breaking news
cars stealing
-
‘ప్లేట్’ మార్చి.. అమ్మేసి...
మిర్యాలగూడ టౌన్: ఓ రాష్ట్రంలో కార్లు దొంగిలించేవాళ్లు. ఇంజిన్, నంబర్ ప్లేట్ మార్చి ఇంకో రాష్ట్రంలో అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. కొంతకాలంగా దందా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.24 కోట్ల విలువ గల 20 కార్లు, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో దొంగిలించి నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బోత్యాతండాకు చెందిన రమావత్ సిరి నాయక్, హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన కొడిమళ్ల పరిపూర్ణాచారి, మెదక్ జిల్లాకు చెందిన నర్సింహ.. ఫైనాన్స్ వాహనాల వేలం పాట వద్ద పరిచయమయ్యారు. వేలంలో వాహనాలు దక్కించుకొని అమ్ముకునే వారు. వీళ్లకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బొప్పా ఘోష్ పరిచమయ్యాడు. ఢిల్లీ, స్వరాష్ట్రంలో దొంగిలించిన కార్లకు ఇంజిన్, నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు నర్సింహ, పరిపూర్ణాచారి, నాయక్ ముఠాకు ఘోష్ అమ్మేవాడు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన పులాయిత్ అలీఖాన్, సికింద్రాబాద్‌కు చెందిన కలీంఖాన్, శైలేందర్ సింగ్, అంజద్ హుస్సేన్, మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్లుగా పని చేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్ ముఠాకు కూడా కార్లు అమ్మేవాడు. ఇలా రెండు ముఠాలకు కలిపి ఢిల్లీలో అపహరించిన 16 కార్లను ఘోష్ అమ్మాడు. మిర్యాలగూడ వాసి ఫిర్యాదుతో.. పశ్చిమ బెంగాల్ నంబర్ ప్లేట్‌తో ఉన్న రెండు కార్లను సిరినాయక్, పరిపూర్ణాచారి ఇటీవల మిర్యాలగూడకు చెందిన వీరస్వామికి అమ్మి కొంత డబ్బు తీసుకున్నారు. మిగిలిన డబ్బులు ఎన్ఓసీ (ఈ వాహనంపై ఎలాంటి కేసులు, ఫైనాన్స్ లేదు) వచ్చాక ఇవ్వమని చెప్పారు. వాళ్లు మిగతా డబ్బుల కోసం రాకపోవడంతో అనుమానం వచ్చి వీరస్వామి పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. సిరినాయక్, పరిపూర్ణాచారిలను పోలీసులు విచారించగా డొంక కదిలింది. చోరీ చేసిన కార్లకు ఘోష్ నకిలీ ఎన్ఓసీ పంపగా మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్.. మంచిర్యాల ఆర్టీఏ అధికారులతో మాట్లాడి సుమారు 5 నుంచి 8 వాహనాలకు తెలంగాణ నంబర్ ప్లేట్లు వచ్చేటట్లు మార్చారు. పోలీసులు మొదటి ముఠా నుంచి 7, రెండో ముఠా నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. -
77 ఏళ్లు వచ్చినా.. ఆ పని మానలేదు
పాత చెడు అలవాట్లను మానడం కొందరికి చాలా కష్టం. సూపర్ నట్వర్లాల్, ఇండియన్ చార్లెస్ శోభ్‌రాజ్, సూపర్ థీఫ్ పేర్లతో పోలీసుల రికార్డుల్లో నమోదైన ఢిల్లీకి చెందిన ధనరామ్ మిట్టల్ కూడా ఈ కోవకు చెందినవాడే. 77 ఏళ్ల వయసు వచ్చినా, వృద్ధాప్యం మీద పడినా దొంగతనాలు చేయడం మానుకోలేదు. పాతికేళ్ల వయసులో దొంగతనాలు చేయడం మొదలెట్టిన మిట్టల్ ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టయ్యాడు. తన జీవితంలో 52 ఏళ్లు నేరవృత్తిలో కొనసాగాడు. అతనిపై కనీసం 128 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీస్ అధికారిగా, జడ్జిగా, ప్రభుత్వ అధికారిగా బోల్తా కొట్టించి ఎంతోమందిని మోసం చేశాడు. దాదాపు 500 కార్లను దొంగలించినట్టు పోలీసులు చెప్పారు. మిట్టల్ దొంగతనం కేసులో తొలిసారి 1964లో జైలు కెళ్లాడు. అప్పటి నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.. పోలీసులు అరెస్ట్ చేయడం.. జైలుకు వెళ్లడం.. అక్కడ కొత్త గ్యాంగ్‌లు ఏర్పాటు చేయడం.. విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయడం షరా మాములే. ఈ ఏడాది మొదట్లో కారును దొంగిలించిన కేసులో అరెస్టయిన మిట్టల్ గత నెలలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. జూన్‌లో కనీసం నాలుగు కార్లను దొంగలించినట్టు మిట్టల్‌పై ఆరోపణలు ఉన్నాయి. గత మంగళవారం పోలీసులు మళ్లీ మిట్టల్‌ను అరెస్ట్ చేశారు. నేరాలబాట పట్టిన మిట్టల్ న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ కావడం విస్తుపోయే విషయం. 1960ల్లో రోహ్టక్ కోర్టులో క్లర్క్‌గా పనిచేశాడు. అప్పట్లో జడ్జి సెలవుపై వెళ్లడంతో మిట్టల్ చాలామంది నేరస్తులకు బెయిల్ మంజూరు చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. దొంగల తరపున కోర్టుల్లో కేసులు కూడా వాదించాడు. నకిలీ పత్రాలతో రోహ్టక్ రైల్వే స్టేషన్ మాస్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఏడాది తర్వాత ఈ ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. మిట్టల్ భార్య, కోడలుతో కలసి ఢిల్లీ శివారుప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని ఇద్దరు కొడుకులు మాత్రం వేరుగా ఉంటున్నారు.