breaking news
Cainsnacing
-
అంతర్జిల్లా దొంగల అరెస్ట్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : వరంగల్, హైదరాబాద్ నగరాల్లో చైన్‌స్నాచింగ్, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, సోనీ ఎల్సీడీ టీవీ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఓదెల మండలం రూపునారాయణ గ్రామానికి చెందిన ఐలవోని రామకృష్ణ, విశాఖపట్నంకు చెందిన దండేటి నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. రామకృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడిన అతడికి తనకు వచ్చే జీతం సరిపోక మోటార్ సైకిల్, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడటంతో 2012లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతడు శిక్షా కాలం పూర్తి చేసుకొని తిరిగి వచ్చి ఫుడ్ క్యాటరింగ్లో పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవ న్ ప్రాంతానికి మకాం మార్చాడు. ఇదే ఎన్టీఆర్ భవన్ ప్రాంతంలో ఒకరి వద్ద రెండో నిందితుడు దండేటి నాగరాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన యజమాని ఇంటి వద్ద కారు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో అతడు కారును రామకృష్ణ నివాసముంటున్న ఇంటి పరిసరాల్లోని చెట్ల నీడలో పార్కింగ్ చేసుకుని సేద తీరేవాడు. ఈ క్రమంలోనే నాగరాజు, రామకృష్ణ మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలసి జల్సాలు చేయడంతోపాటు చెడు వ్యసనాలకు బానిసలై తమ సంపాదన సరిపోకపోవడంతో జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇద్దరు కలిసి వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డారు. హన్మకొండ, సుబేదారి, మట్టెవాడ పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు చైన్‌స్నాచింగ్‌లు, సుబేదారి ప్రాంతంలో ఒక చోరీ, హైదరాబాద్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం నిందితులు తమ వద్ద ఉన్న దొంగసొత్తును వరంగల్ చౌరస్తాలోని బులియన్ మార్కెట్లో అమ్మేందుకు రాగా సమాచారం అందుకున్న డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము పాల్పడిన నేరాలను ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్, ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, ఎస్సై లక్ష్మీనారాయణ, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, రవి, సల్మాన్‌పాషా, జంపయ్య, హోంగార్డు రవికి అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు చేతుల మీదుగా రివార్డులను అందజేయడం జరుగుతుందని డీఎస్పీ వెల్లడించారు. -
రెండు ముఠాలకు చెందిన ఏడుగురి అరెస్టు
చందానగర్, న్యూస్‌లైన్: పోలీసులమని ఇళ్లలోకి చొరబడి కత్తులో బెదిరించి నగలు దోచుకోవడంతో పాటు బాధితుల నుంచి ఏటీఎం కార్డు తీసుకొని డబ్బు డ్రా చేస్తున్న ఓ దోపిడీ ముఠాతో పాటు చోరీలకు పాల్పడుతున్న మరో అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రూ. 19 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన రాజేంద్రకుమార్(24) చిన్నతనంలోనే నగరానికి వచ్చాడు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన చాకలి రవి(24)తో 2010లో పరిచయమైంది. ఇద్దరూ పంజగుట్ట ఠాణా పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు. తర్వాత వీరు సనత్‌నగర్‌కు చెందిన ఎర్నాల ప్రభు(25), శ్రీకాకుళంకు చెందిన బోది రాజ్‌కుమార్ (20)లతో కలిసి ముఠా కట్టారు. నలుగురూ పోలీసులమని చెప్పి ఓ ఇంటిలోకి వెళ్లేవారు. ఆ ఇంట్లో ఉన్నవారిని కత్తులతో బెదిరించి బంగారు నగలు తీసుకొనేవారు. ఈ విధంగా మియాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, కీసర, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో పది దోపిడీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగలతో పాటు బాధితులను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకోవడంతో పాటు పిన్ నెంబర్లు తీసుకున్నారు. ఒక కార్డు ద్వారా రూ. 60 వేలు, మరో కార్డు ద్వారా రూ. 2,800లు డ్రా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... నిందితులు రాజేంద్రకుమార్, రవి, ప్రభు, రాజ్‌కుమార్‌లు గురువారం చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... దోపిడీలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. అంతర్జిల్లా ముఠా... మెదక్ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట బాలింగం(21) నగరంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అమీర్‌పేట్‌లో ఉంటున్నాడు. ఇతను కరీంనగర్ జమ్మికుంటకు చెందిన రాచపల్లి మహేశ్(23)తో కలిసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఏడు చోరీలకు పాల్పడ్డారు. చోరీ సొత్తును జమ్మికుంటకు చెందిన గాలిపల్లి పద్మాచారి(37)కి విక్రయిస్తున్నారు. చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలింగం, మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... తమ చోరీల గుట్టువిప్పారు. పోలీసులు పద్మాచారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాల నుంచి మొత్తం 54 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు,4 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ఫోన్లు, 2 కెమెరాలు, రూ. 34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీ, షర్మిలా, మాదాపూర్ ఏసీపీ రాంనర్సింహారెడ్డి, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, కూకట్పల్లి, మల్కాజిగిరీ సీసీఎస్ ఇన్స్పెక్టర్లు సంజీవరావు, మహ్మద్‌గౌస్, చందానగర్ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.