి అనుమతి తీసుకొని సెల్ టవర్లను అమర్చాలని సూచిస్తున్నారు. అయితే భవనాలపై ఈ సెల్ టవర్లను అమర్చడం కోసం 70 శాతం కుటుంబాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పొందుపర్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, ఆస్పత్రుల భవనాలపై సెల్ టవర్లు అమర్చే ప్రక్రియ నిషేధించడంతో టెలికాం నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పాఠశాలలు, ఆస్పత్రి భవనాలపై సెల్ టవర్లను అమర్చడం వల్ల ఎలాంటి నష్టం చేకూరదని స్పష్టం చేశారు. వీటిని అమర్చే ప్రక్రియ నిషేధించినట్లయితే కనెక్టివిటీకి ఆటంకం కలుగుతుందని, అదేవిధంగా కాల్ డ్రాప్ అయ్యే ఆవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
సెల్ టవర్లను అమర్చే భవనం పాఠశాలలు, ఆస్పత్రులకు కనీసం మూడు మీటర్ల దూరం వరకు ఉండేవిధంగా ప్రభుత్వం నిర్ధారించాలని మున్షి కోరారు. ఇందుకు గాను పబ్లిక్ ఫిర్యాదుల కమిటీని నియమించాలని ఇంతకు ముందే డిమాండ్ చేశామన్నారు. కాగా సెల్ టవర్ల బరువును తట్టుకునే సామర్ధ్యం గల భవనాలపైన మాత్రమే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఐదేళ్ల వరకు వీటిని అమర్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.