వాళ్లిద్దరినీ చూశా! సినిమా తీశా!!
‘క్యాలెండర్ గళ్స్’... ఇప్పుడు హిందీ రంగంలో హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ఇది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. మేడిపండులా కనిపించే కొన్ని వ్యవస్థల వెనుక చీకటి కోణాలను ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. మధుర్ గత చిత్రాలు ‘పేజ్-3’, ‘కార్పొరేట్’, ‘హీరోయిన్’, ‘ఫ్యాషన్’లే అందుకు ఉదాహరణ. ఇక, ‘క్యాలెండర్ గళ్స్’ విషయానికొస్తే... అయిదుగురు మోడల్స్ జీవితంలో జరిగే సంఘటనల నేపథ్యంలో జరిగే కథ అని ఇప్పటికే మధుర్ భండార్కర్ ప్రకటించారు.
ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని తెర కెక్కించా రట. వాళ్లెవరో కాదు... ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏటా విజయ్ మాల్యా కొంత మంది మోడల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ ఒక్క క్యాలెండర్‌తో సినిమా అవకాశాలు కొట్టేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో దీపికా పదుకొనే ఒకరు.
అలా ఆమె బాలీవుడ్‌లోకి కూడా ఎంటరై, టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. ‘‘క్యాలెండర్ గళ్‌గా కెరీర్లో ఒక్కసారిగా తారస్థాయికి చేరిన మోడల్స్ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించా. ప్రతి రంగంలోనూ మంచి, చెడులు ఉంటాయి. మోడలింగ్ రంగంలో కూడా అంతే. వాటినే ఈ సినిమాలో చూపించా. అంతే గానీ నేను ఆ రంగానికి వ్యతిరేకిని కాను’’ అని మధుర్ భండార్కర్ చెప్పారు.